స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కళాభినేత్రి

స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కళాభినేత్రి

చెంగావి రంగు చీర కడితే అందమంతా ఆమెలోనే కనిపించింది. నా మది నిన్ను పిలిచింది గానమై అంటూ ప్రేక్షకలోకం ఆమెను ఎంతగానో ఆరాధించింది. ఆమె వెండితెరపై కనిపిస్తే కాసుల వర్షం కురిసింది. అందుకే అప్పటికీ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తన స్థానం అలాగే ఉంది. ఆ నటి ఎవరో కాదు.. కళాభినేత్రి వాణి శ్రీ. ఈరోజు ( ఆగష్టు 3) ఆమె పుట్టినరోజు సందర్భంగా వాణిశ్రీ గురించి కొన్ని విశేషాలు..

 

వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. ఓ సినిమా ఆడిషన్‌కి వెళ్లినప్పుడు ఎస్వీ రంగారావు ఆమెకి వాణిశ్రీ అని పేరు పెట్టారు. ఆమె నెల్లూరులో పుట్టారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చిన్నతనంలోనే ఫ్యామిలీ అంతా చెన్నైకి వెళ్లిపోయారు. అక్కడ చదువుకుంటూనే వీణ, నాట్యం నేర్చుకున్నారు. టీఆర్ మాలవ్యతో పాటు వెంపటి చినసత్యం దగ్గర కూడా భరతనాట్యం నేర్చుకున్నారామె.

చిట్టెమ్మగా...

సినిమాల్లోకి రాక ముందు నాటకాల్లో కూడా వాణిశ్రీ  చాలా మంచి పేరు తెచ్చుకున్నారు . రక్తకన్నీరు, చిల్లరకొట్టు చిట్టెమ్మ లాంటి డ్రామాస్‌లో ఆమె నటన చూసి అందరూ ఫిదా అయిపోయేవారు. చిట్టెమ్మగా ఆమె నటన చూశాకే కన్నడ దర్శకుడు కృష్ణమూర్తి తనకు ‘వీర సంకల్పం’ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా పూర్తవ్వగానే వరుసగా మూడు చిత్రాల్లో ఛాన్సులు వచ్చాయి. ఏవీఎం సంస్థవారు కూడా రెండు సినిమాలకు కాంట్రాక్ట్ చేసుకున్నారు. 

విఠలాచార్య తీసిన బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజా మహిమ లాంటి చిత్రాలు వాణిశ్రీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాయి. అయితే కన్నడ, తమిళ చిత్రాలతో బిజీ అయినా నేరుగా తెలుగులో నటించడానికి మాత్రం కాస్త సమయం పట్టింది. దాంతో శివాజీ గణేషన్, ఎంజీఆర్‌‌, రాజ్‌కుమార్ లాంటి స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా నటిస్తూనే తెలుగులో కొన్ని కామెడీ క్యారెక్టర్స్ కూడా చేయాల్సి వచ్చింది. భీష్మ, మంగమ్మ శపథం, శ్రీకృష్ణ తులాభారం, పిడుగు రాముడు, గోపాలుడు భూపాలుడు, కంచుకోట, నిండు మనసులు, ఉమ్మడి కుటుంబం, అగ్గి బరాటా వంటి చాలా చిత్రాల్లో ఫేమస్ కమెడియన్లతో కలిసి నవ్వులు పూయించారామె.  

ఇది మల్లెల వేళయనీ ....

కమెడియన్‌గా నటిస్తున్నప్పుడు బీఎన్ రెడ్డి పిలిచి ‘బంగారు పంజరం’లో వాణిశ్రీకి ఛాన్సిచ్చారు. కానీ ఆయనకి స్క్రిప్ట్ తయారు చేయడానికి మూడేళ్లు పట్టడంతో... సినిమా పట్టాలెక్కడానికి లేటయ్యింది. ఆ గ్యాప్‌లో మరికొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారామె. ‘సుఖదు:ఖాలు’లో చేసిన పాత్ర చాలా పేరు తెచ్చిపెట్టింది. ఆమెపై తీసిన ‘ఇది మల్లెల వేళయనీ పాట’ సూపర్ హిట్టయ్యింది. 

మరపురాని కథ...

హీరోయిన్‌గా వాణిశ్రీకి తొలి తెలుగు సినిమా ‘మరపురాని కథ’. నిజానికి ఇందులో సావిత్రి నటించాలి. ఎందుకంటే తమిళ మాతృకలో ఆవిడే నటించారు. అయితే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ అవకాశం వాణిశ్రీని వరించిందట. చంద్రమోహన్ హీరోగా నటించిన ఈ సినిమా సక్సెస్ అయ్యింది. వాణిశ్రీకి మంచి పేరు కూడా వచ్చింది. అయితే మరో మంచి అవకాశం రావడానికి ఇంకాస్త సమయం పట్టింది.

చిన్న పాత్రైనా...

లక్ష్మీ నివాసం, రణభేరి, మహాబలుడు, జగత్‌ కిలాడీలు వంటి చాలా సినిమాలు చేసిన తర్వాత.. ‘ఆత్మీయులు’ సినిమా వాణిశ్రీ కెరీర్‌‌ని మలుపు తిప్పింది. నిజానికి ఇందులో హీరోయిన్‌ కంటే చెల్లెలి పాత్ర నిడివే ఎక్కువ. దాంతో ఏ పాత్ర కావాలి అని దర్శక నిర్మాతలు అడిగారట. చిన్నదైనా పర్లేదు హీరోయిన్‌గానే చేస్తానని వాణిశ్రీ చెప్పారట. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో వాణిశ్రీ కెరీర్‌‌ గాడిలో పడింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌ బాబు, కృష్ణంరాజు, రామకృష్ణ లాంటి వారందరితో కలిసి వరుస సినిమాలు చేశారామె. రాఘవేంద్రరావు తీసిన ‘మై తేరే ప్యార్‌‌ మే పాగల్’ అనే హిందీ చిత్రంలోనూ నటించారు వాణిశ్రీ.

