
ప్రపంచ మేధావి, భారతరత్న, ఆర్థిక, సామాజిక తత్వవేత్త, భారతదేశానికి దశ, దిశ చూపిన మార్గదర్శి డా. బాబా సాహెబ్ అంబేద్కర్. అణగారిన కులం నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన మహనీయుడు. విద్యార్థి దశ నుంచి అంబేద్కర్ పోరుబాటలో పయనించారు. మహద్‌లోని చౌదరీ చెరువులో నీటికోసం జరిగిన పోరాటం, కాలారాం దేవాలయ ప్రవేశం, మనుస్మృతి దహనం.. దీన్నే మనుస్మృతి దహన దివాస్అంటారు. ఈ క్రమంలో రాజ్యాంగ రచన, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా, బౌద్ధమతం స్వీకారం వరకు ఆయన ఎన్నో పోరాటాలు, మరెన్నో సత్కారాలతోపాటు ఎన్నో అవమానాలు భరించారు.
ఆత్మస్థైర్యంతో ముందుకుసాగి అణగారిన వర్గాలకు మార్గదర్శకంగా నిలిచిన మహానుభావుడు అంబేద్కర్. ఇప్పటికీ దేశ, విదేశాల్లో పరిపాలకులు అంబేద్కర్ మార్గం, ఆలోచనా విధానం ఆచరిస్తున్న తరుణమిది. ఐక్యరాజ్యసమితి బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు అయిన 14 ఏప్రిల్‌ను ఇంటర్నేషనల్ నాలెడ్జ్ డేగా ప్రకటించడం, కెనడా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి నిర్వహించడానికి నిర్ణయించడం భారతీయులుగా మనమందరం గర్వించాలి.
1891న నాటి మధ్యప్రదేశ్‌లోని బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్న నిమ్నజాతిలోని మహర్ మాల కులానికి చెందిన సుబేదార్ రాంజీ సక్వాల్, భీమాబాయిలకు 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించారు. అంబేద్కర్ 1907లో మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడు. నాటి బ్రిటీష్ ఈస్ట్ ఇండియాలో ఎస్ఎస్సి పాసైన తొలి దళితుడిగా చరిత్రకు ఎక్కారు. దీంతో మహర్ కులస్తులందరూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత సంఘసంస్కర్త ఎస్.కె బోలె అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేశారు.
ఈ సభకు ప్రముఖ మరాఠీ రచయిత కృష్ణాజి అర్జున్ కిర్లోస్కర్ హాజరై అంబేద్కర్‌ను అభినందించడంతోపాటు ఆయన రచించిన గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర పుస్తకాన్ని బహూకరించారు. గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర అంబేద్కర్‌కు జీవితంలో ఎంతో మార్గదర్శకంగా నిలిచి ఆత్మస్థైర్యాన్ని నిలిపింది. రాత్రింబగళ్ళు లైబ్రరీలో గడిపి అందరికంటే ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తిగా ప్రపంచ మేధావుల్లో 3వ స్థానానికి ఎదిగిన నాయకుడిగా నిలిచారు.
దేశానికి స్వాతంత్ర్యంతోపాటు ఈ దేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కులవ్యవస్థ, మనుధర్మ శాస్త్ర చాతుర్వర్ణ వ్యవస్థను రూపు మాపాలని అనేక పోరాటాలు చేశారు. భారతదేశ స్థితిగతులపైన ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(ఎల్ఎస్ఈ)కు సమర్పించిన థీసీస్ ‘ది ప్రాబ్లం ఆఫ్ రూపీ’ అనే గ్రంథానికి డాక్టరేట్ లభించింది.
నిమ్నజాతుల ప్రతినిధి
1928లో సైమన్ కమిషన్ బొంబాయి పర్యటన సందర్భంగా అంబేద్కర్ కలిసి భారతదేశంలో అణగారిన వర్గాలు, ఆదివాసులు, నిమ్నవర్గాల జాతి ప్రజలు ఎదుర్కొంటున్న అంటరానితనం, కులం వివక్ష నుంచి విముక్తి కావాలని మెమొరాండం సమర్పించారు. ఆ తర్వాత 1931, 1932 సంవ త్సరాల్లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్నజాతుల ప్రతినిధిగా వెళ్లిన అంబేద్కర్ తాను సైమన్ కమిషన్‌కు ఇచ్చినటువంటి విజ్ఞాపన అంశాలపైన చర్చించి ప్రత్యేక సదుపాయాలు కావాలని డిమాండ్ చేశారు.
