
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌లో ఒక్క ట్రోఫీ కూడా గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. తమ పేరును, ఆటగాళ్లను, కెప్టెన్లను మార్చినా కొన్నేండ్లుగా ఆ జట్టు చివరి స్థానం కోసం పోటీ పడుతోంది. గతేడాది కేవలం ఐదు విజయాలతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టింది. కానీ, ఐపీఎల్ 18వ ఎడిషన్‌కు ముందు పంజాబ్ తమ టీమ్‌ను పూర్తిగా మార్చేసుకుంది.
అందరికంటే ఎక్కువగా రూ.110.5 కోట్లతో మెగా వేలానికి వెళ్లిన కింగ్స్ దేశ, విదేశాలకు చెందిన టాప్ క్లాస్ టీ20 క్రికెటర్లను తమ జట్టులోకి తెచ్చుకుంది. గత సీజన్‌లో కేకేఆర్‌కు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను ఏకంగా రూ. 26.75 కోట్లతో కొనుగోలు చేసింది. అతనికే కెప్టెన్సీ అప్పగించింది. స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, యుజ్వేంద్ర చహల్, మార్కో యాన్సెన్ వంటి మేటి స్టార్లను జట్టులోకి తీసుకున్న పంజాబ్ ఈసారైనా కప్పుకొట్టాలని ఆశిస్తోంది.
నాయకుడే బలం
ఈ సీజన్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టుకు అతి పెద్ద బలంగా కానున్నాడు. బ్యాటర్‌గానే కాకుండా తన నాయకత్వ పటిమ జట్టుకు డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. శ్రేయస్‌కు తోడు స్టోయినిస్, మ్యాక్స్‌వెల్, నేహల్ వాధెర, ప్రభ్‌సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ వంటి టీ20 హిట్టర్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు మార్కో యాన్సెన్, కుల్దీప్ సేన్, ఆరోన్ హార్డీ, లోకీ ఫెర్గూసన్ రూపంలో పవర్ ఫుల్ పేసర్లు ఉన్నారు. దాంతో పంజాబ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలే కానుంది.
చహల్ ఉన్నా.. స్పిన్‌లోనే సమస్య
స్పిన్ విభాగంలోనే పంజాబ్ బలహీనంగా కనిపిస్తోంది. యుజ్వేంద్ర చహల్‌కు తోడుగా మరో క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది. హర్‌ప్రీత్ సింగ్‌పై పెద్దగా అంచనాలు లేవు. దాంతో ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ స్పిన్ భారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. జట్టులో చాలా మంది టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్నా.. ఓపెనింగ్ కాంబినేషన్, మిడిలార్డర్‌పై క్లారిటీ లేదు. అదే సమయంలో నలుగురు ఫారిన్ ప్లేయర్లకే చాన్స్ ఉన్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికా క్లిష్టతరం కానుంది. అదే సమయంలో డొమెస్టిక్ బ్యాటర్లు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారొచ్చు.
ఎంత దూరం..
పంజాబ్ పూర్తిగా నూతన జట్టుతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌గా శ్రేయస్, కోచ్‌గా రికీ పాంటింగ్ ఉండటంతో జట్టుపై సహజంగానే అంచనాలు పెరిగాయి. కొత్త స్టేడియం (ముల్లాన్‌పూర్)లో ఈసారి సరికొత్త ఆట చూపెట్టాలని పంజాబ్ కోరుకుంటోంది. ఫారిన్ ప్లేయర్లు, పేసర్లు అంచనాలు తగ్గట్టు రాణిస్తే పంజాబ్ తన రాతను మార్చుకునే
అవకాశం ఉంది.
పంజాబ్ టీమ్
- బ్యాటర్లు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), పైలా అవినాష్, నేహల్ వాధెర, ప్రియాంశ్ ఆర్య, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్
- వికెట్‌కీపర్లు: విష్ణు వినోద్, జోష్ ఇంగ్లిస్, ప్రభసిమ్రాన్ సింగ్
- ఆల్‌రౌండర్లు: మాక్స్‌వెల్, స్టోయినిస్, శశాంక్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో యాన్సెన్, సూర్యాంశ్ షెడ్జ్, పేసర్లు: లోకీ ఫెర్గూసన్, కుల్దీప్ సేన్, విజయ్‌కుమార్ వైశాక్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్
- స్పిన్నర్లు: యుజ్వేంద్ర చహల్, ప్రవీణ్ దూబే, హర్‌ప్రీత్ సింగ్ బ్రార్