కోహెడ(హుస్నాబాద్),వెలుగు : కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 15వ వార్డు సభలో మంత్రి పాల్గొన్నారు. రూ.2 కోట్లతో పునరుద్ధరించిన ఆర్టీసీ బస్టాండ్‌ను కలెక్టర్ మను చౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల మంజూరులో ప్రజాప్రతినిధుల జోక్యం ఉండదని, లిస్టులో పేరు రాకుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
మార్చిలో రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణమాఫీ కంప్లీట్ చేస్తామన్నారు. ఏడాదిలో రూ. 134 కోట్ల మంది మహిళలను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క బస్సు కొనలేదన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయబోతున్నట్లు తెలిపారు. గతంలో 3,500 మంది రిటైర్ అయినా, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని తెలిపారు. లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ రజిత ఉన్నారు.