సమావేశాల అనంతరం ‘కమ్యూనల్’ అవార్డుగా ప్రత్యేక రిజర్వేషన్లు ఆమోదిస్తూ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన వచ్చింది. కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో ఆమరణ దీక్ష చేశారు. అనేకమంది సంస్కర్తల సూచన మేరకు మహాత్మాగాంధీ, అంబేద్కర్ మధ్య ఒప్పందం జరిగింది దీనినే ‘పూనా ఒడంబడిక’ అంటున్నాం. వారి ఒప్పందం తర్వాత 1935లో రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి.
కార్మిక చైతన్యానికి కృషి
మరోవైపు బహిష్కృత భారత్ అనే మరాఠీ పత్రిక నడిపిస్తూ అణగారిన వర్గాలను చైతన్యం చేయడానికి కృషి చేశారు. షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఏర్పాటుచేసి బొంబాయిలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయగా 19 మంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం 1942లో వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక మంత్రిగా నియమించింది.
దీంతో ఆయన కార్మికుల పక్షాన నిలిచి వారి పనిగంటలు తగ్గించడం, కార్మిక సంఘాల ఏర్పాటు చేయటం, వేజ్ బోర్డు ఏర్పాటు చేయడం, బోనస్‌లు ఇవ్వడం, కార్మికుల కుటుంబాలకు విద్య, వైద్యం కల్పించటం. మహిళా కార్మికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలాంటి కార్యక్రమాలు చేపట్టారు.
రాజ్యాంగంతోపాటు పటిష్ట ఆర్థికవ్యవస్థకు కృషి
న్యాయశాఖ మంత్రిగా మహిళల కోసం ప్రత్యేక హక్కులు కల్పిస్తూ రూపొందించిన హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్లో పూర్తిస్థాయిలో ఆమోదం పొందలేదు. దీంతో మనస్తాపానికి గురైన అంబేద్కర్ 10 అక్టోబర్ 1952లో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. భారత దేశానికి పటిష్టమైన రాజ్యాంగంతో పాటు అంతే పటిష్టమైన ఆర్థికవ్యవస్థ, బ్యాంకింగ్ రంగం రూపొందించిన మహనీయుడు అంబేద్కర్. 1956 అక్టోబర్ 14న నాగపూర్‌లో 5 లక్షల మందితో కలిసి ఆయన బౌద్ధమతం స్వీకరించారు.
అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న అంబేద్కర్1956 డిసెంబర్ 6న ఢిల్లీలో ఆయన అధికార నివాసంలో తుదిశ్వాస వదిలారు. ఆయన రాసిన ‘ప్రాబ్లం ఆఫ్ రూపీ’ గ్రంథం ఆధారంగా భారతదేశంలో ఆర్బీఐ ఏర్పడింది. ఆయన రాసిన రాజ్యాంగం నవభారత నిర్మాణానికి తోడ్పటంతోపాటు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ జీవిత పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.
రాజ్యాంగ నిర్మాత
స్వాతంత్ర్యం అనంతరం నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా దానితోపాటు రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. రెండు సంవత్సరాల 11 నెలలు కష్టపడి రాజ్యాంగ రచన చేసి నవ భారతాన్ని నిర్మించారు. వ్యక్తి స్వేచ్ఛను గౌరవిస్తూ వన్ ఓట్ వన్ వ్యాల్యూ అనే స్వేచ్ఛ కల్పించి అందరికీ ప్రాథమిక హక్కులు సమానంగా ఉండాలని రచన చేసిన మహానుభావుడు బాబా సాహెబ్ అంబేద్కర్.
- ఆస శ్రీరాములు,
సీనియర్ జర్నలిస్ట్