ఆయన 34 ఏండ్ల కింద తీసిన ‘దాసి’ సినిమా గురించి ఇప్పటికీ జనాలు మాట్లాడుకుంటుంటరు. అందులోని డైలాగ్‌లు ఇప్పటికీ తెలంగాణల ఎక్కడో ఒక దగ్గర రోజూ వినిపిస్తనే ఉంటయ్. ఆయన తీసింది కొన్ని సినిమాలే. కానీ.. ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చిపెట్టినయ్. ఎన్నో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు అందుకునేటట్టు చేసినయ్. సినిమా డైరెక్టర్గనే కాదు.. చిత్రకారుడిగా, మ్యూజిక్ కంపోజర్‌గా, రచయితగా కూడా పేరు తెచ్చుకున్నడు. దొరల గడీల పుట్టినా కళలతోని తెలంగాణ పేదల బతుకులను ప్రపంచానికి చూపించిండు. ఈ ప్రాంతపు ఘనమైన చరిత్రను, కళలను ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చేస్తున్నడు. అందుకే బి. నర్సింగరావుని ‘‘తెలంగాణ కళల పునరుజ్జీవన శిల్పి” అంటుంటరు.
నర్సింగరావు మల్టీ టాలెంటెడ్. తన టాలెంట్‌తో తనకు మాత్రమే కాదు, తాను పుట్టిన గడ్డకూ పేరు తీసుకొచ్చారు. తన క్రియేటివిటీతో సినిమా, థియేటర్, సాహిత్యం, మ్యూజిక్, ఫొటోగ్రఫీ లాంటి రంగాల్లో రాణించారు. కొత్తగా వచ్చే ఆర్టిస్ట్‌లకు కొన్ని తరాలుగా స్ఫూర్తిని ఇస్తున్నారు. ఆయన ఎన్నో ప్రాంతాలు తిరిగి రీసెర్చ్ చేసిన చరిత్రకారుడు కూడా. తన స్పీచ్‌లతో ఎంతోమందిని మార్చిన వక్త. ముఖ్యంగా అంతరించిపోతున్న జానపద కళారూపాలకు ప్రాణం పోయాల్సిన అవసరాన్ని పదే పదే నొక్కి చెప్పిన వ్యక్తి. మాటలకే పరిమితం కాకుండా తన వంతు సేవలు అందించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కదిలించే డాక్యుమెంటరీలు, సినిమాలు తీశారు.
క్రియేటివిటీ వరల్డ్‌లోకి..
మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఏడు నెలల ముందు 1946 డిసెంబర్ 26న బాక్సింగ్ డే రోజున బొంగు నర్సింగరావు పుట్టారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ నుంచి పెయింటింగ్‌లో డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నారు. క్రియేటివిటీ వరల్డ్‌లోకి అడుగు పెట్టి, వివిధ రంగాల్లో చెరగని ముద్రలు వేశారు. తన థియేటర్ టీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. సమకాలీన సమాజం మరచిపోయిన వారసత్వ కట్టడాలను వెలుగులోకి తీసుకొచ్చారు.
జానపద సంగీతంపై ఉన్న ఇష్టం, ప్రేమ, మూలాలను కనుగొనాలనే తపన నర్సింగరావు జ్ఞాన పరిధిని మరింత పెంచింది. నేర్చుకోవడం అనే దశ వివిధ ప్రాంతాల్లోని సాంస్కృతిక వారసత్వాన్ని, అక్కడి ప్రజల జీవనశైలిని గుర్తించేందుకు, వాస్తవికతను బయటి ప్రపంచానికి చెప్పేందుకు ఉపయోగపడింది. ఈ రోజు, ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే.. అయిదు దశాబ్దాలుగా నర్సింగరావు చేసిన సేవలు కనిపిస్తాయి. అంతర్జాతీయ కాన్వాస్ పై ‘బ్రాండ్ తెలంగాణ’ను ఆవిష్కరించాలనే ఆయన లక్ష్యం నెరవేరిన సంతృప్తి కనిపిస్తుంది.
సినిమాల్లోకి..
