విశ్లేషణ: దళితులు, మహిళల గొంతుక.. ఈశ్వరీ బాయి

అంబేద్కర్​ ఆశయాలే స్ఫూర్తిగా దళిత ఉద్యమాలు చేసిన అంబేద్కర్​వాది ఈశ్వరీబాయి. మహిళా అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన ఆదర్శమూర్తి ఆమె. మనసా, వాచా, కర్మణా అంబేద్కర్​ ఆశయాలను అనుసరిస్తూ.. తుది శ్వాస విడిచే వరకు ఆచరించిన గొప్ప వ్యక్తి. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ముందుండి పోరాడిన చైతన్యశీలి. బడుగు, బలహీన, దళిత, పీడిత జనోద్ధరణ కోసం అహర్నిశలూ పోరాటం సాగించారు. అందుకే 1952 నుంచి 1990 వరకూ అంటే నాలుగు దశాబ్దాల పాటు తెలంగాణ దళిత వాడల్లో ఈశ్వరీబాయి పేరు మారుమోగింది. 

సికింద్రాబాద్​ చిలుకలగూడ లో ఓ మధ్యతరగతి దళిత కుటుంబంలో 1918 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 1న ఈశ్వరీబాయి పుట్టారు. బల్లెపు రాములమ్మ, బలరామస్వామిల ఐదో సంతానం. తండ్రి నిజాం స్టేట్‌‌‌‌ రైల్వేలో ఉద్యోగి. సికింద్రాబాద్ ఎస్పీజీ మిషన్ స్కూల్​లో ప్రాథమిక విద్య, కీస్ హైస్కూల్​లో ఉన్నత విద్యను పూర్తి చేశారు ఈశ్వరీబాయి. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ భాషల్లో మంచి పట్టు సాధించారు. ఈశ్వరీబాయికి 13వ ఏట డా.జె.లక్ష్మీనారాయణతో పెండ్లయ్యింది. వీరి కుమార్తె డాక్టర్ జె.గీతారెడ్డి. భర్త హఠాన్మరణంతో ఈశ్వరీబాయి కూతురు గీతతో పాటు పుట్టింటికి చేరారు. అప్పటి నుంచి సొంత కాళ్లపై నిలబడటం అలవాటు చేసుకున్నారు. తొలుత సికింద్రాబాద్ లోని ఒక స్కూల్లో టీచర్‌‌‌‌‌‌‌‌గా జీవితం ప్రారంభించారు. తర్వాత పౌరసరఫరాల శాఖలో ఉద్యోగం వచ్చింది. కొద్దిరోజులకు చిలుకలగూడలో ‘గీతా విద్యాలయం’ స్థాపించి, ఆ  ప్రాంతంలో వెనుకబడిన మహిళలను చేరదీసి వారికి చదువు చెప్పడంతోపాటు చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేశారు.

అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ స్ఫూర్తిగా..

ఈశ్వరీబాయిలో ధైర్యం, పట్టుదల, ప్రజాసమస్యల పరిష్కారం పట్ల అంకితభావం కలగడానికి డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సిద్ధాంతాలు, త్యాగచరిత ఆమెపై ఎంతో ప్రభావం చూపాయి. 1942లో నాగపూర్​లో జరిగిన అభిల భారత ఎస్సీ కులాల సభకు నిజాం రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన ఈశ్వరీబాయి అక్కడ అంబేద్కర్​ను కలుసుకున్నారు. అదే సభలో అఖిల భారత ఎస్సీ ఫెడరేషన్​ అనే రాజకీయ సంస్థను స్థాపించారు. అందులో ఈశ్వరీబాయి క్రియాశీలక పాత్ర నిర్వహించారు. ఆ తర్వాత వైస్రాయ్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌గా అంబేద్కర్ హైదరాబాద్‌‌‌‌ వచ్చారు. విక్టర్‌‌‌‌‌‌‌‌ ప్లే గ్రౌండ్‌‌‌‌ సభలో ఆయన ప్రసంగంతో స్ఫూర్తి పొందిన ఈశ్వరీబాయి ఉద్యమ బాట పట్టారు. అప్పట్లో అరిగే రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, జేహెచ్ సుబ్బయ్య, బీఎస్ వెంకట్ రావు, పులి రామస్వామి, పీడీ కళియా, సుమిత్రాదేవి, శ్యామసుందర్, హెచ్ జే కృష్ణమూర్తి వంటి ఉద్దండులు అంబేద్కర్ అనుచరులుగా ఉద్యమాలను నడుపుతున్నారు. వారితో కలిసి ఈశ్వరీబాయి ఆనాటి సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు.

