విశ్లేషణ: నేనే రాజు.. నేనే మంత్రి.. ఎదురులేని నాయకుడిని

‘‘నేను మోనార్క్ ని, నన్నెవరూ ఏమీ చేయలేరు’’ అనే సినిమా డైలాగ్ లాగే ఉంది మన ముఖ్యమంత్రి కేసిఆర్ స్టయిల్. ఎన్నికల సమయంలో ఓట్లకోసం ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించడం.. అధికారంలోకి రావడం.. ఆ తర్వాత మాట తప్పడం.. మాట మార్చడం ఆయనకి మామూలైంది. ప్రశ్నించే విలేఖరులను తిరిగి మాట్లాడకుండ చేస్తడు.. తనకు సాధ్యమైన వ్యంగ్యాస్త్రాలతో వారిని అవమానిస్తూ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తడు. ప్రతిపక్ష నేతలనైతే గంజిలో ఈగల్లాగా తీసి పడేయడం కేసిఆర్​కు ఒక సరదా. నేను రాజును.. నా ఇష్టమున్నట్టు చేస్తా.. నన్నెవరూ ప్రశ్నించొద్దు.. అనేది ఆయన మనస్తత్వం. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా ప్రజా సేవకులుగా ఉండాలే తప్ప, ప్రజల నెత్తిమీద కూర్చొని ఊరేగడానికి కాదు. మరి మన ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగానే ఉంటున్నది.

సమకాలీన రాజకీయాల్లో ప్రతిపక్షాల మీద కేసిఆర్ దాడి చేసినట్లుగా మరెవరూ దాడి చేయలేరు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఒక్కొక్కసారి కొంత పరుషంగా మాట్లాడినా కూడా అధికార పక్షంలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాల్సిన బాధ్యత ఉంది. కాని ఇక్కడ కేసిఆర్ నాయకత్వంలో అధికార పక్షంలో ఉన్న మంత్రులు, ఇతర నాయకులు ప్రతిపక్ష నాయకులపైనే ఎదురు దాడి చేస్తున్నారు. మీ పాలనపై మీకు నమ్మకం ఉంటే, ప్రజలు మిమ్మల్ని ఇప్పటికీ విశ్వసిస్తూ ఉంటే ఈ ఎదురు దాడులు అవసరమా? ఎక్కడైనా కిందిస్థాయి కార్యకర్తలు రెచ్చిపోయి ఎదుటి వారిని దూషిస్తూ ఉంటే అధిష్టానం వారిని వారిస్తూ కాస్త ఓపికతో వ్యవహరిస్తారు. కాని టీఆర్ఎస్‌‌కి సంబంధించినంత వరకు కింది స్థాయి కార్యకర్తలు కొంత బ్యాలెన్స్​డ్‌గా మాట్లాడుతున్నా కూడా కేసిఆర్, కేటీఆర్ మాత్రం రెచ్చిపోయి ప్రతిపక్ష నాయకులను తిడుతూ ఎలా మాట్లాడాలో పార్టీ కార్యకర్తలకు మార్గదర్శకత్వం చేస్తుంటారు. ఎదురుదాడి చేయకపోతే ఎక్కడ తమ వైఫల్యాలు బయటపడతాయోననే జంకు వారిలో ప్రస్ఫుటంగా కనబడుతోంది.

దళితులపై ప్రేమ అంటూనే..
దళితులకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? మూడెకరాల భూమి సంగతేంటి? ఎస్సి సబ్ ప్లాన్ నిధులెక్కడికి పోయాయి? అంటే ఎదురుదాడే. కేజీ టు పీజీ నిర్బంధ విద్య ఎక్కడకి పోయింది? అని అడిగితే ఎదురుదాడే. తెలంగాణలోని వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్న రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామన్న సంగతి ఏంటని ఎవరైనా ప్రశ్నిస్తే... ఎవరన్నారంటూ ఎదురు దాడే. దళితులపై ప్రేమ అంటిరి.. వాళ్లను అభివృద్ధిలోకి తీసుకొచ్చే వరకు నిద్రపోను అని శపథం చేస్తూ దళితబందు ప్రకటిస్తిరి... మరి ఇప్పుడు ఈ పథకం ఎందుకు అటకెక్కింది ముఖ్యమంత్రి గారూ.. హుజురాబాద్ ఎన్నిక కొరకు మాత్రమేనా అని ఎవరైనా అడిగితే, అడిగిన వారిని తూర్పారబట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మీరు ఎన్నిసార్లు అధికారంలోకి వస్తే పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పకపోతిరాయె. ఆంధ్రా వాళ్లు వెళ్ళిపోతే ఇంటికో ఉద్యోగం వస్తుందని మీరంటే యువత అంతా ఎంతో ఉత్సాహంతో మీరిచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి బస్సులాపిరి, రైళ్ళాపిరి, కేసుల్లో ఇరుక్కొనిరి. ఇప్పుడేమో.. ఏమ్ తమాషా జేస్తాండ్లా.. ఎవరన్నారు వయా ఇంటికో ఉద్యోగం అంటూ తీసి పడేస్తిరి.

