కోడెల.. మనసున్న డాక్టర్

కోడెల శివప్రసాద్ ను తీవ్రంగా విమర్శించే వాళ్లు ఎంత మంది ఉంటారో ఆయనను విపరీతంగా అభిమానించే వాళ్లు అంతకంటే పెద్ద సంఖ్యలో ఉంటారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవారు. డాక్టర్ కావాలని కలలు కన్నారు. అందుకుతగ్గ ప్రయత్నాలు చేశారు. గుంటూరులో ఎంబీబీఎస్ లో సీట్ తెచ్చుకున్నారు.మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక బెనారస్ వెళ్లి ఎంఎస్ చేశాక, నరసరావుపేటలో ప్రాక్టీస్ పెట్టారు. హాస్పిటల్, పేషెంట్లు, సర్జరీలు వీటితో కాలం గడిచేపోయేది. మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకోవడానికే ఆయన ఉత్సాహం చూపారు. అయితే 1982లో ఎన్టీఆర్​ ఇచ్చిన పిలుపుతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి1983 ఎన్నికల్లో నరసరావు పేట నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు.1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు ఆయన నరసరావుపేట నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 లో  సత్తెనపల్లి  నుంచి ఆరోసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

రాజకీయ జీవితమంతా వివాదాలే

శివప్రసాద్ రాజకీయాల్లోకి  వచ్చే నాటికి మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ అయినా కూడా రాజకీయం ద్వారా కూడా ప్రజలకు నాలుగు మంచి పనులు చేయవచ్చన్న ఆలోచనతో ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు. కోడెల రాజకీయ జీవితం నల్లేరుపై నడక కాదు. పొలిటికల్ లైఫ్ అంతా ఎత్తుపల్లాలతోనే గడిచింది. కోడెల పనితీరు చూసి ఎన్టీఆర్ ఆయనకు 1987లో హోం మంత్రి పదవి ఇచ్చారు. కోడెల హోం మంత్రిగా ఉండగానే  అప్పటి విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య జరిగింది. దీంతో హోం మంత్రి పదవికి కోడెల రాజీనామా చేయాల్సి వచ్చింది.

మెడికల్ ప్రొఫెషన్ పై  అంతులేని ఆసక్తి

కోడెలకు  మెడికల్ ప్రొఫెషనల్ పై ఆసక్తి ఎక్కువ. కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నరసరావు పేట వస్తే తీరిక చేసుకుని సొంత హాస్పిటల్ కు వెళ్లి  సర్జరీలు చేసేవారని ఆయన గురించి తెలిసిన వాళ్లు చెబుతారు. రోగుల సేవ ఇచ్చిన సంతృప్తి  ఇంకెక్కడా రాదని ఆయన అంటుండేవారట.పేద రోగుల పట్ల ఆయన చాలా ఆదరణ చూపేవారు. రూపాయి ఫీజు మాత్రమే తీసుకుని  ‘ రూపాయి డాక్టర్ ’ గా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పేరుతో హైదరాబాద్ లో కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటులో కోడెల కీలక పాత్ర పోషించారు. ఈ హాస్పిటల్ కు తొలి చైర్మన్ ఆయనే.

స్పీకర్ గా తీసుకున్న నిర్ణయాలపై వివాదాలు

2014 లో సత్తెనపల్లి నుంచి గెలిచిన తర్వాత ఏపీ తొలి అసెంబ్లీ స్పీకర్ గా  కోడెల ఎన్నికయ్యారు. స్పీకర్ హోదాలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.

కోటప్పకొండకు ఎంతో చేశారు

గుంటూరు జిల్లాలో త్రికోటేశ్వర స్వామి కొలువైన  కోటప్ప కొండ ఓ టూరిస్టు స్పాట్. కోడెల ఎమ్మెల్యే కాకముందు కోటప్పకొండలో భక్తులకు కనీస సదుపాయాలు కూడా ఉండేవి కావు. దీంతో కోడెల చొరవ తీసుకుని కోటప్ప కొండ అభివృద్ధికి  కృషి చేశారు. కొండ పైకి భక్తులు వెళ్లడానికి వీలుగా ఘాట్ రోడ్డు నిర్మింపచేశారు. కోటప్ప కొండ ఇవాళ్టి రోజున ఒక ముఖ్యమైన  టూరిస్టు స్పాట్ గా మారిందంటే దానివెనుక కోడెల కృషి ఎంతో ఉంది.

పల్నాడులో కేడర్ కు అండగా..

పల్నాడు అంటేనే పగలు, ప్రతీకారాలకు పెట్టింది పేరు. కాంగ్రెస్ హయాంలో అక్కడి కార్యకర్తలకు అండగా నిలబడే నాయకులే కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో  నేనున్నానంటూ తెరమీదకు వచ్చారు కోడెల. టీడీపీ కేడర్ కు ఓ కోట లా నిలబడ్డారు. దీంతో  అభిమానులు అయనను ప్రేమగా ‘ పల్నాటి పులి ’ అని పిలుచుకునే వారు. రాజకీయ ప్రత్యర్థులు మాత్రం పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారని ఆయనపై విమర్శలు చేశారు.