భారత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశ పెట్టింది. 74, 75 ప్రకరణల ప్రకారం కేంద్రం, 163, 164 ప్రకరణల ప్రకారం రాష్ట్రాల్లో పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాంగాలైన శాసనసభ, కార్యనిర్వాహక వర్గాల మధ్య గల సంబంధాల స్వభావాన్ని అనుసరించి ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా వర్గీకరించారు. పార్లమెంటరీ వ్యవస్థలో కార్యనిర్వాహక వర్గం తన విధానాలకు, చర్యలకు శాసనసభకు బాధ్యత వహిస్తుంది. అధ్యక్షతరహా వ్యవస్థలో కార్యనిర్వాహకవర్గం తన విధానాలకు, చర్యలకు శాసనసభకు బాధ్యత వహించదు. ఈ ప్రభుత్వం తన పదవీ కాలంలో శాసనసభపై ఆధారపడకుండా రాజ్యాంగం ద్వారా స్వతంత్రంగా ఉంటుంది.
పార్లమెంటరీ ప్రభుత్వాన్ని కేబినెట్ ప్రభుత్వమని లేదా బాధ్యతాయుత ప్రభుత్వమని లేదా వెస్ట్‌మినిస్టర్స్ తరహా ప్రభుత్వమని పేర్కొంటారు. ఈ తరహా ప్రభుత్వం బ్రిటన్, జపాన్, కెనడా, ఇండియా తదితర దేశాల్లోనూ అమలులో ఉంది. అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని బాధ్యతారాహిత్య ప్రభుత్వమని లేదా నాన్ కేబినెట్ ప్రభుత్వమని లేదా నిర్ధారిత కార్యనిర్వాహక ప్రభుత్వ వ్యవస్థ అని పేర్కొంటారు. ఈ తరహా ప్రభుత్వం అమెరికా, బ్రెజిల్, రష్యా, శ్రీలంక తదితర దేశాల్లో అమలులో ఉంది.
పార్లమెంటరీ వ్యవస్థలో అధికారానికి కేంద్ర బిందువుగా కేబినెట్ ఉండటంతో రాజ్యాంగ నిపుణుడు ఐవర్ జెన్నింగ్స్ దీనిని కేబినెట్ వ్యవస్థగా అభివర్ణించారు. వాస్తవ కార్యనిర్వాహక వర్గం ఉండే కేబినెట్ పార్లమెంట్‌కు బాధ్యత వహిస్తూ పార్లమెంట్ విశ్వాసం ఉన్నంతవరకు అధికారంలో ఉంటుంది. కాబట్టి పార్లమెంటరీ ప్రభుత్వాన్ని బాధ్యతాయుత ప్రభుత్వం అని పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవస్థ ఆవిర్భావానికి మాతృక అయిన బ్రిటిష్ పార్లమెంట్ వెస్ట్ మినిస్టర్ అనే ప్రాంతంలో ఉండటంతో దీనిని వెస్ట్ మినిస్టర్స్ తరహా ప్రభుత్వం అని పిలుస్తారు.
నామమాత్ర, కార్యనిర్వహణాధికార నేతలు
రాష్ట్రపతి నామమాత్ర కార్యనిర్వహణాధికారి(డి జూర్ ఎగ్జిక్యూటివ్ లేదా టిటూర్ ఎగ్జిక్యూటివ్) లేదా లాంఛన అధినేతగా ఉంటారు. ప్రధాన మంత్రి వాస్తవ కార్యనిర్వహణాధికారి (డిఫ్యాక్టో ఎగ్జిక్యూటివ్)గా ఉంటారు. 74వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతికి సహాయపడటానికి, సలహాలు ఇవ్వడానికి ప్రధాన మంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుంది. మంత్రి మండలి సలహాలను అనుసరించి రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలి. మంత్రి మండలి సలహాలను రాష్ట్రపతి ఆమోదించి తీరాలి.
మెజార్టీ పాలన
లోక్‌సభలో అత్యధిక సీట్లు సాధించిన రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మెజార్టీ పార్టీ నాయకుడినే రాష్ట్రపతి, ప్రధాన మంత్రిగా నియమిస్తారు. ప్రధాన మంత్రి సలహా ప్రకారం ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. అయితే, ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే వివిధ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.
సమిష్టి బాధ్యత
పార్లమెంటరీ ప్రభుత్వంలో సమిష్టి బాధ్యత సూత్రం ఎంతో ముఖ్యమైంది. పార్లమెంట్ ముఖ్యంగా లోక్‌సభకు మంత్రి మండలి సమిష్టిగా బాధ్యత వహించాలి. మంత్రి మండలి సభ్యులంతా కలిసిమెలిసి జట్టుగా పనిచేయాలి. సమిష్టి బాధ్యత అనే సూత్రం ప్రకారం లోక్‌సభ అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాన మంత్రి నేతృత్వంలోని మంత్రి మండలిని తొలగించగలదు.
ప్రధాన మంత్రి నాయకత్వం
ఈ వ్యవస్థలో ప్రధాన మంత్రి నాయకత్వ పాత్రను పోషిస్తారు. అతను మంత్రి మండలికి నాయకుడు, పార్లమెంట్‌కు నాయకుడు, అధికార పార్టీకి నాయకుడు. ఈ రకమైన హోదాలతో ఆయన ప్రభుత్వ నిర్వహణలో ప్రముఖమైన పాత్రను నిర్వర్తిస్తాడు.
గోప్యత
గోప్యత సూత్రం ప్రకారం మంత్రులు ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను, విధి వ్యవహారాలను వెల్లడించకూడదు. అధికారాన్ని స్వీకరించే ముందు వీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనిని రాష్ట్రపతి చేయిస్తారు.
రాజకీయ సజాతీయత
సాధారణంగా మంత్రి మండలిలోని సభ్యులందరూ ఒకే పార్టీకి చెందిన వారు ఉంటారు. దీనివల్ల వారు ఒకే రాజకీయ సిద్ధాంతాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మంత్రులు సర్వసమ్మతి సూత్రానికి కట్టుబడతారు.
ద్వంద్వ సభ్యత్వం
శాసనసభలోనూ కార్యనిర్వాహక వర్గంలోనూ మంత్రులు సభ్యులుగా ఉంటారు. అంటే.. పార్లమెంట్లో సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా కొనసాగలేడు. ఒక మంత్రి వరుసగా ఆరు నెలలు సమయంలో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే అతను మంత్రి పదవిని కోల్పోతారని రాజ్యాంగం పేర్కొంటోంది.
దిగువసభ రద్దు
ప్రధాన మంత్రి సిఫారసుపై రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయగలడు. అంటే నిర్ణీత పదవీకాలానికి ముందే లోక్‌సభను రద్దు చేయమని రాష్ట్రపతికి ప్రధాన మంత్రి సలహా ఇవ్వొచ్చు. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరిపించవచ్చు. దీనివల్ల పార్లమెంటరీ వ్యవస్థలో శాసనసభను రద్దు చేసే హక్కు కార్యనిర్వాహకవర్గానికి ఉందని తెలుస్తున్నది.