
నిస్వార్థ వనజీవి రామయ్య భౌతికంగా లేకపోయినా ప్రకృతి రూపంలో ఆయన మన మధ్యనే ఉన్నారు. కోటి మొక్కలకు పైగా వనజీవి రామయ్య, జానకమ్మ దంపతులు నాటారు. కోటికి పైగా మొక్కలను నాటి వనజీవి రామయ్య చరిత్ర సృష్టించారు. మొక్కలు నాటుతూ దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్యగా సేవ చేశారు. రామయ్య చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును వనజీవి రామయ్య ఢిల్లీలో అందుకున్నారు.
వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేశారు. పర్యావరణవేత్తగా, సామాజిక కార్యకర్తగా జీవితాంతం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కోసం జీవితం అంకితం చేశారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా ఆయన జీవిత కథ పర్యావరణ పరిరక్షణ సందేశంగా పాఠశాల పాఠ్యాంశాల్లోనూ చేర్చారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపా డాలనుకునేవారు చాలా తక్కువమంది ఉంటారు. ఇలాంటివారిలో మన తెలంగాణ బిడ్డ వనజీవి రామయ్య ముందువరుసలో ఉంటారు. తన జీవితాంతం మొక్కలు నాటేందుకే ధారపోసిన ప్రకృతి ప్రేమికుడు. అలుపెరుగని ప్రకృతి ప్రేమికుడు రామయ్య.
సమాజ హితం కోసం, భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్న సద్భావన కలిగిన గొప్పవ్యక్తి రామయ్య. ఒక్కడే కోటికి పైగా మొక్కలునాటి చరిత్ర సృష్టించాడు. కోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. 2017లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు.
- జాజుల దినేష్-