
బహమనీల కాలం నుంచి ముల్కీ, నాన్‌ముల్కీల సమస్య ఉంది. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ వంశాలైన ఖిల్జీ, తుగ్లక్ సైన్యాలతోపాటు దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారిని దక్కనీలు అనేవారు. వీరిలో హిందువులు, ముస్లింలు ఉన్నారు. బహమనీ సుల్తానుల కాలంలో దక్కనీలు/ స్థానికులుగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందేవారు. అదే సమయంలో ఇరాన్, ఇరాక్, టర్కీ, అరేబియా దేశాల నుంచీ అనేక మంది దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిని ఆఫాకీలు/ స్థానికేతరులు అనేవారు. దక్కనీలు ముల్కీలుగా(స్థానికులు), ఆఫాకీలు గైర్ ముల్కీలుగా వ్యవహరించేవారు.
14వ శతాబ్దంలో వర్తక వాణిజ్యాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు అందజేసేది. విదేశాల నుంచి వచ్చిన ఆఫాకీలు వర్తక వాణిజ్యాల్లో చేరి ఆర్థికంగా స్థిరపడ్డారు. సైన్యం, ఇతర ఉద్యోగాల్లో ప్రముఖ స్థానాలను ఆక్రమించారు. మంత్రి పదవులు సంపాదించారు. దక్కనీలు అన్ని రంగాల్లో రెండో శ్రేణి పౌరులుగా ఉండేవారు. రాజ్య సంపదలో ఆఫాకీలదే పైచేయి. దక్కనీల వాటా చాలా తక్కువ. వారికి చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే దక్కాయి. ప్రభుత్వం, పరిపాలనలో ఆఫాకీలే ఆధిక్యం సంపాదించి అన్ని ప్రయోజనాలు పొందారు. దీంతో ఆఫాకీలకు, దక్కనీలకు అన్ని రంగాల్లో అంతరాలు పెరిగి శత్రుత్వం ఏర్పడింది. ఆఫాకీలు షియాలు, దక్కనీలు సున్నీలు కావడంతో మత విభేదాలూ ఎక్కువయ్యాయి. బహమనీ సుల్తాన్ మూడో మహమ్మద్ ప్రధాని మహమ్మద్ గవాన్ బీదర్‌లో విశ్వవిద్యాలయం స్థాపించాడు. ఇందులో ఆచార్యులు, విద్యార్థులందరూ ఆఫాకీలే. చదువు పూర్తికాగానే వారంతా రాజుగారి కొలువులో ఉన్నత ఉద్యోగాలు, పదవులు సంపాదించేవారు. దక్కనీలకు చిన్నచిన్న ఉద్యోగాలు దక్కేవి. ముల్కీ, గైర్ ముల్కీల మధ్య జరిగిన అంత: కలహాలతో 16వ శతాబ్దం మొదటి దశాబ్దంలో బహమని రాజ్యం పతనమైంది.
స్థానికులకు పెద్దపీట
బహమనీ రాజ్యం స్థానంలో ఏర్పడిన ఐదు రాజ్యాల్లో గోల్కొండ కుతుబ్‌షాహీ రాజ్యం ఒకటి. 1512లో గోల్కొండలో స్వతంత్ర కుతుబ్‌షాహీ రాజ్యాన్ని స్థాపించిన కులీకుతుబ్‌షా ఆఫాకీ. బహమనీ రాజ్యంలో ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమాల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు. స్థానిక తెలుగు భాషను ప్రోత్సహించాడు. అబుల్ హసన్ తానీషా కాలంలో మహా మంత్రిగా మాదన్న , సైన్యాధిపతిగా అక్కన్న పనిచేశారు. కుతుబ్‌షాహీ రాజులు స్థానికుల చరిత్ర, సంస్కృతులను గౌరవించడంతో ముల్కీ సమస్య తలెత్తలేదు. 1724లో నిజాముల్ ముల్క్ మొగలుల నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొని హైదరాబాద్‌లో అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి నిజాం దక్కన్కు వచ్చినప్పుడు తనవెంట విశ్వాసపాత్రులైన అనుచరులను తీసుకువచ్చాడు. అందులో ముస్లింలతోపాటు హిందువులు ముఖ్యంగా కాయస్తులు ఉన్నారు. వీరంతా జాగీర్లు, మంత్రి పదవులతోపాటు ఉన్నత ఉద్యోగాలన్నీ చేజిక్కించుకున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత మొఘలుల రాజ్యం అంతరించగానే ఢిల్లీ, లక్నో, ముర్షిదాబాద్, అవధ్ రాజ్యాల నుంచి పదవులు, ఉద్యోగాలు కోల్పోయిన వారంతానిజాం రాజ్యంలోకి వలస వచ్చారు.
