ఎన్నో సినిమాలు చేస్తే రాని పేరు ఒక్క సినిమాతో..

ఎన్నో సినిమాలు చేస్తే రాని పేరు ఒక్క సినిమాతో..

ఇన్నోసెంట్ ఫేస్. క్యూట్ లుక్స్.. మెచ్యూర్డ్ యాక్టింగ్. తెలుగులో చేసిన తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. ఎంతో కష్టపడితే కానీ రాని పాపులారిటీ దక్కించుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చినంత వేగంగానే ఎవరికీ కనిపించకుండా మాయమైపోయిన ఆమె గిరిజా షెత్తర్. గిరిజ పేరు చెప్తే ఎవరూ పోల్చుకోలేకపోవచ్చు. కానీ నాగార్జున హీరోగా నటించిన ‘గీతాంజలి’ గిరిజ అంటే ఠక్కున గుర్తు పట్టేస్తారు. మణిరత్నం తీసిన ఈ ప్రేమకథతో పాటు అందులో నాగార్జున ప్రేయసిగా నటించిన గిరిజను ఎవ్వరూ మర్చిపోలేరు. ఇవాళ ఆమె పుట్టిన రోజు సందర్భంగా గిరిజ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మొదటి సినిమాతోనే గుర్తింపు

గిరిజ పూర్తి పేరు గిరిజా ఎమ్మా జేన్ షెత్తర్. తండ్రిది కర్ణాటక. వృత్తి డాక్టర్. తల్లి ఇంగ్లండ్‌కి చెందిన బిజినెస్ ఉమెన్. గిరిజ ఇంగ్లండ్‌లోనే పుట్టి పెరిగింది. 18 ఏళ్ల వయసులో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేందుకు ఇండియా వచ్చింది. క్రికెటర్ శ్రీకాంత్‌ ఆమెకు బంధువు. శ్రీకాంత్ చెల్లెలితో కలిసి మణిరత్నం, సుహాసిని పెళ్లికి వెళ్లగా.. ఆమెని చూసిన మణిరత్నం ‘గీతాంజలి’ మూవీలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇందుకోసం 2 నెలల పాటు యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకుంది. మొదటి సినిమాలోనే టైటిల్‌ రోల్‌ పోషించిన గిరిజ.. తన అద్భుత నటనతో అందరి కాంప్లిమెంట్స్ అందుకుంది. జల్లంత కవ్వింత కావాలిలే అంటూ ఆమె వేసిన స్టెప్స్.. లేచిపోదామన్న మొనగాడా అంటూ చెప్పిన డైలాగులు.. నాగార్జునతో చిలిపి తగాదాలు.. కొద్ది రోజుల్లో చనిపోతానని తెలిసినా ఆనందంగా గడిపేస్తూ చేసే అల్లరి చేష్టలు ప్రేక్షకులకి తెగ నచ్చేశాయి. అందుకే అందరికీ ఫేవరేట్ అయిపోయింది. ఎన్నో సినిమాలు చేస్తే కానీ రాని పేరును గిరిజ ఒక్క సినిమాతోనే దక్కించుకుంది. ఆ మూవీలో గిరిజ వేసుకున్న డ్రెస్సులు మార్కెట్లో గీతాంజలి డ్రెస్సులుగా ఫేమస్ అయ్యాయంటే తనకొచ్చిన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

నటనను సీరియస్గా తీసుకోలేదు

గీతాంజలితో పాపులర్ అయినా గిరిజ నటనను అంత సీరియస్‌గా తీసుకోలేదు. మోహన్‌ లాల్‌తో కలిసి ‘వందనం’ అనే మలయాళ మూవీలో నటించింది. ఆయనతోనే మరో మూవీ కూడా చేసింది కానీ అది రిలీజ్ కాలేదు. ‘జో జీతా వోహీ సికిందర్‌‌’లో అమీర్‌‌ ఖాన్‌తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఏవో కమిట్‌మెంట్స్ కారణంగా తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఆయేషా జుల్కాను తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన ‘హృదయాంజలి’ మూవీ నాలుగు నంది అవార్డుల్ని సొంతం చేసుకుంది. చివరగా ‘తుఝే మేరీ కసమ్’ అనే సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది గిరిజ. చెప్పుకునేందుకు గిరిజ కెరీర్‌‌ ఇంతే. అయితే ఆమెకి వచ్చిన పేరు మాత్రం కొండంత. 

లండన్లో జర్నలిస్టు

గీతాంజలి సినిమా చూసినప్పుడల్లా ఇప్పటికీ ఈ అమ్మాయి ఏమైపోయిందబ్బా అని తెలుగు ప్రేక్షకులు అనుకోకుండా ఉండరు. గిరిజ కూడా సినీ ఇండస్ట్రీలో తన అనుభవానల్ని ఎన్నటికీ మర్చిపోలేనని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నిజానికి నటి కావాలన్నది ఆమె లక్ష్యం కాదు. డ్యాన్స్ నేర్చుకోవాలని, హిందుత్వంపై రీసెర్చ్ చేయాలని ఇండియా వచ్చింది. చేసింది కూడా. ఆ తర్వాత లండన్‌ వెళ్లిపోయి అక్కడే సెటిలైంది. ప్రస్తుతం అక్కడే జర్నలిస్ట్గా పనిచేస్తోంది. సినిమాలకు దూరమై ఏండ్లు గడుస్తున్నా.. గీతాంజలి గిరిజగా ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది.