అంబేద్కర్ కాలేజీ బలహీన వర్గాల విద్యార్థుల భవితకు బలమై నిలిచింది. ఐదు దశాబ్దాలుగా పేదల విజ్ఞానపు రథచక్రానికి ఇరుసై నడిచింది. ఇది ఒక చారిత్రక సందర్భం. తెలుగు నేలపై పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి ఆత్మగౌరవంతో జీవించాలని ఆకాంక్షించి పేదలకు నాణ్యమైన చదువును అందించాలని తపించిపోయిన గడ్డం వెంకటస్వామి అతి సాధారణ కుటుంబంలో పుట్టి అనేక కష్టాలను చవిచూసి, అహర్నిశలు శ్రమించి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థానాలకు చేరుకున్న మహోన్నత నాయకుడు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కాకా ఆయనను కలిసి సంభాషించారు. అప్పుడు అంబేద్కర్ పాఠశాలలను ఏర్పాటు చేసి పేదలను విద్యావంతులను చేయండని సూచించడంతో కాకా అంబేద్కర్ ప్రేరణతో తనకున్న రాజకీయ అనుభవంతో 1973లో డా. బీఆర్ అంబేద్కర్ పేరుతోనే హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో మూడు ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన క్యాంపస్‌లో ఒక కాలేజీని ఏర్పాటు చేసి, నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అది ప్రజాదరణ పొంది అభివృద్ధి చెందడంతో దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపచేసి అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీగా వృద్ధి చేశారు. అందులో కేజీ టూ పీజీతో పాటు లా కాలేజీని కూడా ఏర్పాటు చేశారు.
ఈ ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో స్వయం ఆర్థిక సదుపాయాలను కూడా సమకూర్చుతూ విద్యను అందిస్తున్నారు. క్రమంగా నాటి నుంచి నేటివరకూ ఐదు దశాబ్దాలుగా తమ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. ఇప్పటివరకూ అంబేద్కర్ కాలేజీ నుంచి దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు విద్యతోపాటు అనేక ప్రయోజనాలను పొందారు. విద్య, వైద్య, పరిపాలన విభాగాలతో పాటు సామాజిక, రాజకీయ చైతన్యంతో అనేక విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ దేశానికి సేవలను అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
సంక్షేమ మార్గంలో విద్య
ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా సంక్షేమమే ధ్యేయంగా గడ్డం వెంకటస్వామి ప్రారంభించిన విద్యా సంస్థల్లో 80 శాతం మార్కులు సాధించిన మెరిట్ గల విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అలాగే ప్రతిభ గల నిరుపేద విద్యార్థులకు ఉచిత భోజనం అందించడంతో పాటు సాప్ట్, డిజిటల్ స్కిల్స్‌ను నేర్పిస్తున్నారు. ట్రైనింగ్, ప్లేస్మెంట్ సెల్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల నైపుణ్యాలను వృద్ధి పరిచేందుకు క్రమం తప్పకుండా వర్క్ షాపులు నిర్వహిస్తూ కోర్స్ ముగిసేలోపు ఉద్యోగ అవకాశాలను చూపిస్తున్నారు. విద్యార్థుల ప్రవర్తన, ప్రతిభలపై ఎప్పటికప్పుడు మెరుగు చేసేటందుకు ప్రతి నెల విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
మలిదశ ఉద్యమంలో అంబేద్కర్ కాలేజీ
నీళ్లు, నిధులు, నియామకాలు, భాష అనే నినాదపు ఆకాంక్షల కోసం నిర్విరామంగా జరిగిన మలిదశ ఉద్యమంలో అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు తమదైన పద్ధతిలో తమ ధిక్కారపు స్వరాలను వినిపిస్తూ బిగిసిన పిడికిళ్లతో ఉద్యమించారు. సాయుధ పోరాటంలో, తొలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కాకా చేసిన ఉద్యమచైతన్యాన్ని అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు పుణికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులను చేపట్టారు. మిలియన్ మార్చ్, విద్యార్థి గర్జన లాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యమించారు. అనేక సందర్భాల్లో ర్యాలీలు, ధర్నాలు చేస్తూ నల్లకుంట, చిక్కడపల్లి, క్రాస్ రోడ్స్ లోని పోలీసుల చేతుల్లో అరెస్ట్ అయ్యారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య
ఎన్నో రకాల మహత్తరమైన కార్యక్రమాలతో పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ ఐదు దశాబ్దాలుగా వర్ధిల్లుతున్న అంబేద్కర్ కాలేజీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ గడ్డం వెంకటస్వామి ఆలోచన విధానం ప్రకారం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల భవితవ్యం మార్పుకోసం ఒక హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే ఆయన ఆశయాన్ని కొనసాగించాలని ఆకాంక్షిస్తూ కాకా వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నతునికి జోహార్లు అర్పిద్దాం.
కాలేజీ ప్రత్యేకతలు
యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అంబేద్కర్ కాలేజీ తనదైన పద్ధతిలో ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు అత్యంత ప్రముఖంగా నిలువడం జాతీయ స్థాయిలో పేరును సాధించడం జరుగుతోంది. విద్యార్థుల శారీరక అభివృద్ధి, దృఢత్వం కోసం వ్యాయామ శిక్షణ, జిమ్, బాక్సింగ్ ప్రతిభగల శిక్షకులతో కూడిన విభాగాలను ఏర్పాటు చేసి నడుపుతున్నారు. ఆధునిక పద్ధతిలో విద్యార్థులకు శిక్షణ సులువు చేయడం కోసం ఈ –క్లాస్ రూంలను ఏర్పాటు చేసి బోధించడం జరుగుతున్నది. అన్ని రకాల పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తూ అందుకు సంబంధించిన పుస్తకాలను లైబ్రరీ సహాయంతో అందిస్తూ ప్రోత్సహించడం జరుగుతోంది.
- ఎనుపోతుల వెంకటేశ్,
డా. బీఆర్ అంబేద్కర్ కాలేజీ