రిప్లబిక్‌‌‌‌ పార్టీలో చేరిక..
1951లో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన తర్వాత జంట నగరాల నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. ఈశ్వరీబాయి చిలుకలగూడ నుంచి ఇండిపెండెంట్​గా గెలిచారు. అటు తర్వాత కార్మికులు, దళితులు, మహిళా శ్రేయస్సు కోసం ఆమె ఎంతో కృషి చేశారు. అధికార పార్టీలో చేరాలని ఎన్ని ఒత్తిడులు వచ్చినా ప్రలోభాలకు లొంగకుండా అంబేద్కర్ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లారు. అఖిల భారత షెడ్యూల్డ్​ కులాల సమాఖ్యలో చేరి హైదరాబాద్‌‌‌‌లో కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ తర్వాత ఆయన అనుచరులు సమాఖ్య స్థానంలో భారత రిపబ్లికన్ పార్టీ(ఆర్పీఐ)ని స్థాపించారు. ఈశ్వరీబాయి ఆ పార్టీలో చేరి తన సేవల ద్వారా ఉత్తమ నాయకురాలుగా పేరుగడించారు. 1986లో ఆర్పీఐ(కె) వర్గానికి జాతీయ అధ్యక్షురాలుగా ఈశ్వరీబాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ హోదాలో దేశమంతటా పర్యటించి ప్రజల స్థితిగతులను తెలుసుకోవడమే కాక పెద్ద సంఖ్యలో అనుచరులను, కార్యకర్తలను తయారు చేశారు.

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో..

1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులెవరూ పెద్దమనుషుల ఒప్పందంలోని అంశాలను పట్టించుకోలేదు. దాంతో తెలంగాణ ప్రాంతానికి ఎంతో నష్టం జరిగింది. తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఎ.మదన్ మోహన్ కన్వీనర్‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. ఇందులో మర్రి చెన్నారెడ్డి చేరడంతో ప్రజా ఉద్యమం ఊపందుకొంది. ఆనాటి ఉద్యమంలో ఈశ్వరీబాయి క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అష్టసూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించి రాజీ ప్రయత్నాలు చేసినా, ఈశ్వరీబాయి వెనక్కి తగ్గలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కొందరు నాయకులతో కలిసి సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి, అందులో కీలక పాత్ర వహించారు. ఇది ఆమె రాజనీతిజ్ఞతకు, ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. సమసమాజ స్థాపన, కనీస వేతన చట్టం, కార్మికుల రక్షణ-భద్రత, భూమి లేని నిరుపేదలకు, దళితులకు బంజరుభూమి పంపిణీ లక్ష్యంగా ఈశ్వరీబాయి కృషి చేశారు. అస్పృశ్యత నిర్మూలనా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, బడుగు బలహీన వర్గాలకు, కార్మికులకు, ఇతర నిరుపేదలకు నిత్యావసర వస్తువులు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

మహిళల అభ్యున్నతి కోసం..

ఇంటర్ వరకు బాలికలకు ఉచిత విద్యను అందించాలని, వితంతువులకు, వయోవృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని, పట్టణ మురికివాడల్లో నివసించే వారికి పక్కా ఇండ్లను నిర్మించి విద్యుత్, మంచినీళ్లు సక్రమంగా సరఫరా చేయాలని పోరాటం సాగించారు. మహిళలు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని స్వేచ్ఛా-సమానత్వాలను సాధించాలనేది ఈశ్వరీబాయి ఆకాంక్ష. దాని కోసం నిరంతరం పోరాటం చేశారు. మహిళాభ్యుదయం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈశ్వరీబాయి తన జీవితం చివరిరోజుల్లో కూడా సేవా కార్యక్రమాల్లోనే గడిపేవారు. అనారోగ్యంతో 1991 ఫిబ్రవరి 24న ఈశ్వరీబాయి తుదిశ్వాస విడిచారు. ఈశ్వరీబాయి తెలుగుదనానికి నిలువెత్తురూపం. ఆమె కట్టు, బొట్టు జీవనశైలి నేటితరానికి ఆదర్శం. ఆమె అనుసరించిన సిద్ధాంతాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆచరణీయం. తన జీవితం చివరి రోజుల వరకూ అంబేద్కర్​ ఆశయాలను అనుసరించి.. వాటి అమలుకై పోరాడిన ధన్యజీవి ఈశ్వరీబాయి.

అంబేద్కర్​ సిద్ధాంతాలే ఊపిరిగా..

1967 సాధారణ ఎన్నికల్లో ఈశ్వరీబాయి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆనాడు కాంగ్రెస్​ ప్రభుత్వం ఉండగా.. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు తరిమెల నాగిరెడ్డి, గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, జి.శివయ్య లాంటి మహామహుల సరసన కూర్చొని ప్రజావాణిని వినిపించారు ఈశ్వరీబాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, శ్రీశైలం ప్రాజెక్టులో జాప్యం, తెలంగాణ బడుల్లో అtధ్వాన పరిస్థితులు, కోస్తా జిల్లాల్లో షెడ్యూల్డ్​ తరగతుల ప్రజలపై అత్యాచారాలు, దౌర్జన్యాల వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. 1972లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి రెండోసారి విజయం సాధించారు. పదేండ్ల తన శాసనసభ సభ్యత్వ కాలంలో ఆమె ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం చేశారు. అందుకే అంతా ఆమెను ప్రజాపక్షపాతి అన్నారు. ఓటమి భయంతో ఏనాడూ ఆమె పార్టీలు మారలేదు. ఎన్నడూ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌  సిద్ధాంతాలను విడిచి పెట్టలేదు. ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోను కాకుండా నిజాయితీగా ఉండటం రాజకీయాల్లో అనితరసాధ్యం. కానీ, దానిని చేసి చూపించారు ఈశ్వరీబాయి.