తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక

స్వయంకృషితో చరిత్ర పుటల్లో  తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన రాజకీయ నాయకుడిగానే కాదు, రాజనీతిజ్ఞుడిగా విశేష కీర్తి పొందిన బాపూజీ జీవిత చరిత్రను ఆవిష్కరించడం అంత సులువైన విషయమేమికాదు. ఆయన పుట్టి బుద్ధెరిగిన నాటి నుంచి ఉద్యమాలే జీవితంగా బతికారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకోవడమే కాకుండా తెలంగాణ వచ్చేవరకు ఏ ఒక్క పదవిని తీసుకోనని చెప్పి ఆచరించి చూపారు. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన తరగతుల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్ర్యోద్యమం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు చేసిన బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచిన కొండా లక్ష్మణ్​ బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్యమ రూపంలో ముందుకు వచ్చిన అన్ని సందర్భాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును ప్రతిఘటించిన ఉద్యమంలో, 1960 దశాబ్దాల చివరి నాళ్లలో పెద్ద ఎత్తున తలెత్తిన ఉద్యమంలో, 1995లో ముందుకు వచ్చిన రెండో దశ తెలంగాణ ఉద్యమంలో, చివరి దశ పోరాటంలో బాపూజీ పెద్ద దిక్కుగా నిలిచారు. 

బలహీన వర్గాల పక్షాన నిలిచి..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి తెలంగాణ ఇండియాలో కలిసిన తర్వాత కొండా లక్ష్మణ్ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి 1952లో ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో 23 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా సేవలు అందించడమే కాకుండా దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా సొంత పార్టీని సైతం ఎదిరించి బహుజన, శ్రామిక వర్గాల పక్షాన నిలబడ్డారు. 1969లో మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి అండగా నిలిచారు. బీపీ మండల్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షపై అమితంగా ఆలోచించే బాపూజీ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు తన ఇల్లునే పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించి సహృదయ సౌజన్య శీలిగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సమష్టి నాయకత్వం మాత్రమే ఆశయసిద్ధికి దోహదం చేస్తుందని ఎలుగెత్తి చాటిన బాపూజీ విద్యార్థి, యువజనులను చైతన్యం చేసి తన 96 ఏండ్ల వయసులో సైతం తెలంగాణ కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి తెలంగాణ ఉద్యమంలో సామాజికతను జోడించారు.

 విశిష్ట గౌరవం

బాపూజీ ఎన్నో గౌరవాలు పొందారు. ‘ఆచార్య’ అనే బిరుదు తన సేవల నుంచే వచ్చింది. ‘సహకార రత్న’ గా పేరుగాంచారు. 2005 ఆగస్టు 9 న భారత రాష్ట్రపతి ‘ఎమినెంట్ ఫ్రీడం ఫైటర్’ అవార్డు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని మారుమూల గ్రామం వాంకిడిలో కొండా పోశెట్టి, అమ్మక్కలకు 1915 సెప్టెంబర్ 27 న జన్మించిన బాపూజీ 97 ఏండ్లు జీవించి 2012, సెప్టెంబర్ 21న తుదిశ్వాస విడిచారు. పీడిత ప్రజల విముక్తి కోసం బహుముఖ పోరాటం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరం యువతకు ఆదర్శం. సామాజిక పోరాటాల ఉధృతి గమనించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతులను అధికారికంగా జరపాలని నిర్ణయించడం సంతోషకరం. 75 ఏండ్ల తెలంగాణ ఉత్సవాల సందర్భంగా కొండా లక్షణ్​ బాపూజీని ఏ పార్టీ పట్టించుకోకపోవడం బాధాకరమే గాక సబ్బండ బహుజన వర్గాలకు, తెలంగాణ సమరయోధులకు అవమానకరం. మొక్కుబడిగా జయంతి కార్యక్రమాలు జరుపుడు కాదు. పాలకులు చిత్తశుద్ధితో మహనీయులు కలలు గన్న తెలంగాణ కోసం కృషి చేయాలి. లేదంటే సబ్బండ వర్గాలు విముక్తి చెందే సంపూర్ణ తెలంగాణ కోసం ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవుతారు. ఆనాడు నిజాంను పాలనను దించిన కొండా స్ఫూర్తితో నేటి నిరంకుశ  దొర పాలనకు చరమగీతం పాడుతారు. 

సాయిని నరేందర్,
సోషల్​ ఎనలిస్ట్