స్వర మాధురి లతా మంగేష్కర్

స్వర మాధురి లతా మంగేష్కర్

ఆమె గొంతు విప్పితే ఆ స్వర మాధుర్యానికి కోకిలకు సైతం కన్ను కుట్టేది. అందుకే ప్రపంచమంతా ఆమెని గాన కోకిల అంటూ ప్రేమగా పిలుచుకుంది. బాలీవుడ్ సినీ సంగీతానికి ఆమె కేరాఫ్ అయ్యింది. ఆమె పాటకి ప్రతి శ్రోత హృదయం దాసోహమైపోయింది. సినిమా పాటని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆ గాయని మరెవరో కాదు.. లతా మంగేష్కర్. నేడు ఆమె జయంతి. ఈ సందర్భంగా ఆమెకు వీ6 వెలుగు అక్షర నివాళి.

1929, సెప్టెంబర్‌ 28న పుట్టారు లత. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ క్లాసికల్ సింగర్. థియేటర్ యాక్టర్ కూడా. తల్లి షెవంతి. వారికి మొదటి సంతానం లత. ఆ తర్వాత మీనా, ఆశ, ఉష, హృదయనాథ్ పుట్టారు. లత అసలు పేరు హేమ. ఆమె పుట్టిన కొన్నాళ్లకు ‘భవ్‌ బంధన్’ అనే నాటకంలో దీనానాథ్ నటించారు. అది పెద్ద హిట్టయ్యింది. దాంతో ఆ నాటకంలోని లతిక అనే పాత్రకి గుర్తుగా హేమ పేరును లతగా మార్చారు. లత కుటుంబం ఇండోర్‌లో ఉండేది. నాన్నతో కలిసి ఐదేళ్ల వయసులోనే నటించడం, పాడటం మొదలుపెట్టారామె. అయితే పదమూడేళ్లు ఉన్నప్పుడు తండ్రి చనిపోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. అప్పుడు దీనానాథ్ స్నేహితుడు, నవయుగ్ చిత్రపట్ మూవీ కంపెనీ యజమాని అయిన వినాయక్ దామోదర్ వారికి సాయపడటానికి ముందుకొచ్చారు. నటిగా, సింగర్‌గా లత కెరీర్‌ని మలిచేందుకు నడుం కట్టారు.

మజ్‌బూర్ సినిమాతో పాపులర్

మరాఠీ సినిమా కిటీ హసల్‌లో మొదటిసారి పాడారు లత. కానీ తన వాయిస్‌ బాలేదని ఎడిటింగ్‌లో తీసేశారు. తర్వాత వినాయక్ కంపెనీ తీసిన ‘పహేలీ మంగళ్‌ గౌర్‌‌’ సినిమాలో చిన్న పాత్రలో నటించారు. అందులోనూ ఓ పాట పాడారు. తర్వాత ఉస్తాద్ అమన్ అలీ ఖాన్ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. అయితే వినాయక్ చనిపోవడంతో గులామ్ హైదర్‌‌ దగ్గర శిష్యరికం చేశారు. ఆయన తనని నిర్మాత శశాధర్‌‌ ముఖర్జీకి పరిచయం చేశారు. ఆయన ‘మజ్‌బూర్’ సినిమాలో ఓ పాట పాడే ఛాన్స్ ఇచ్చారు. అది హిట్ కావడంతో అందరి దృష్టి లతపై పడింది. 

అవరోధాలను అధిగమించి

కెరీర్ ప్రారంభంలో లతకు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. గొంతు పీలగా ఉందన్నారు. అప్పటి ఫేమస్ సింగర్ నూర్జహాన్‌ని ఇమిటేట్ చేస్తోందన్నారు. దాంతో లత కాస్త డిస్టర్బ్ అయ్యారు. బాగా ప్రాక్టీస్ చేసి తనకంటూ ఓ శైలిని అలవర్చుకున్నారు. హిందీ, ఉర్దూ పాటల్ని కూడా మరాఠీ యాసతో పాడుతోందని దిలీప్ కుమార్ కామెంట్ చేయడంతో పట్టుబట్టి ఉర్దూ నేర్చుకున్నారు. ఇలా ఎదురైన ప్రతి అవమానాన్నీ ఎదిరించారు. ప్రతి అవరోధాన్నీ అధిగమించి మోస్ట్ వాంటెడ్ సింగర్ అయ్యారు. 