సినిమా అనే మీడియాన్ని సరిగ్గా వాడుకున్నారు నర్సింగరావు. ఆయన తీసిన ఫీచర్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలకు అత్యున్నత గుర్తింపు, ప్రశంసలు, సన్మానాలు, అవార్డులు దక్కాయి. ఎందుకంటే.. జమిందారీ, భూస్వామ్య వర్గాల ఆధిపత్యం, శ్రామికుల జీవితాలు, కరువు పరిస్థితులు, ఆడవాళ్లను లైంగిక దోపిడీ చేసే ‘దాసి’ వ్యవస్థ, నిరుపేదలు, నిరక్షరాస్యులు, అణగారిన వర్గాలపై జరిపే దోపిడీలను దృశ్య కావ్యాలుగా మలిచారు.
అందుకే ఆయన సినిమాలకు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు దక్కాయి. పేరున్న ఫిలిం ఫెస్టివల్స్, పనోరమాల్లో ఆయన తీసిన సినిమాలు ప్లే చేశారు. మన దేశానికి రిప్రజెంటేషన్ ఇస్తూ.. కైరో 2004, బుడాపెస్ట్ 1999, బెర్గమో(ఇటలీ)1994, బెర్లిన్ (జర్మనీ దేశంలో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) 1991–92, మాస్కో 1989, కార్లొవి వెరీ (చెకొస్లొవేకియా) 1990, మ్యూనిచ్ (జర్మనీ)1989 ఫెస్టివల్స్‌లో పాల్గొన్నారు.
రంగుల కలతో
రంగుల కల(1983) సినిమాతో నర్సింగరావులోని టాలెంట్ అందరికీ తెలిశాయి. అందుకే ఆ సినిమా అనేక కీర్తి కిరీటాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సహ సంగీత దర్శకత్వం, కథానాయకుడు... అన్నీ ఆయనే. దీనికి ‘అత్యుత్తమ ప్రాంతీయ చిత్రం’గా జాతీయ అవార్డు దక్కింది. ఆయన పేరు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలిసేలా చేసింది.
మా ఊరు
హంగేరి దేశం, జాయెర్ నగరంలో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్’ సంస్థ నర్సింగరావు తీసిన ‘మా వూరు’ (మై విలేజ్) డాక్యుమెంటరీకి అత్యుత్తమ అంతర్జాతీయ చిత్రం పురస్కారం ఇచ్చింది. 1989లో ఆయన తీసిన విషాద కావ్యం ‘దాసి’. ఈ సినిమాని జాతీయ స్థాయిలో ఎంతోమంది మెచ్చుకున్నారు. 1989 జాతీయ అవార్డుల పంట పండింది. మూవీ గోయర్స్, క్రిటిక్స్ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రం ఐదు అవార్డులు దక్కించుకుంది. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్–1989లో డిప్లొమా ఇన్ మెరిట్ సాధించి, ఆయనను మరో మెట్టు ఎక్కించింది. ‘మట్టి మనుషులు’ కూడా అత్యుత్తమ ప్రాంతీయ చిత్రంగా 1990లో జాతీయ అవార్డు దక్కించుకుంది. మాస్కో ఫిలిం ఫెస్టివల్ –1991లో డిప్లొమా ఇన్ మెరిట్ అవార్డు సాధించింది. ‘ఆకృతి’ అనే డాక్యుమెంటరీ 1991లో మరో విజేతగా నిలిచింది.
హరివిల్లు
సమాజంలోని లోపాలు, కళల మీదే కాదు.. పిల్లల సినిమాలు కూడా అద్భుతంగా తీయగలనని నిరూపించారు నర్సింగరావు. ఆయన డైరెక్షన్లో 2003లో వచ్చిన ‘హరివిల్లు’ సినిమా ద్వారా పిల్లల మనసులోని మరో ప్రపంచాన్ని పెద్దలకు పరిచయం చేశారు. ఈ సినిమా 2004లో 14వ కైరో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ అవార్డు పొందింది. అదే సంవత్సరం ఎనిమిదో ఢాకా ఫిలిం ఫెస్ట్ లో ‘బెస్ట్ జువనైల్స్ ఆడియెన్స్’ అవార్డు దక్కించుకుంది. ఆయన సినిమాలకు అవార్డులు రావడమే కాదు. ఆయన జ్యూరీ మెంబర్‌గా, సలహాదారుడిగా, చాలా ఫిలిం ఫెస్టివల్స్‌లో నిర్ణయాత్మక హోదాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాల్లోని బెస్ట్ సినిమాలను ఎంపిక చేయడంలో ఆయనది కీ రోల్. పలు ఎగ్జిబిషన్ సొసైటీలకు న్యాయనిర్ణేతగా కూడా పనిచేశారు.
