జర్నలిజం దారితప్పొద్దు

జర్నలిజం దారితప్పొద్దు

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి ఎ. రేవంత్  రెడ్డి  శాసనసభలో  మీడియా స్వేచ్ఛపై మాట్లాడుతూ వెలిబుచ్చిన అభిప్రాయాలు సమాజంలో చర్చనీయాంశంగా మారాయి.  పత్రికల్లో, టీవీ  చానళ్ళలో ప్రధాన వార్తలుగా వారి అభిప్రాయాలు  వచ్చాయి.  సోషల్ మీడియాలో  ఆయన స్పీచ్  వైరల్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో కూడా ప్రధాన అంశంగా చర్చ జరిగింది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో సీనియర్ జర్నలిస్టులు మీడియా స్వేచ్ఛపై  తర్జన భర్జనలు చేస్తున్నారు. 

మీడియాకు ఉన్న హక్కులు, స్వేచ్ఛపై  మరోసారి విస్తృతస్థాయి చర్చ ప్రారంభం అయింది. జర్నలిజం రంగంలో నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్న నాలాంటి జర్నలిస్టులు, అంతకుమించి అనుభవం ఉన్న జర్నలిస్టులు కూడా  సీఎం రేవంత్ రెడ్డి  ప్రసంగంపై మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.   రెండు దశాబ్దాల క్రితం వరకు జర్నలిస్టులకు, జర్నలిజానికి  సమాజంలో గౌరవభావం ఉండేది.  ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా జర్నలిస్టుల పట్ల అత్యంత గౌరవంగా మెలిగేవారు.  

మీడియా స్వేచ్ఛ హద్దుల్లో ఉన్నంతవరకు ఈ గౌరవభావం ఉంటూ వచ్చింది.  తెలుగుతోపాటు ఇతర ఏ భాషా పత్రికల్లో అయినా ప్రచురితం అయ్యే  సింగిల్ కాలం వార్తకు కూడా స్పందన ఉండేది.  పత్రికల్లో  వచ్చే వార్తలు,  విశ్లేషణలపై  ప్రభుత్వంతో పాటు సమాజం కూడా సానుకూలంగా స్పందించేది.   పత్రికలు బాధ్యతాయుతంగా వార్తలు అందించేవి.     పాలకుల వ్యక్తిగత విషయాలను, కుటుంబ విషయాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.

నాలుగో స్తంభం

ప్రజాస్వామ్య రక్షణలో  కీలకపాత్ర పోషించే పత్రికలు లేదా మీడియాకు నాలుగో స్తంభం (ఫోర్త్ పిల్లర్) అని పేరుంది.  చట్టసభలు, పరిపాలనా విభాగం (ఎగ్జిక్యూటివ్), న్యాయవ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించి, మంచి, చెడులపై విశ్లేషించి తగిన సమాచారాన్ని ప్రజలకు అందించే బాధ్యత నాలుగో స్తంభం (ఫోర్త్ పిల్లర్)గా పేరు వచ్చిన మీడియాదే.   టీవీ ఛానళ్లు, యూట్యూబ్,  సోషల్ మీడియా ప్రజల మధ్యకు రాక పూర్వం ‘పత్రికల’ పాత్ర ప్రధానంగా ఉండేది.  

హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో  మీటింగ్ లు,  ప్రెస్ మీట్ లు ఏర్పాటుచేస్తే  వెయ్యిమందికి పైగా పాత్రికేయులు హాజరయ్యేవారు.  జిల్లాల్లో  అయితే ఈ సంఖ్య  తక్కువగా ఉండేది.  ఇప్పుడు పరిస్థితి మారింది. శాసనసభ, శాసనమండలికి 100 మంది వరకు మీడియా పేరుతో హాజరవుతున్నారు.

జిల్లాల్లో,  రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మీటింగ్, ప్రెస్ మీట్ లకు 50 మంది వరకు హాజరవుతున్నారు. మండల కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.  పాత్రికేయుల పేరుతో సామాజిక వ్యతిరేక శక్తులు కూడా రంగంలోకి దిగుతూ జర్నలిజం విలువలను నాశనం చేస్తున్నారు. ఈ విధానం విపరీత పోకడలకు దారితీస్తోంది. 

మీడియా సమస్యలపై చర్చ జరగాలి

మీడియాకు  ప్రత్యేకంగా స్వేచ్ఛలేదు.  భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ)  కింద పౌరులకు కల్పించిన  భావస్వేచ్ఛకు లోబడి పత్రికలకు (మీడియాకు) స్వేచ్ఛ ఉంది. ఈ ఆర్టికల్ కింద భారతీయులకు ఉండే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, రాసే హక్కు,  ప్రింటింగ్ చేసే హక్కు,  వీడియోలు చూపించే హక్కు ఎలా ఉంటాయో జర్నలిస్టులకు (పత్రికలకు) మీడియాకు అవే హక్కులు ఉన్నాయి.

అయితే,  మీడియా హక్కులు, సమస్యలపై రాష్ట్రస్థాయిలో  ప్రత్యేక చర్చ జరగాలి. ఇదేసందర్భంలో దశాబ్దాలుగా మీడియాలో పనిచేసిన జర్నలిస్టులకు పింఛన్ కాని ఇతరత్రా సౌకర్యాలు లేవు.  వేలాదిమంది జర్నలిస్టులు దుర్భర జీవితం గడుపుతున్నారు. జర్నలిస్టుల నిజజీవితాల గురించి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది.  జర్నలిస్టుల జీవితాల్లో  వెలుగులు నింపేందుకు  తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి చొరవ తీసుకోవాలి.

కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు లబ్ధి

తెలంగాణలో  రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీకి సొంత పత్రికలు, సొంత టీవీ చానళ్లు లేకపోవడం గమనార్హం.  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే  రాష్ట్రంలో జర్నలిస్టులకు లబ్ధి జరిగింది.  తెలంగాణ ఏర్పాటుకాక పూర్వం  హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో,  జూబ్లిహిల్స్​లో,   గోపనపల్లిలో జర్నలిస్టులకు  ఇళ్ల  స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 

పేట్ బషీరాబాద్ భూమిని జె.ఎన్.జె.హెచ్.ఎస్.కు ఇస్తామని రేవంత్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు.  2024  సెప్టెంబర్ 8న ఈ భూమిని జర్నలిస్టుల సొసైటీకి అందజేసే ఉత్తర్వులను జారీచేశారు.

- పి.వి. రమణారావు, 
సీనియర్ జర్నలిస్ట్