36 భాషల్లో పాటలు

లత కెరీర్‌‌లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ కొన్ని కోట్ల మందికి ఫేవరేట్ సాంగ్స్గా ఉన్నాయి. తేరే బినా జిందగీసే కోయీ, అజీబ్‌ దాస్తా హై యే, ఆయేగా ఆయేగా, న కోయీ ఉమంగ్‌ హై, రుకే రుకేసే కదమ్, ఆజ్‌ ఫిర్ జీనేకీ తమన్నా హై, తేరే లియే హమ్ హై జియే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె పాటల లిస్టు వేయడానికి చోటు చాలదు. మొత్తం 36 భాషల్లో కొన్ని వేల పాటలు పాడారు లత. తెలుగులో ‘సంతానం’ మూవీలో ‘నిదురపోరా తమ్ముడా’ అనే పాట పాడారు. ఆ తర్వాత ‘దొరికితే దొంగలు’ సినిమా కోసం ఒక భక్తి పాట పాడారు. మళ్లీ చాలా ఏళ్లకు నాగార్జున, శ్రీదేవి నటించిన ‘ఆఖరిపోరాటం’లో ‘తెల్లచీరకు తకథిమి తపనలు’ అనే పాట పాడారు.

హృదయాలకు హత్తుకునేలా

దేశభక్తి గీతాలు ఎంతోమంది పాడినా.. లత పాడిన ‘యే మేరే వతన్‌కే లోగో’ పాటను మించింది లేదు. 1963లో రిపబ్లిక్ డేకి న్యూ ఢిల్లీలోని నేషనల్ స్టేడియంల ఈ పాట పాడారు. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రధాని జవహర్‌‌లాల్ నెహ్రూ అక్కడే ఉన్నారు. సైనికుల త్యాగాల గురించి రాసిన ఆ పాటను లత హృదయాలకు హత్తుకునేలా పాడటంతో నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ ప్రతి రిపబ్లిక్‌ డేకీ ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది.

మారు పేరుతో సంగీతం

రామ్ రామ్ పవ్హానా, మరాఠా తితుకా మేల్‌వావా, మోహిత్వాంచి మంజుల, సాధి మానసే, తాంబడీ మాతీ మరాఠీ చిత్రాలకు ఆనందఘన్ అనే మారుపేరుతో సంగీతం సమకూర్చారు లత. వాదల్, జహంగీర్, కాంచన్ గంగా, లేకిన్ సినిమాలను నిర్మించారు. ‘లేకిన్’ చిత్రాన్ని తన తమ్ముడు హృదయనాథ్‌తో కలిసి ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీకి ఐదు జాతీయ అవార్డులు దక్కాయి.  దేశంలోని అత్యుత్తమ పురస్కారాలన్నింటినీ అందుకున్నారు లత. ఆరుసార్లు ఫిల్మ్ ఫేర్, మూడుసార్లు నేషనల్ అవార్డ్ ఆమెను వరించాయి. 17సార్లు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డ్, ఐదుసార్లు మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డ్ తీసుకున్నారు. 8 యూనివర్శిటీలు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారతరత్న పురస్కారాలతో ప్రభుత్వం ఆమెను గౌరవించింది. స్వాతంత్ర్యం వచ్చి అరవయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండియన్ గవర్నమెంట్ లతకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వమైతే ‘ద లీజియన్ ఆఫ్ హానర్’ పురస్కారంతో సత్కరించింది. ఇవి కాక 250 ట్రోఫీలు, 150 గోల్డ్ డిస్కులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో పాట పాడిన ఫస్ట్ ఇండియన్ సింగర్ లత.

ఆశ్లీల, అసభ్య పాటలకు దూరం

వ్యక్తిగా కూడా లత ఎంతో ప్రత్యేకం. విలువలకు కట్టుబడి ఉండేవారు. అశ్లీలంగా, అసభ్యంగా ఉండే పాటలు పాడేవారు కాదు. ‘సంగమ్’ సినిమాలోని ‘మై క్యా కరూ రామ్’ పాట విషయంలో రాజ్‌కపూర్‌‌తో చాలా గొడవ పడ్డారామె. అది డబుల్ మీనింగ్ సాంగ్ అని, పాడనని తెగేసి చెప్పారు. అది కేవలం ఓ టీజింగ్ సాంగ్ అని, అశ్లీలత లేదని రాజ్‌కపూర్ బతిమాలడంతో సరే అన్నారు. ఆ పాట చాలా పెద్ద హిట్టయ్యింది. అయినా కూడా తన లైఫ్‌లో ఒక్కసారి కూడా ఆ పాటని చూడలేదు లత. ఐటమ్ సాంగ్స్, క్యాబరే సాంగ్స్ కూడా పాడనని చెప్పేసేవారామె. ఎంత డబ్బు ఆఫర్ చేసినా నో అంటూ ఉండటంతో ఇక ఆవిడకి అలాంటి పాటలు ఆఫర్ చేయడమే మానేశారంతా.  రాజకీయాల్లో కూడా ఇంతే నిక్కచ్చిగా ఉండేవారు లత. రాజ్యసభ ఎంపీగా ఉన్నా కూడా ఒక్క రూపాయి జీతం తీసుకోలేదు.