ఎంతమంది బీసీలను ఆదుకున్నరు..?
బీసీ లను ఉద్ధరించడానికి ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ ఏమి చేస్తుందో, దానికి ఎన్ని నిధులు సమకూర్చారో.. ఎంతమంది బీసీలను ఏ రకంగా ఆదుకుందో స్వయంగా బీసీలకే అర్థం కాకపాయె. మధ్యలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వేయి కోట్లు నిధులు మంజూరు చేసాము అని ప్రసంగాల్లో ఊదరగొడితిరి.. అది నిజమేనా.. మీరిచ్చిన నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు.. అడపా దడపా కొంతమందికి శిక్షణ ఇవ్వడానికి మించి ఎంబీసీ కార్పొరేషన్ ఏమన్నా సాధించిందా? రుణాలొస్తాయని ఆశతో ఇరవై వేల రుపాయలు డి.డి. రూపంలో కట్టిన ఎంతోమంది వెనుక బడిన వర్గానికి చెందిన ప్రజలు అటు రుణాలు రాక ఇటు ఇరవై వేలు పోయి ఎంబీసీ కార్పొరేషన్ పేరెత్తితేనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఉండడానికి ఇల్లు లేక దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, దేశదిమ్మరులైన లక్షలాది మంది వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలు మీరు వచ్చే సాధారణ ఎన్నికల లోగా బీసీ బందు ప్రకటించి వారిని ఆదుకుంటారని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. మరి ఇది వాస్తవ రూపం దాల్చే అవకాశం ఏమన్నా ఉందా. 

అన్ని ఊహలూ హుళక్కేనా?
ఆత్మగౌరవ భవనాల పేరుమీద కుల సంఘాలకు స్థలాలు , బడ్జెట్ కేటాయించినట్టుగా ప్రకటిస్తిరి. ప్రతి ఉప ఎన్నికకు ముందు  కుల సంఘాలతో మీటింగులు పెట్టి భవనాలు వచ్చేస్తున్నాయంటూ ఊరిస్తున్నారు. కుల సంఘ మిత్రులంతా ఆ భవనాలు నిర్మించినట్లు, వాటిలో మీటింగులు పెట్టుకున్నట్లు, పెళ్లిళ్లు పేరంటాలు చేసుకున్నట్లు ఊహించుకొని సంతోష పడుతున్నారు. లేకపోతే  ఆ పేరు మీద ఎన్నికలు గట్టెక్కే వ్యూహమేనా? లేక దళిత బంధు లాగా ఇది కూడా హుళక్కేనా?

ఓర్వలేని గుణం ఎక్కువైతే..
తనకు నచ్చిన ఎమ్మెల్యే, మంత్రులపై ఎన్ని భూకబ్జా ఆరోపణలు వచ్చినా, ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా వారి మీద ఈగ వాలనియ్యని ముఖ్యమంత్రి, సాటి ఉద్యమ కారుడు, బలహీన వర్గాలకు చెందిన ఈటల రాజేందర్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక భవిష్యత్తులో ఎక్కడ తన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు వస్తుందో అనే అభద్రతా భావంతో తనపై అవినీతి ఆరోపణలు చేసి  అవమానకరంగా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారు. కేసిఆర్​ తన స్వార్థం కోసం ఉద్యమ ద్రోహులను అందలమెక్కిస్తూ, నిఖార్సైన ఉద్యమకారులను అవమానించిన వ్యక్తిగా తనకు తానే ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. ఎంత తెలివిగల వాళ్ళైనా ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేస్తారు అన్నట్టు ఈటల విషయంలో మీది తప్పటడుగా అన్నది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏదిఏమైనా మన సీఎం అంతా నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్న తీరు ప్రతిపక్షాల కంటే  సొంత పార్టీ నాయకులకే తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని వాపోతున్నారు. ఈటల పుణ్యమా అని ఇప్పుడు హరీష్ రావు తో సహా పలువురు టీఆర్ఎస్ నాయకులకు సొంత పార్టీలో గౌరవం దక్కుతున్నందుకు లోలోపలే వారు ఈటలకు థ్యాంక్స్​ చెబుతున్నట్టు వినికిడి.  అందుకే ఎంతటి వారికైనా వైభోగం కొంత కాలమే.

- సంగెం సూర్యారావు, సీనియర్ జర్నలిస్ట్, బీసీ టైమ్స్ వ్యవస్థాపకుడు