మంత్రాల పేరుతో.. అమానవీయ హత్యలు

మంత్రాల పేరుతో.. అమానవీయ హత్యలు
  • నెల వ్యవధిలోనే పదుల సంఖ్యలో మర్డర్లు
  • రోజురోజుకు పెరుగుతున్న దాడులు
  • పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల దాకా చేరేవి కొన్ని ఘటనలే...
  • అవగాహన కల్పించే వారు లేక తప్పని ఇబ్బందులు

మహబూబాబాద్,వెలుగు: శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిన ప్రస్తుత పరిస్థితుల్లోనూ గ్రామాలు, పట్టణాల్లో కొందరు వ్యక్తులు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు. తమకు కావాల్సిన వారికి చిన్న జ్వరం వచ్చినా చాలు.. ఎవరో మంత్రాలు, చేతబడి వంటివి చేశారని అనుమానం పెంచుకుంటున్నారు. ఈ అనుమానం రోజురోజుకు బలపడి చివరకు దాడులు చేసే వరకు వెళ్తోంది. ఈ దాడుల్లో కొందరు గాయాలతో బయటపడుతుండగా, మరికొందరు తాము చేయని తప్పుకు బలైపోతున్నారు.

నెల రోజుల్లోనే పదుల సంఖ్యలో.. 
గ్రామాలు, తండాల్లో ఉంటున్న వారికి అక్షరాస్యత లేకపోవడంతో మూఢనమ్మకాలను ఈజీగా నమ్మేస్తున్నారు. తమ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకున్నా, ఇతర ఇబ్బందులు ఏమైనా ఎదురైనా వెంటనే ఎవరో మంత్రాలు చేయడం వల్లే సమస్యలు వస్తున్నాయని అనుమానిస్తున్నారు. 

దీంతో తమకు తెలిసిన బాబాలు, భూతవైద్యులను ఆశ్రయించడంతో వీళ్ల భయాన్ని ఆసరాగా చేసుకుంటున్న బాబాలు, భూతవైద్యులు అందినకాడికి దోచుకుంటున్నారు. తర్వాత ‘మీకు తెలిసిన వారే ఇదంతా చేస్తున్నారు’ అని చెబుతుండడంతో అనుమానం మరింత బలపడుతోంది. ఈ క్రమంలో వారిని హత మారిస్తేనే తమ కుటుంబ కష్టాలు తీరుతాయన్న ఆలోచనతో దాడులకు తెగబడుతున్నారు. అనుమానంతో ఉన్మాదులుగా మారుతూ తమకు దగ్గరి వారినే హతమారుస్తూ జైలు పాలవుతున్నారు. దీంతో హత్యకు గురైన వారి ఫ్యామిలీతో పాటు, హత్య చేసిన వారి ఫ్యామిలీ సైతం రోడ్డు మీద పడుతున్నాయి. ఇలా నెల రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో మర్డర్లు జరగడం గమనార్హం. 

మంత్రాల నెపంతో ఇటీవల జరిగిన దాడులు
జనవరి3న హనుమకొండ జిల్లా ఐనవోలు  మండలం ఒంటిమామిడిపల్లికి చెందిన గోనె సోమలక్ష్మి మంత్రాలు చేస్తున్న నెపంతో ఇంటి ముందు నిద్రిస్తున్న టైంలో గోనె రాజు, అతడి కుమారుడు అనిల్, బంధువులు పెండ్లి యుగంధర్‌‌‌‌‌‌‌‌, ముస్కు రాజశేఖర్, అనుమల రంజిత్‌‌‌‌‌‌‌‌ కలిసి కొట్టి చంపేశారు.

జనవరి5న ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా  తిర్యాణి మండలం రాజుగూడలో ఆత్రం తిరుపతి (42) మంత్రాలు చేస్తాడన్న అనుమానంతో సమీప బంధువులైన జుగ్నాహక హిరమాన్, హర్షవర్ధన్​, ఆత్రం చిన్నులు గొడ్డలితో నరికి చంపారు. ఫిబ్రవరి3న సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన బత్తుల తిరుపతి తన బిడ్డకు అదే  గ్రామానికి చెందిన బండి వెంకటయ్య మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో హత్య చేయించాడు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలో దొరికిపోయాడు. 

ఫిబ్రవరి11న సిద్దిపేట జిల్లా ముస్తాబాద్‌‌‌‌‌‌‌‌ మండలం నామాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన నిమ్మ భూమయ్యను కుటుంబసభ్యులు, బంధువులే హతమార్చారు. 

ఫిబ్రవరి17న మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలో మంత్రాల అనుమానంతో ఆలకుంట సమ్మక్కను, ఆమె కుమారుడు సమ్మయ్యను బొల్లేపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి కుమార్‌‌‌‌‌‌‌‌ రాడ్‌‌‌‌‌‌‌‌తో కొట్టి చంపేశాడు. స్థానికులు అతడిని పట్టుకొని స్తంభానికి కట్టేసి, పోలీసులకు అప్పగించారు.

మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో మ‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌బూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామానికి చెందిన యుగంధర్, రాధికపై మే 15న అదే గ్రామానికి చెందిన లక్ష్మీ నర్సు, కృష్ణ దాడి చేశారు. 

మే20న నిజామాబాద్​ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన పులింటి శ్రీనివాస్ మంత్రాలు చేస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన శంకర్‌‌‌‌‌‌‌‌ కుటుంబ సభ్యులు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌తో పాటు, భార్య కళావతి, కుమార్తె భూలక్ష్మిపై దాడి చేశారు. మే30న నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో జవ్వాజి సాయిలు (75)ను అదేగ్రామానికి చెందిన జవ్వాజి శ్యామ్‌‌‌‌‌‌‌‌ గొడ్డలితో నరికి చంపాడు.

సెప్టెంబర్​ 3న మెదక్ పట్టణంలోని నవాపేటవీధికి చెందిన ఒగ్గు కళాకారుడు దేవునికాడి రాములు (52), గంగవ్వ, బాలమణిని అదే గ్రామానికి చెందిన వారు చెట్టుకు కట్టేసి కొట్టారు. గాయపడిన వారిని సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాములు చనిపోయాడు. 

సెప్టెంబర్27న మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం  గ్రామానికి చెందిన మల్లం యాకయ్య (66) మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన రాజు నడిరోడ్డుపై మంచం కోడుతో కొట్టి చంపేశాడు.

అవగాహన కార్యక్రమాలపై పట్టింపేదీ ?
మంత్రాలు, మూఢనమ్మకాలు, చేతబడి వంటి వాటిపై గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తేనే దాడులు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ఎవరూ చర్యలు చేపట్టడం లేదు. పోలీసులు కొన్ని సార్లు గ్రామాల్లో కళాజాత నిర్వహించినా నేరాల నియంత్రణపై మాత్రమే ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు కొన్ని నాస్తిక సంఘాలు పని చేస్తున్నా వారికి ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రజలను చైత్యవంతం చేయాలి
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నేటికీ కొందరు మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. మంత్రాలు, చేతబడుల పేరుతో తోటి వారిని అత్యంత దారుణంగా హత్య చేస్తున్నారు. బాబాలు, భూత వైద్యులను కట్టడి చేయాలి. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రతి గ్రామంలో కళాజాతలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. సైన్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను వివరించారు. ప్రజల్లో చైతన్యం కలిగించినప్పుడే మంత్రాల నెపంతో దాడులు, హత్యలను తగ్గించవచ్చు.
 

రమాదేవి,హేతువాద సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు