
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. దాదాభాయి నౌరోజీ, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, బాలాగంగాధర్ తిలక్ వంటి జాతీయ నాయకుల భావాలు, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన వివిధ రాజ్యాంగాల ప్రభావం భారత రాజ్యాంగాన్ని ప్రభావితం చేశాయి. ప్రాథమిక హక్కుల గురించి స్వాతంత్య్ర పోరాట కాలంలో ఎన్నో సమీక్షలు జరిగాయి. మోతీలాల్ నెహ్రూ కమిటీ రిపోర్టు(1928), కాంగ్రెస్ కరాచి సమావేశం(1931) మొదలైనవి ప్రాథమిక హక్కుల ప్రాధాన్యత పేర్కొన్నాయి. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఆశయాల తీర్మానం భారత రాజ్యాంగ నిర్మాతలకు మార్గదర్శకత్వం వహించింది. దీన్ని ఆధారంగా తీసుకొని రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందుపరిచారు. రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరచిన ఈ హక్కులను న్యాయబద్ధమైనవిగా పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులను రాజ్యాంగములోని 3వ భాగంలో 12 నుండి 35 అధికరణలలో పొందుపర్చారు. అమెరికా రాజ్యాంగములోని బిల్ ఆఫ్ రైట్స్ ను పోలి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మొదట ప్రాథమిక హక్కులు 7 ఉండగా ఆస్థిహక్కును తొలగించారు.
ప్రాథమిక హక్కులు
రాజ్యాంగం ఆరు ప్రాథమిక హక్కులను కల్పించింది. అవి సమానత్వపు హక్కు-, స్వాతంత్య్రపు హక్కు -, పీడనం నిరోధపు హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్యా విషయక, సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు. 12 వ అధికరణము ప్రకారం రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు మరియు స్థానిక ప్రభుత్వాలు.
1. సమానత్వపు హక్కు ( 14 నుండి 18)
14వ అధికరణం ప్రకారం చట్టం ముందు అందరూ సమానత్వం అని తెలియజేస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అనే భావన బ్రిటీష్ రాజ్యాంగం స్ఫూర్తి. చట్టం ముందు అందరూ సమానమనే నియమం రాష్ట్రపతి, గవర్నర్లకు వర్తించదు. 15వ అధికరణం ప్రకారం జాతి, కుల, మత, లింగ సంబంధమైన విచక్షణ చూపరాదు. 16వ అధికరణం ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికి సమాన అవకాశాలు కల్పించబడ్డాయి. 16 (4) అధికరణం ప్రకారం వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను కల్పించింది. 17వ అధికరణము ప్రకారం అంటరానితనం నేరం. 18వ అధికరణం ప్రకారం విద్య, సైనికపరమైన పురస్కారాలు తప్ప ఇతర ఏ రకమైన బిరుదులను స్వీకరించడాన్ని నిషేదిస్తుంది.
2. స్వాతంత్య్రపు హక్కు(19 నుండి 22)
స్వేచ్ఛ లేదా స్వాతంత్ర్యపు హక్కు ప్రాథమిక హక్కులన్నింటిలో ప్రధానమైనదని రాజ్యాంగ నిపుణులు యం.వీ. పైలీ తెలిపారు. కార్యనిర్వాహక శాఖ అణిచివేత చర్యల నుండి వ్యక్తులను కాపాడుటకు ఈ హక్కు తోడ్పడుతుంది. రాజ్యాంగము అమలులోకి వచ్చినపుడు 19వ అధికరణలో 7 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 19(f)ను ఆస్థి స్వేచ్ఛ తొలగించడంతో 6 మాత్రమే ఉన్నాయి. 20వ అధికరణం ప్రకారం చట్టాన్ని అతిక్రమించనిదే ఏ ఒక్క వ్యక్తినీ నేరం కింద శిక్షించరాదు. 21వ అధికరణము ప్రకారం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను, జీవించే హక్కు వ్యక్తి జీవనానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించరాదు. 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21(A) అధికరణం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల లోపు వయస్సు గల బాల బాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య కల్పించాలి. 359 అధికరణం ప్రకారం ప్రాథమిక హక్కులు అన్ని తాత్కాలికంగా రద్దుచేయబడిన 20, 21 అధికరణములు రద్దు చేయరాదు. 22వ అధికరణం ప్రకారం ఏ వ్యక్తినీ కారణం లేకుండా నిర్బంధించరాదు. నిర్బంధించిన వ్యక్తిని తప్పనిసరిగా 24 గంటలలోపు కోర్టు ముందు హాజరు పర్చాలి.
3) పీడనాన్ని నిరోధించే హక్కు (23 & 24)
వ్యక్తుల హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని గుర్తించి పరిరక్షించి పెంపొందించే ఉద్దేశంతో ఈ హక్కును కల్పించారు. 23వ ఆర్టికల్ ప్రకారము వెట్టిచాకిరి, బానిసత్వం, పడుపు వృత్తిని నిషేధించారు. 1975 సంవత్సరంలో వెట్టిచాకిరి నిరోధక చట్టం ద్వారా ఈ దురాచారాలను రూపుమాపే ప్రయత్నం జరిగింది. 24వ అధికరణము ప్రకారము 14 సంవత్సరాలలోపు పిల్లలను ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హానికరమైన పనులలో నియమించడాన్ని నిషేధించింది.
4) మత స్వాతంత్య్రపు హక్కు
భారతదేశాన్ని లౌకికరాజ్యంగా తీర్చిదిద్దేందుకు ఈ హక్కు ఉపయోగపడుతుంది. ఈ హక్కును భారత పౌరులతో పాటు విదేశీయులు అనుభవిస్తారు. 25వ ఆర్టికల్ ప్రకారం ప్రతి వ్యక్తి ప్రజాభద్రత, నైతిక, ఆరోగ్యాలకు లోబడి తన అంతరాత్మ అనుసరించి ఇష్టం వచ్చిన మతాన్ని అవలంబించి, ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది. 26వ అధికరణ ప్రకారం మతపరమైన, ధార్మికమైన సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. మత నిర్వాహణకు వ్యక్తుల వద్ద నుండి నిర్బంధంగా పన్నులు వసూలు చేయరాదు. 27వ అధికరణం ప్రకారము మత సంస్థల నిర్వహణకు పౌరులెవ్వరూ పన్నులు చెల్లించవద్దు. 28వ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థలలో మత బోధన జరగరాదు. మత మార్పిళ్లు నిషేధిస్తూ ఒడిశా 1967వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చట్టం చేసింది.
5) సాంస్కృతిక, విద్యా విషయక హక్కు (29 & 30)
ఈ హక్కు భాషా ప్రాతిపదికపై అల్పసంఖ్యాక వర్గాల వారి రక్షణకు ఉద్దేశించింది. 29వ ఆర్టికల్ ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల భాష, లిపి, సంస్కృతి పరిరక్షించాలి. 30వ అధికరణము ప్రకారం మతం, భాష ప్రాతిపదికపై ఏర్పడిన అల్ప సంఖ్యాక వర్గాల వారు తమకు నచ్చిన విధంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి నిధులు మంజూరు చేయాలి. ప్రస్తుతం భారతదేశంలో మత మార్పిడులను నిషేధిస్తూ ఒడిశా, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు చట్టం చేశాయి.
6) రాజ్యాంగ పరిహార హక్కు (32వ అధికరణం)
ప్రాథమిక హక్కులకు 'కంచె', భద్రతా వలయంగా ఈ హక్కును పరిగణించవచ్చు. అంబేద్కర్ రాజ్యాంగ పరిహార హక్కును ‘ఆత్మ, హృదయం’ గా తెలియజేశాడు. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టు 32వ అధికరణము ప్రకారం, హైకోర్టులు 226 అధికరణము ప్రకారం రిట్లను జారీ చేస్తాయి. రిట్లు అనగా తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం లేదా ఆజ్ఞ అంటారు. న్యాయస్థానాలు 5 రకాల రిట్లను (హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరి, కో-వారంటో) జారీ చేస్తాయి.
ముఖ్యమైన కేసులు
14వ రాజ్యాంగ సవరణ ద్వారా వ్యక్తుల ఆస్తులను అవసరం కోసం అన్యాక్రాంతం చేసుకుంటే నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలి. 1964లో 31 (A) కు సవరణ చేశారు. దీని ప్రకారం భూ కమతాలకు సంబంధించి రాష్ట్రాల నిర్ణయం చెల్లదని సుప్రీం కోర్టు తెలిపింది. 1952లో శంకరీ ప్రసాద్ VS యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులు సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1967లో గోలక్ నాధ్ VS పంజాబ్ ప్రభుత్వం కోసులో పార్లమెంట్ కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది.1973లో కేశవానంద భారతి VS కేరళ కేసులో రాజ్యాంగ మౌఖిక స్వరూపాన్ని మార్చకుండా పార్లమెంట్ 368 అధికరణం ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా మార్చే అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్థిహక్కును 31 అధికరణ తొలగించి 300(A) అధికరణలో చేర్చారు.
1) భారతదేశంలో పత్రికా స్వాతంత్ర్యం? (C )
A) పార్లమెంట్ చట్టానికి లోబడి ప్రజలకు లభించును.
B) రాజ్యాంగంలో ప్రత్యేకించి కల్పించబడినది.
C) భావ ప్రకటన స్వాతంత్ర్య హక్కులో భాగం.
D) కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా భారత ప్రజలకు లభిస్తుంది
2) ఈ క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కును కేవలం భారత పౌరులకు మాత్రమే కల్పించారు. విదేశీయులకు కల్పించలేదు? (B )
A) చట్టం ముందు సమానత్వం, చట్టం ద్వారా సమాన రక్షణ
B) వాక్కు, భావ ప్రకటన స్వాతంత్ర్యం
C) జీవిత, స్వేచ్ఛ హక్కు
D) మత స్వాతంత్ర్యపు హక్కు
3) కింది వ్యాఖ్యలను పరిశీలించండి. భారత రాజ్యాంగ ప్రకరణ 12కు లోబడి 'రాజ్యం' వీటితో కూడి ఉంటుంది? (A)
1) భారత ప్రభుత్వం, భారత పార్లమెంట్
2) రాష్ట్రాల ప్రభుత్వం, శాసనసభ
3) భారత ప్రభుత్వ నియంత్రణకు లోబడిన లేదా భారత భూభాగంలోని స్థానిక సంస్థలు
పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
A) 1,2 మరియు 3 B) 1 మరియు 2
C) 2 మరియు 3 D) 1 మరియు 3
-బి.ఎన్. రావు
నాలెడ్జ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, మిర్యాలగూడ