ముక్కుసూటి మనిషి

లత చాలా సూటిగా మాట్లాడేవారు. నచ్చనిది ఎవరు చెప్పినా చేసేవారు కాదు. తనకి ఫస్ట్ టైమ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చినప్పుడు తీసుకోనని తెగేసి చెప్పేశారు. ఓ ఇండియన్ లేడీని అయ్యుండి బట్టలు లేకుండా ఉన్న మహిళ బొమ్మని ట్రోఫీలా ఇస్తే ఎలా తీసుకుంటానని ప్రశ్నించారు. దాంతో నిర్వాహకులు ఆ ట్రోఫీకి ఖర్చీఫ్ చుట్టి ఇచ్చారు. ఇక కెరీర్ ప్రారంభంలోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌.డి.బర్మన్‌తో విభేదాలొచ్చాయి. టాప్ డైరెక్టర్ అని తెలిసి కూడా ఆయనతో పని చేయనని చెప్పేశారు. 8ఏండ్ల పాటు ఆయన పాట పాడలేదామె. మహ్మద్ రఫీతోనూ గొడవలు రావడంతో కొన్నేళ్ల పాటు ఆయనతో కలిసి పాటలు పాడలేదు. ఆయనతో సమానంగా తనకి రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వడం లేదంటూ లత అడగడం వల్ల రఫీకి, ఆవిడకి మధ్య గొడవ వచ్చిందని చెబుతుంటారు. 

ఒంటరిగా మిగిలిపోయిన లత

లత పెళ్లి చేసుకోలేదు. ఇంటికి పెద్ద కూతురిగా తండ్రి లేని కుటుంబ భారాన్ని మోయడం వల్ల ఒంటరిగా మిగిలిపోయానని ఆమె చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే తన తమ్ముడి స్నేహితుడు, క్రికెటర్ రాజ్‌సింగ్‌ వల్లే ఆమె పెళ్లి చేసుకోలేదని చాలామంది చెబుతుంటారు. రాజ్‌ చాలా రిచ్. రాజ కుటుంబానికి చెందినవాడు. లత ఓ మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో అతని పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదట. వాళ్లని కాదనలేక ఆయన లతకి దూరమైపోయాడని అంటుంటారు. తమ ప్రేమను మర్చిపోలేక అటు రాజ్, ఇటు లత ఒంటరిగా మిగిలిపోయారు. 2009లో ఆయన అల్జీమర్స్తో కన్నుమూశారు.

లతపై విష ప్రయోగం

లత అంటే పడనివాళ్లు చాలామంది ఉండేవారు. ఓసారి ఆమెపై ఎవరో విష ప్రయోగం కూడా చేశారు. మూడు రోజుల పాటు బెడ్ రిడెన్ అయిపోయారు. తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో విలవిల్లాడారు. కాలు కూడా కదపలేని స్థితికి చేరుకున్నారు. మళ్లీ బతుకుతానని, పాటలు పాడతానని అనుకోలేదామె. ఎలాగో ఆ స్థితి నుంచి బైటపడి మళ్లీ నార్మల్ అయ్యారు. కానీ తనకి స్లో పాయిజన్ ఇచ్చినవాళ్లెవరో మాత్రం కనిపెట్టలేకపోయారు. మొత్తానికి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు. సమస్యలు ఎదురైనా తెలివిగా చక్కదిద్దుకున్నారు. పాటే ప్రాణంగా బతికిన 2022 ఫిబ్రవరి 6న కన్నుమూశారు. పాటతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించిన లత ఈ లోకాన్ని వీడిపోయినా.. ఆమె పాట మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ఇప్పటికీ అందరినీ అలరిస్తూనే ఉంది. ఎప్పటికీ లతను సంగీత ప్రియుల గుండెల్లో నిలిపే ఉంచుతుంది.