ఏఎన్నార్ కి తగిన జోడీ...

ఎంతమంది హీరోలతో వర్క్ చేసినా ఏఎన్నార్, వాణిశ్రీలది హిట్ పెయిర్ అని చెప్పాలి. నవలల ఆధారంగా తెరకెక్కిన చాలా సినిమాల్లో నటించడంతో  ఏఎన్నార్‌‌ని నవలా నాయకుడు అని, వాణిశ్రీని నవలా నాయిక అని అనేవారు. వీళ్లిద్దరూ కలిసి నటించారని తెలిస్తే జనం థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. దసరా బుల్లోడు, కొడుకు కోడలు, దత్తపుత్రుడు, విచిత్రబంధం, ప్రేమనగర్, బంగారుబాబు, మంచివాడు, పవిత్రబంధం, సెక్రెటరీ, చిలిపి కృష్ణుడు, దేవదాసు మళ్లీ పుట్టాడు, చక్రధారి, శ్రీరామరక్ష, ఆలుమగలు లాంటి ఎన్నో చిత్రాల్లో నటించి ఏఎన్నార్‌‌కి తగిన జోడీ అనిపించుకున్నారు వాణిశ్రీ. 

ఫ్యాషన్ కి ఫేమస్...

అప్పట్లో వాణిశ్రీకి తెలిసినంత ఫ్యాషన్ మరే హీరోయిన్‌కీ తెలియదని అంటారు. రకరకాల ప్రింటెడ్ చీరలు కట్టుకునేవారు. బ్లౌజ్‌ డిజైన్ల విషయంలోనూ కొత్త ప్రయోగాలు చేసేవారు. చుడీదార్, లంగావోణీ.. ఏది వేసుకున్నా అందులో వాణిశ్రీ మార్క్ కనిపించేది. ఇక మ్యాచింగ్ బొట్టు బిళ్లలు, జ్యుయెలరీ, కలర్‌‌ఫుల్ హెయిర్ బ్యాండ్స్ తో చాలా స్టైలిష్‌గా ఉండేవారు. అమ్మాయిలంతా ఆమెలా రెడీ అవ్వాలని ట్రై చేసేవారు. దాంతో వాణిశ్రీ శారీస్, వాణిశ్రీ బ్లౌజెస్, వాణిశ్రీ ఖర్చీఫ్స్‌ మార్కెట్లో ప్రత్యక్షమయ్యాయి. ఇక డిఫరెంట్ హెయిర్ స్టైల్స్‌ కూడా ట్రై చేసేవారు వాణిశ్రీ. ముఖ్యంగా ఆవిడ వేసుకునే ముడి అయితే చాలా ఫేమస్.  

ఏ అవకాశాన్నీ వదులుకోలేదు..

నలభయ్యేళ్ల కెరీర్‌‌లో వాణిశ్రీ చేయని క్యారెక్టర్ లేదు. ‘గోరంతదీపం’లో డీగ్లామరస్ రోల్ కూడా చేశారామె. మరో విశేషం ఏమిటంటే.. చాలా సినిమాల్లో డ్యూయెల్ రోల్ చేయడం. సాధారణంగా హీరోలే అద్భుతమైన కథ దొరికితే తప్ప ద్విపాత్రాభినయం చేయడానికి ఇష్టపడ్డరు. అలాంటిది గంగ మంగ, ఇద్దరు అమ్మాయిలు, జీవనజ్యోతి, చిలిపి కృష్ణుడు లాంటి పలు చిత్రాల్లో ఇద్దరిగా కనిపించి వాణిశ్రీ మురిపించారు. ఇక శ్యామ్ బెనెగళ్ తీసిన ‘అనుగ్రహం’లో వాణిశ్రీ నట విశ్వరూపాన్ని చూసి ఆడియెన్స్ హారతులు పట్టారు. 

హుందాతనంతో...

1978లో డాక్టర్ కరుణాకరన్‌ను పెళ్లి చేసుకున్న వాణిశ్రీ.. ఆ తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్నాళ్లకు రీ ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సత్తా చాటారు. ముఖ్యంగా అత్త పాత్ర చేయాలంటే ఆమె తర్వాతే. అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, బొబ్బిలి రాజా, అల్లరి అల్లుడు లాంటి చిత్రాల్లో స్టార్‌‌ హీరోల అత్తగా గడుసు పాత్రల్లో మెప్పించారు. స్వాతి చినుకులు, పెద్దింటి అల్లుడు, సీతారత్నంగారి అబ్బాయి, రాజేశ్వరీ కళ్యాణం, ఏవండీ ఆవిడ వచ్చింది, బొంబాయి ప్రియుడు , జాబిలమ్మ పెళ్లి లాంటి చాలా సినిమాల్లో రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. ఏ పాత్ర చేసినా తన హుందాతనంతో మెప్పించారు. 2004లో ‘భద్రాద్రి రాముడు’ చిత్రంలో నటించాక మళ్లీ తెరపై కనిపించలేదు వాణిశ్రీ. ఇప్పటికీ ఇండస్ట్రీకి దూరంగానే జీవిస్తున్నారు వాణిశ్రీ. అయినా టీవీలో ఏదో ఒక సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు. తన నటనతో వాహ్వా  అనిపిస్తూనే ఉన్నారు. ఎప్పటికీ అనిపించుకుంటూనే ఉంటారు.