పెరిగిన వలసలు
ఐదో నిజాం (అఫ్జల్ ఉద్దౌలా) కాలంలో ప్రధాని సాలార్ జంగ్ చేపట్టిన పరిపాలనా సంస్కరణల వల్ల కాయస్తులు, ఖత్రీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కోసం వలస వచ్చారు. హైదరాబాద్‌లో సివిల్ సర్వీసు స్థాపించిన సాలార్జంగ్ తప్పనిసరై అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యావంతులైన వారిని హైదరాబాద్‌కు ఆహ్వానించాడు. పరిపాలనా సంస్కరణలు త్వరితగతిన సమర్థవంతంగా అమలు జరగాలంటే సమర్థులైన, ఆంగ్లం తెలిసిన, పరిపాలనలో అనుభవం కలిగినవారు ఉండాలని భావించి బ్రిటిష్ ఇండియాలో అధికారులుగా పనిచేసిన వారిని హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడం ప్రారంభించాడు. ఇలా వలసలు ప్రారంభమయ్యాయి. బయటి నుంచి వచ్చిన ఉద్యోగులు స్థానిక ఉద్యోగులకు తగిన శిక్షణ ఇచ్చి, వారికి బాధ్యతలు అప్పగించి తిరిగి వెళ్తారని సాలార్జంగ్ అనుకున్నాడు. ఈ కాలంలోనే ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బిల్గ్రామి వంశానికి చెందిన అనేక మంది వలస వచ్చి ఉద్యోగాలు ఆక్రమించారు. బెంగాల్, మద్రాస్ నుంచి ఆంగ్లం వచ్చిన వారు హైదరాబాద్‌కు వలస వచ్చారు. దీంతో ఉద్యోగులందరు ముల్కీ, నాన్ ముల్కీలుగా నిట్టనిలువుగా చీలిపోయారు.
హైదరాబాద్ సివిల్ లిస్ట్
ఆరో నిజాం కాలంలో 1880లో అధికార భాషగా పార్శి స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టారు. ఉర్దూ, ఆంగ్లంలో ఏకకాలంలో సమానమైన ప్రావీణ్యం లేక ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాతినిధ్యం తగ్గింది. 1883లో రెండో సాలర్జంగ్ బ్రిటిష్ వారి మద్దతుతో హైదరాబాద్ ప్రధాని అయ్యాడు. ఇతడు గైర్ముల్కీల పక్షం వహించాడు. ముల్కీల ఫిర్యాదుతో స్పందించిన మహబూబ్ అలీఖాన్ ఉద్యోగుల స్థానికత, హోదా, విధులు వివరాలు సమర్పించాలని ఆదేశించాడు. దీంతో మొదటి హైదరాబాద్ సివిల్ లిస్ట్–1886 రూపొందించబడింది. దీని ప్రకారం ముల్కీ ఉద్యోగాలు 52శాతం ఉండగా, వారి జీతభత్యాలపై 42 శాతం ఖర్చు చేస్తున్నారు. నాన్ ముల్కీ ఉద్యోగులు 48శాతం ఉండగా, వారి జీతభత్యాలపై 58శాతం ఖర్చు చేస్తున్నారని తేలింది.
1888- గెజిట్
ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యోగాలపై నివేదిక అందిన తర్వాత మహబూబ్ అలీఖాన్ 1888లో గెజిట్‌ను జారీ చేశాడు. దీని ప్రకారం ‘నిజాం రాజ్యంలోని ఉద్యోగాలన్నీ అర్హతల మేరకు విదేశీయుల జోక్యం లేకుండా దేశీయులకే ఇవ్వాలని నిర్ణయించాం. నాన్‌ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే ప్రధాన మంత్రి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఈ గెజిట్ ప్రకారం స్థానికుడిగా గుర్తింపు పొందడానికి 12 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉండాలి లేదా 15 సంవత్సరాలు స్థిర నివాసం కలిగి ఉండాలి. ’ 1888 గెజిట్ తర్వాత కూడా నాన్‌ముల్కీల నియామకం హైదరాబాద్‌లో పెరుగుతూనే వచ్చింది.
హైదరాబాద్ సంస్థానంలో ఉన్నత ఉద్యోగాల నియామకంలో బ్రిటిష్‌వారి జోక్యం ఎక్కువగా ఉండేది. 1901లో బ్రిటిష్‌వారి ఒత్తిడి వల్ల మీర్ మహబూబ్ అలీఖాన్ ఆర్థిక కార్యదర్శిగా కాసన్ వాకర్‌ను నియమించాడు. ఇతను హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగాల్లో నాన్ ముల్కీలను పెద్ద ఎత్తున విచక్షణారహితంగా నియమించాడు. 1901లో ముల్కీ అయిన మహరాజా కిషన్ ప్రసాద్(కిషన్ పెర్షాద్) హైదరాబాద్ దివాన్ అయ్యాడు. ఇతను స్థానికులకు/ ముల్కీలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. కానీ బ్రిటిష్‌వారి మద్దతుతో కాసన్ వాకర్ నాన్‌ముల్కీలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించేవాడు. 1911లో మహబూబ్ అలీఖాన్ మరణానంతరం మీర ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ పాలకుడయ్యాడు. ఇతను 1912లో కాసన్ వాకర్‌ను ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించాడు.