దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన ధీర వనిత జెట్టి ఈశ్వరీ బాయి 

కుల వివక్ష, లింగ వివక్ష రాజ్యమేలిన రోజుల్లో ఎన్ని కష్టాలు ఎదురైనా, ధైర్యంగా నిలబడి, సామాజిక, రాజకీయ రంగాలతో పాటు, హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిన దళిత ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నాయకురాలు జెట్టి ఈశ్వరీబాయి. అతి సామాన్య దళిత కుటుంబంలో జన్మించి, అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. కుల, మత, వర్గాలకు అతీతంగా సకల జనుల మన్ననలు పొందిన యోధురాలు ఆమె. అప్పట్లోనే ఆమె అసమాన సాంప్రదాయాలకు ఎదురొడ్డి నిలిచి  ఉన్నత విద్యనభ్యసించారు. తన విజ్ఞానాన్ని తన జాతి బిడ్డలకు అందించాలనే దృఢ సంకల్పంతో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే పేద ప్రజలకు విద్యావకాశాలు కల్పించాలని విద్యాలయాలు నెలకొల్పిన మానవతా మూర్తి ఈశ్వరీబాయి. లింగ వివక్షను ఎదుర్కొంటూ సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలనుకునే మహిళలకు ఆమె జీవితం ఆదర్శం. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ, షెడ్యూల్ కులాలు, వెనుకబడిన జాతులు, మహిళల అభివృద్ధి కోసం ఆమె అహర్నిశలు పాటుపడ్డారు. 

రాజకీయాల్లో తన దైన ముద్ర

రాజకీయ రంగంలో ఈశ్వరీబాయి తనదైన మార్కు చూపించారు. హైదరాబాద్ మున్సిపాలిటీకి 1951లో ఎన్నికలు జరిగాయి.  గతంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, రాజ్యాధికారంతోనే అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందుతాయన్న అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా, రాజకీయ రంగం ద్వారా ప్రజలకు మరింత సేవ చేయవచ్చని ఆ ఎన్నికల్లో ఈశ్వరీబాయి చిలకలగూడ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచారు. కౌన్సిలర్ గా మురికి వాడల బాగు కోసం ఆమె విశేషంగా కృషి చేశారు. “షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్”  ఆంధ్రప్రదేశ్ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. అంబేద్కర్ స్థాపించిన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’లో చేరి జీవితాంతం అదే పార్టీలో పనిచేశారు. 1962లో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి మొదటి ప్రయత్నంలో ఓడిపోయారు. తర్వాత రెండు పర్యాయాలు అదే నియోజకవర్గం నుంచి ఎన్నికై స్త్రీలు, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేశారు. ఇవాళ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నా.. వాటిని అందిపుచ్చుకోవడంలో మహిళలు వెనకే ఉన్నారు. అలాంటి వారికి ఈశ్వరీబాయి చరిత్ర స్ఫూర్తి దాయకం.

తెలంగాణ పోరాటంలో..

దళిత వర్గాల అభివృద్ధికి ఈశ్వరీభాయి నిర్విరామంగా కృషి చేశారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నపుడు నిరుపేద దళితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి, వారి కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు ప్రారంభించడం కోసం ఆమె చేసిన కృషి అనిర్వచనీయం. ఆమె మహిళా, బాలల సంక్షేమ కమిషన్ కు చైర్​పర్సన్ గా ఉన్నప్పుడే బాలికలకు ఉచిత విద్యను అందించే చట్టానికి రూపకల్పన చేశారు.  తెలంగాణ  తొలి దశ ఉద్యమంలోనూ ఈశ్వరీబాయి కీలక భూమిక  పోషించారు.  ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఏర్పడిన “ తెలంగాణ ప్రజా సమితిలో” సభ్యులుగా చేరారు. ఆనాటి పాలకులు పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కుతూ, తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. మిగతా సభ్యులు ఆనాటి రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసినప్పటికీ, ఆమె మాత్రం మొక్కవోని  ధైర్యంతో తెలంగాణ హక్కుల సాధన కోసం పోరాటం చేశారు. ఎన్నో రకాల  ప్రలోభాలకు గురి చేసినా దేనికీ లొంగకుండా నిబద్ధతతో తాను నమ్మిన సిద్ధాంతం కోసమే ఆమె పని చేశారు. నిత్యం ప్రజల పక్షాన ఉంటూ, నిస్వార్థ రాజకీయాలు చేయడం ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.