ఫొటోగ్రాఫ్స్, పెయింటింగ్స్
నర్సింగరావు ఫొటోగ్రఫీ, పెయింటింగ్ రంగాల్లో కూడా తన సత్తా చాటారు. తన ఫొటోగ్రాఫ్స్, పెయింటింగ్స్ ఎన్నో ఎగ్జిబిషన్స్‌లో ఉంచారు. నర్సింగరావు దగ్గర స్థానిక, జాతీయ, అంతర్జాతీయ, జానపద, ఆధునిక, క్లాసిక్ మ్యూజిక్ కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయి. అందులో ఒక భాగాన్ని ‘ఇఫ్లూ’కు విరాళంగా ఇచ్చారు. ఎం.జనార్ధన్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా లాంటివాళ్లతో కలిసి అవార్డ్ విన్నింగ్ సినిమాలకు, షార్ట్ ఫిల్మ్స్‌కి, డాక్యుమెంటరీలకు నేపథ్య సంగీతం ఇచ్చారు.
రచనలోనూ మేటి
నర్సింగరావు నిరంతర రచయిత. ఆయన రాసిన కొన్ని పదాలు పెయింటర్, కవి, మ్యుజీషియన్ల త్రివేణి సంగమంలా ఉంటాయి. ఆయన రాసిన కవితలు నాలుగు వాల్యూమ్స్‌గా వివిధ పత్రికల్లో వచ్చాయి. మరో ఆరు వాల్యూమ్స్ పబ్లిషింగ్కు రెడీగా ఉన్నాయి. తెలుగులో ప్రచురితమైన ఆయన రచనలు ఇంగ్లీష్, ఉర్దూ, ఇతర భారతీయభాషల్లోకి అనువాదం అయ్యాయి.
వందలాదిమంది కొత్త రచయితలకు మార్గదర్శి ఆయన. కొత్త తరపు రచయితల టాలెంట్‌ని గుర్తించారు. అందుకే ఇతర రచయితలు రాసిన 50కి పైగా పుస్తకాలను స్వయంగా పబ్లిష్ చేశారు. ఫిలిం డైరెక్టర్, స్క్రీన్ రైటర్, సాహితీవేత్త, మ్యూజిక్ కంపోజర్ , కవి, నిర్మాత, నటుడు, పెయింటర్‌గా తనను తాను నిరూపించుకున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రేమికుడిగా, పరిరక్షకుడిగా, కొత్త కాంతులను వెదజల్లుతున్న టార్చ్ బేరర్ ఆయన.
అందుకున్న అవార్డులు
-
ద ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ క్రియేటివిటీ అండ్ హ్యుమానిటీ, మొరాకో.. నర్సింగరావుకు ‘మొరాకో స్టార్ ఆఫ్ క్రియేటివిటీ’ అనే పౌర పురస్కారం ఇచ్చింది.
- విమెన్ అఫ్ హార్ట్స్ అనే సంస్థ ‘జెంటిల్ మాన్ విత్ ఎ హార్ట్’ అవార్డుతో సత్కరించింది.
- ద థియోఫనీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అల్జిలని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ‘డాక్టర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ పురస్కారంతో గౌరవించాయి.
- ‘ద ఫెడరేషన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ ఆర్ట్ సొసైటీ, సింగపూర్’ సంస్థ నర్సింగరావుని అంతర్జాతీయ బహుళ సంస్కృతులకు సంబంధించిన శాఖకు గౌరవ సలహాదారుగా ఎంపిక చేసింది.
- ఈ సంస్థలో 160 దేశాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. 12 దేశాలకు చెందిన 12 మంది అంతర్జాతీయ సెలబ్రిటీలను మాత్రమే తమ గౌరవ సలహాదారులుగా ఎంపిక చేస్తారు.