ఉచితాలు దేశ అభివృద్ధికి అవరోధాలు

ఉచితాలు దేశ అభివృద్ధికి అవరోధాలు

మనిషి  తనంతట తానుగా శోధించి, కష్టించి ఏదైనా స్వతహాగా సాధించుకున్నప్పుడే ఆనందాన్ని పొందుతాడు. ఆత్మవిశ్వాసంతో,  ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంకృషిని నమ్ముకుని జీవిస్తాడు.  ఈ భూమిపై  ప్రతి జంతువు తన ఆహారాన్ని  తాను  స్వయంగా వేటాడో  లేదా  అన్వేషించో  కష్టపడి  సంపాదించుకుంటోంది.  కానీ, మనిషి ఎదుగుదల  పరిణామంలో,  నాగరికత  పెరిగే క్రమంలో తన తెలివితో యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు.  కష్టపడేతత్వం  తగ్గి  సోమరితనం పెరిగి  రానురాను  ఇతరుల నుంచి ఆశించడం,  ఇతరులపై  ఆధారపడి బతకడం మొదలైంది.  

తనలోని  నేర్పు,  తనలోని శక్తిని తెలుసుకోకుండా,  తనకు అన్నీ ఇస్తున్న  ఈ  ప్రకృతికి తాను ఏమి తిరిగి ఇవ్వాలో  తెలియక మనిషి  తన మూలాన్ని పూర్తిగా  మరచిపోయి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూస్తూ కష్టపడకుండా ఉచితాలకు అలవాటుపడ్డాడు.  జీవితంలో ఎన్నో  ఒడిదుడుకులు  చూసిన  పెద్దలు  తరచుగా  చెపుతూండే మాట.. ‘మనుషులకు  చేపలను  వలవేసి పట్టే  విధానం నేర్పించాలి.  అంతేగాని  చేపలను వండించి తినిపించడం మంచిది కాదు’.   

ఎందుకంటే  ఒకసారి  చేపలను  వలవేసి పట్టడం  నేర్చుకుంటే  జీవితాంతం ఒకరి మీద  ఆధారపడకుండా ఉంటారు.  వండి  వడ్డించడం వల్ల  వాళ్లు  స్వయంగా ఎదగలేక  ఇతరులవైపు  ఆశగా  చూస్తుంటారు.  దీనిని ఆసరాగా తీసుకున్న  ప్రస్తుత రాజకీయ నాయకులు  ప్రజలను  ప్రసన్నం చేసుకోవడానికి ఉచిత పథకాలు  గురించి  చెప్పకుండా  తమ  ప్రసంగం పూర్తి కాదు.  వాటిని అమలు చేస్తారా లేదా అన్నదానిపై  ప్రస్తుతం చర్చ అనవసరం.  

ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి  రాజకీయ పార్టీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  తెలుసుకోకుండా  ప్రజలకు  ఆకర్షణీయమైన ఉచిత వాగ్దానాలు చేస్తూ,  ఒకరిపై  ఒకరు  పోటీపడుతున్నారు.  గెలిచిన  అనంతరం హామీలను నెరవేర్చడం కోసం  తంటాలు పడుతున్నారు.  మరోవైపు  ఎన్నికల ముందు  ఇచ్చిన  హామీలను  నెరవేర్చాలని  ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రభుత్వాన్ని  డిమాండ్  చేస్తాయి.  గత  ప్రభుత్వం చేసిన ఉచితాలను అమలు చేయకపోయినా చట్టపరమైన  ఇబ్బందులు ఏమీ లేవు.

కానీ,  గత  ప్రభుత్వంతో  ఒప్పందం చేసుకున్న అభివృద్ధి పనుల నిధులు విడుదల చేయకుండా  ప్రస్తుత ప్రభుత్వం ఉండలేదు.  న్యాయపరమైన  సమస్యలు  తలెత్తకుండా ఉండవు.  అందుకే  ఎన్నికల ముందు  ఇచ్చిన  హామీలను అన్ని అమలు చేయడానికి వీలుకాదని,  కేవలం  అధికారంలోకి  రావడానికి చేసే ప్రయత్నాలు మాత్రమే అని ప్రజలు అర్థం చేసుకోవాలి. 

దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరం

అందరికీ  సమన్యాయం,  అభివృద్ధి  ఫలాలు అందరికీ అందేలా ఇచ్చే సమర్థవంతమైన పాలన, అవినీతి రహిత పాలన అందించేవారిని ఎన్నుకోవడం కోసం ప్రజలు ఆరాటపడాలి.  మరో ప్రత్యామ్నాయ మార్గమైన ఉచితాల కోసం ఎదురు చూడకుండా ఉండాలి.   ప్రజలకు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల  జనంలో  కష్టపడి  పనిచేసేతత్వం తగ్గిపోతుంది.  ప్రయత్నం లేకుండా ఏదైనా లభించాలనే  ఆశావాదం,  ప్రజలను శ్రమించకుండా అలవాటు చేయడం వల్ల ఉత్పాదకత తగ్గిపోతుంది.  పన్నుల రూపంలో వచ్చే  సొమ్ము అనవసరంగా  వ్యయం అవుతుంది.  

