భారతదేశంలో సమన్యాయ పాలన, చట్ట సమానత్వం ఉండటంతో పరిపాలక చట్టాలను, న్యాయస్థానాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక, పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్, డిస్మిస్ తదితర సర్వీస్ అంశాలపై వచ్చే అనేక సమస్యలను విచారించడానికి, పరిష్కరించడానికి పరిపాలన ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. సాధారణ న్యాయస్థానాలు విచారించే కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో న్యాయ విచారణలో జరుగుతున్న జాప్యాన్ని దీర్ఘకాలయాపనను దృష్టిలో ఉంచుకుని పరిపాలన అంశాలపై, ప్రత్యేక అంశాలపై వివాదాలను, అర్జీలను సత్వర విచారణ చేయాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక భాగం ఏర్పాటు చేశారు.
42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం మన దేశంలో పరిపాలన ట్రిబ్యునళ్లను ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ రాజ్యాంగంలో 14(ఎ) భాగాన్ని చేర్చారు. పరిపాలక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడానికి 323(ఎ) అనే అధికరణ చేర్చారు. ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తూ 323(బి) అనే అధికరణను రాజ్యాంగంలో పొందుపర్చారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ట్రిబ్యునల్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసినా వాస్తవంలో వాటిని ఏర్పాటు చేయలేదు. 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో వీటిని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసులు, నియమ నిబంధనలు, పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్ మొదలైన అంశాలపై సమస్యలను ఈ ట్రిబ్యునళ్లు విచారిస్తాయి.
ట్రిబ్యునల్ నిర్మాణం
పరిపాలన ట్రిబ్యునల్‌లో ఒక చైర్మన్‌తోపాటు 16 మంది వైస్ చైర్మన్లు, 46 మంది సభ్యులు ఉంటారు. పరిపాలన ట్రిబ్యునల్ ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(సీఏటీ)కు అనుబంధంగా ప్రస్తుతం మన దేశంలో పలు రాష్ట్రాల్లో 17 కేంద్రాల్లో బెంచులు ఉన్నాయి. క్యాట్‌కు అనుబంధ బెంచ్‌లన్నీ ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల ప్రధాన కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ట్రిబ్యునల్ కేంద్రాలు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో పనిచేస్తున్నాయి. మొత్తం సర్క్యూట్ బెంచ్‌లతో కలిపి బెంచ్‌ల సంఖ్య 21.
ట్రిబ్యునల్ పరిధి
అఖిల భారత సర్వీసుల్లో పనిచేసే వారిని మొదలుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల, కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ట్రిబ్యునల్ విచారిస్తుంది. ఇవి కోర్టు ధిక్కరణ అధికరణ పరిధిని కలిగి ఉంటాయి. ట్రిబ్యునల్ విచారణ పరిధిలోకి సుప్రీంకోర్టులో పనిచేసే సిబ్బంది, హైకోర్టులో పనిచేసే సిబ్బంది, పార్లమెంటరీ కార్యాలయ సిబ్బంది, శాసనసభలో పనిచేసే సిబ్బంది, సైన్యంలో పనిచేసే త్రివిధ దళాలకు సంబంధించిన సిబ్బంది రారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా 9 రాష్ట్రాల్లో రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లు ఏర్పడి పనిచేస్తున్నాయి. రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో పనిచేసే అధికారులు, హైకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.
- ఆర్టికల్ 323 (బి) ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయవచ్చు.
- ఉదా: ల్యాండ్ ట్రిబ్యునల్, విదేశీ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పన్నుల ట్రిబ్యునళ్లు.
- 1997లో ఎల్.చంద్రకుమార్ వర్సెస్ భారత ప్రభుత్వ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్రాల్లోని ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టులో మాత్రమే అప్పీలు చేయకుండా హైకోర్టుల్లో కూడా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది.
రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్ల చట్టం – 1985 ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి ట్రిబ్యునల్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్ర ట్రిబ్యునల్ చైర్మన్, వైస్ చైర్మన్, సలహా సభ్యులను కూడా సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేషన్‌కు సంబంధించిన వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ట్రిబ్యునళ్లు కృషి చేస్తాయి.
చైర్మన్, సభ్యుల నియామకం
ప్రధాని అధ్యక్షతన ఉండే కమిటీ సూచనల మేరకు రాష్ట్రపతి చైర్మన్, వైస్ చైర్మన్లతోపాటు సభ్యులను నియమిస్తారు. సభ్యులు ప్రధానంగా న్యాయపరమైన విభాగానికి చెందినవారు, పరిపాలన విభాగానికి చెందిన వారు అనే రెండు రకాలుగా ఉంటారు. చైర్మన్‌గా నియామకమయ్యే వ్యక్తి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినవారు లేక పనిచేస్తున్న వారు లేక హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం కావడానికి అర్హతలు ఉన్న వ్యక్తి అయి ఉండాలి.
పదవీకాలం
చైర్మన్ పదవీకాలం మూడేండ్లు. వైస్ చైర్మన్ పదవీకాలం ఐదేండ్లు లేదా 65 సంవత్సరాలు. సభ్యుల పదవీకాలం ఐదేండ్లు లేదా 62 సంవత్సరాలు. చైర్మన్, సభ్యుల తొలగింపు పద్ధతి
అసమర్థత, దుష్ప్రవర్తన కారణాలపై రాష్ట్రపతి చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులను పదవి నుంచి తొలగించవచ్చు. యూపీఎస్సీ సభ్యులను తొలగించే పద్ధతిలో అంటే సుప్రీంకోర్టు విచారణ కమిటీ సలహాపై రాష్ట్రపతి తొలగిస్తారు.