ఇయ్యాల చంద్రశేఖర్ ఆజాద్​ జయంతి

 ఇయ్యాల చంద్రశేఖర్ ఆజాద్​ జయంతి

ఆధునిక సమాజంలో సామాజిక స్పృహ కొరవడుతోంది.  చదువు, ఉద్యోగం, కుటుంబం తప్ప సమాజం, దేశం కోసం పనిచేయాలనే తపన తగ్గిపోతోంది. నాకేంటి ? అనే స్వార్థం ఆవరిస్తోంది. చుట్టూ అన్యాయం జరుగుతున్నా, నిర్బంధం కొనసాగుతున్నా  స్పందించలేకపోతున్నం. నిర్బంధాన్ని , అణచివేతను తన జీవితంలో ఏ కోశానా ఒప్పుకోని అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్​నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తి. ఇయ్యాల ఆయన జయంతి సందర్భంగా ఆ వీరుడి స్ఫూర్తిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘‘మీ ఒంట్లో రక్తం మరగకుంటే.. మీ నరాల్లో ప్రవహించేది నీరు అనుకోవాలి. యువతలోని ఉత్తేజం మాతృదేశం కోసం ఉపయోగపడకుంటే అది నిస్తేజమే.స్వేచ్ఛ పొందాల్సిందే. స్వతంత్రం రావాల్సిందే. ఇందుకోసం నేను శత్రువు తూటాలకైన ఎదురొడ్డి నిలబడతాను’’ అంటూ తెల్ల దొరల పాలిట సింహ స్వప్నంలా మారిన సమర నినాదం 
చంద్రశేఖర్ ఆజాద్. 

స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలే ఊపిరిగా...

అది బ్రిటీష్ ఇండియా కోర్టు హాలు..15 ఏండ్ల కుర్రాడైన చంద్రశేఖర్ తివారి బోన్ లో నిలబడి ఉన్నాడు. అతనిని విచారిస్తున్న న్యాయధికారి ‘నీ పేరేమిటి’ అని ప్రశ్నించాడు. ‘ఆజాద్’ అని సమాధానం రావడంతో ఆయనకు మతిపోయింది. ‘తండ్రి పేరేంటి’ అని అడిగాడు. స్వతంత్రం అని జవాబు వచ్చింది. ‘నీ ఇల్లు ఎక్కడ’ అని అడిగితే... కారాగారం అని చంద్రశేఖర్ తివారి సమాధానం చెప్పాడు. దీంతో న్యాయమూర్తికి ఆగ్రహంతో పాటు ఆశ్చర్యం కలిగాయి. మొదట15 రోజుల కారాగార శిక్ష విధించిన దాన్ని 15 కొరడా దెబ్బలుగా మార్చాడు. దీంతో ఆజాద్​ఆ క్షణమే మళ్లీ జీవితంలో ఆంగ్లేయులకు దొరకబోనని ప్రతినబూనాడు. ఆ సంఘటన తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ గా పేరొందాడు. సమాజం, దేశం, స్వాంతంత్ర్యం కోసం ఆయనలో ఎలాంటి తెగువ ఉండేదో చెప్పడానికి ఈ ఘటనొక మచ్చుతనక.

బ్రిటీష్​వారికి సవాల్​గా మారి..

చంద్రశేఖర్​ ఆజాద్1906 జులై 23న అలిరాజ్ పుర్ సంస్థానంలో (ప్రస్తుతం మధ్యప్రదేశ్​లో ఉంది) పండిట్ సీతారామ్ తివారి, జగరాణి దేవి జన్మించాడు. తల్లి కోరిక మేరకు ఉన్నత చదువుల కోసం వారణాసి సంస్కృత పాఠశాలలో చేరాడు. అక్కడ ఉండగానే జలియన్ వాలాబాగ్ ఊచకోత జరిగింది. ఆగ్రహంతో కదిలిపోయిన ఆజాద్ జాతీయోద్యమంలో చేరాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. చోరీ చోర సంఘటన అనంతరం గాంధీజీ ఆ ఉద్యమాన్ని ఆపడంతో ఆజాద్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా భారత్ కు బ్రిటీష్ వారి నుంచి విముక్తి కలిగించాలని విప్లవమార్గం వైపు వెళ్లాడు. భగత్ సింగ్, రాజ్ గురులతో మైత్రి చేసి బ్రిటీష్ వారితో పోరాటం చేశాడు. ఎన్నో విప్లవ గెరిల్లా దాడులు నిర్వహించి బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. బ్రిటీష్ పోలీసులకు ఆజాద్ సవాలుగా మారడంతో ఆయనను సజీవంగా గానీ, నిర్జీవంగా గానీ పట్టుకొని తీరాల్సిందేనని1931 ఫిబ్రవరి 21న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన సుఖ్ దేవ్ తో కలిసి ఉత్తరప్రదేశ్ లోని ఆల్ఫేడ్ పార్కులో ఉన్నట్లు పోలీసులకు ఉప్పందింది. దీంతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. అప్పుడు ఆయన వారితో భీకర పోరాటం చేసి, ముగ్గురు పోలీసులను కాల్చి చంపాడు. చివరగా తప్పించుకునే వీలు లేక తన పిస్తోల్ లో ఉన్న ఆఖరి బుల్లెట్ తో కాల్చుకొని భారత్​మాతాకి జై అంటూ నేలకొరిగాడు.

ఆజాద్ స్ఫూర్తితో యువత..

భారతదేశ జనాభా త్వరలో150 కోట్లకు చేరుకోనుంది. దేశ ప్రజల సగటు వయసు 29 సంవత్సరాలకు చేరుకుంది. అమెరికా, జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అత్యంత యువ సంపన్న దేశంగా భారత్ నిలిచింది. ఇక్కడ 64 శాతం యువతే. అయితే నేటి తరం యువతలో పరమత సహనం, దేశభక్తి , నైతిక విలువలు క్షీణించాయి. ఆజాద్​ స్ఫూర్తితో దేశం కోసం, సమాజం కోసం ముందుకు కదలాలి. అప్పుడే ఆయన ఆశయాలకు సార్థకత. 

- అంకం నరేష్, యూఎఫ్​ఆర్టీఐ, రాష్ట్ర కో కన్వీనర్