పన్నుల  ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి పనులకు కాకుండా,  ప్రజలపై ఉచితాల రూపంలో వెచ్చించడం దీర్ఘకాలికంగా దేశ ఆర్థికవ్యవస్థకు హానికరం.   ఎప్పుడైతే  పన్నుల రూపంలో  వచ్చే ఆదాయాన్ని దేశ అభివృద్ధి కోసం,  నిజమైన సంక్షేమం కోసమే  ఖర్చు చేస్తే  పన్నులు చెల్లించేవారు సంతోషపడతారు,  పన్నులు చెల్లించేవారి సంఖ్య పెరుగుతుంది.  మన  భారత  రాజ్యాంగం  ప్రస్తావన  ప్రకారం భారత పౌరులందరికీ  సామాజిక, ఆర్థిక,  రాజకీయ, న్యాయం, అవకాశాల్లో  సమానత్వం చేకూర్చటం కోసం,  వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అవసరం.  

అదేవిధంగా  రాజ్యాంగంలోని  డైరెక్టివ్  ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం,  ప్రభుత్వం  ఆర్థిక సమానత్వం,  ప్రజా సంక్షేమాన్ని పెంపొందించాలి.  అయితే,  ఇది స్వయం ఉపాధిని ప్రోత్సహించే విధంగా ఉండాలి.  ప్రజలను  సోమరితనానికి దారి తీయకూడదు.  ప్రజలకు స్వయం ఉపాధిని అందించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాలి. 

ఉచితాల విధానాన్ని  నియంత్రించాలి

అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రధాన మంత్రులు, అధ్యక్షులు, ప్రపంచంలోని మేధావులు పలుమార్లు తమ ప్రసంగాలలో ఉచితాల వల్ల ప్రభుత్వాలు ఆర్థికంగా దివాలా తీసే ప్రమాదం ఉందని,  ఓట్ల కోసం ఉచితాల హామీలు, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని, సమర్థతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉచితాల విధానం నియంత్రించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని అభిప్రాయాలను పంచుకున్నారు.  మనిషికి కనీస అవసరాలైన నాణ్యమైన ఉచిత విద్య,   ఉచిత వైద్యం,  ప్రతి ఒక్కరికి తాగునీరు,  రోడ్ల సదుపాయం,  నిరంతర విద్యుత్ సరఫరా,  ప్రజారవాణా సౌకర్యం లాంటివి ప్రభుత్వాలు కలిపిస్తే చాలు ప్రజలు తమంతట తాముగా  ముందుకు సాగుతారు.  

వృద్ధులకు పింఛన్లు,  దివ్యాంగులకు చేయూత,  నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా వారి నైపుణ్యం పెంపొందించేవిధంగా చర్యలు, వ్యవసాయ,  పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం అందిస్తే మేలు.  ఇవన్నీ కూడా నిజాయితీగా అమలుపరచడం ప్రజల సృజనాత్మకతను, స్వయం ఉపాధి పెంచడానికి కావలసిన మార్గాలు అన్వేషిస్తూ పాలన సాగించడం నిజమైన నాయకుని లక్షణం.  నాయకుడు త్రికరణశుద్ధిగా వ్యవహరించడంతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చును.  అయితే,  దేశంలో ఉచితాలపై  జరుగుతున్న చర్చవలన  ఆ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో  రాష్ట్రాలు తమ బడ్జెట్లో ఉచితాలు కోసం ఎంత కేటాయింపులు జరుపుతారో వేచి చూడాల్సిందే. 

స్వయంకృషి  వైపు ప్రోత్సాహకాలను అందించాలి

స్వయంకృషి  వైపు  కొన్ని  ప్రోత్సాహకాలను రూపొందించాలి.  అప్పుడే  దేశం ఆర్థికంగా బలపడుతుంది.  ఉచితాలు  ప్రజాసంక్షేమానికి  అవసరమైనవి.  కానీ,  ప్రజలను ప్రభుత్వంపై  ఆధారపడేలా చేయడం సరికాదు.  ప్రజల  ఆర్థిక స్వావలంబనను పెంచేవిధంగా ఉచితాలను రూపకల్పన చేయాలి.  ఎన్నికల ముందు  రాజకీయ  పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఉచిత పథకాలను ఇస్తామని హామీలతో  జనాలను మోసం చేస్తున్నారని,  అటువంటి రాజకీయ పార్టీల  గుర్తులను రద్దు చేయాలని  సుప్రీంకోర్టులో  ఒక జాతీయ పార్టీకి చెందిన నేత ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  

దీనిపై  చీఫ్ జస్టిస్  ఎన్ వి రమణ నేతృత్వంలో సుదీర్ఘ  వాదనలు జరిగాయి.  దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను మేం వారించలేమని మా పరిధి కాదని తేల్చి చెప్పింది.  ఏది ఉచితమని,  ఏది సంక్షేమమని ప్రజలు తెలుసుకోవడం ముఖ్యమని, దీనిపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది.   కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో  చూడాలి.  గత  ఫిబ్రవరి మాసంలో చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్,  జస్టిస్ అగస్టీన్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఉచితాలతో లబ్ధిదారులు  సమాజంలో పరాన్న జీవులుగా  మారుతున్నారని వ్యాఖ్యలు చేసింది.  ధర్మాసనం ఎన్నికల ముందు ఉచితాలు ప్రకటించడం తీవ్రంగా తప్పుపట్టింది. ఉచితంగా రేషన్, డబ్బు ఇవ్వడంతో ప్రజలు పనిచేయడం లేదని వ్యాఖ్యానించింది. 

సోమశ్రీనివాస్ రెడ్డి,
కార్యదర్శి, 
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్