అంబేద్కర్ ​బాటలో..

ఈశ్వరీబాయి 1918 డిసెంబర్1 సికింద్రాబాద్ లోని చిలకలగూడ ప్రాంతంలో సామాన్య మాల కులానికి చెందిన బల్లెపు బలరామస్వామి, రాములమ్మ దంపతులకు జన్మించారు. 1942లో జరిగిన అఖిల భారత నిమ్న కులాల సభలో తొలిసారి ఆమె డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ప్రసంగం విని ఆయన మాటల ద్వారా ప్రభావితం అయ్యారు. అప్పటి నుంచి ఆయన బాటలో నడవడం మొదలు పెట్టారు. మహిళలు అభివృద్ది చెందాలంటే అందుకు మహిళా  సాధికారికత అతి ప్రధానమైనదని ఆమె ప్రగాఢంగా  విశ్వసించారు. ముందు నుంచి స్వతంత్ర భావాలు కలిగిన ఆమె భర్త మరణం తర్వాత బిడ్డతో సహా పుట్టింటికి వచ్చినా ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడ లేదు. “పరోపకారిని” అనే ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తూ ఆ డబ్బులతోనే తన కూతురికి విద్యాభ్యాసం చేయించారు. ఫూలే దంపతుల ప్రభావం ఈశ్వరీబాయిపై అధికంగా ఉంది. అందుకే ఆమె చిలకలగూడలోని మురికి వాడల్లో నిరుపేదల ఇండ్లకు వెళ్లి, అక్కడ వయోజనులకు పాఠాలు బోధించేవారు. లింగ వివక్ష తొలగాలంటే మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కూడా ప్రధానమేనని నమ్మి, మహిళలు స్వశక్తితో ఆర్థిక వనరులు తమకు తామే సంపాదించుకునే విధంగా వారిని ప్రోత్సహించేవారు. విద్య అందరికీ చేరవేయాలనే తలంపుతో తన దగ్గర ఉన్న డబ్బులతోనే  ‘గీతా విద్యాలయం’ ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యా బోధన కొనసాగించారు.

అధికారికంగా జయంతి, వర్ధంతుల నిర్వహణ

సామాజిక, రాజకీయ రంగాల్లో ఈశ్వరీబాయి చెరగని ముద్ర వేశారు. సామాజిక రంగంలో ఆమె మొదలు పెట్టిన సేవలు, ఈశ్వరీబాయి ఛారిటబుల్ ట్రస్ట్  ద్వారా నేటికి కొనసాగుతున్నాయి. కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా, ప్రజా నాయకురాలిగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సబ్బండ వర్గాల మన్ననలను ఆమె పొందగలిగారు.  దళిత నాయకురాలిగా దళితుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. దళితులకు భూ పంపిణీ, విద్యావకాశాలు మెరుగు పరచడం కోసం హాస్టళ్ల ఏర్పాటు వంటివి దళితుల జీవితాల్లో వెలుగులు నింపాయి. మహిళలు, బాలికల అభివృద్ధి కోసం ఆమె నిర్విరామంగా కృషి చేశారు. తెలంగాణ పోరాటంలో ఆమె చేసిన కృషి, నిబద్ధత, త్యాగాలను గుర్తించి, ఆమె లాంటి ధీర వనిత చరిత్ర సమస్త ప్రజలకు తెలియాలని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆమె జయంతి, వర్ధంతులను రాష్ట్ర  ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుండటం శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో ఆమె ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి. అట్టడుగు వర్గాలు,  దళితులు, మహిళల అభివృద్ధిలో ఆమె చూపిన బాటలో నేటి తెలంగాణ సమాజం ప్రయాణించాలి. ఆమె ఆశయ సాధన దిశగా మనమందరం కృషి చేయాలి. అదే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి. –మేర్జ అనిల్, కాకతీయ యూనివర్సిటీ