ముస్లిం సంస్కరణోద్యమాలు.. ప్రత్యేక కథనం

భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో మహమ్మదీయుల్లో సంస్కరణల కోసం కొంత మంది నాయకులు కృషి చేశారు. ఇందులో తొలి ఇస్లాం సంస్కరణ ఉద్యమంగా వహాబి లేదా వలీఉల్లా ఉద్యమం మొదలైంది. ఇది భారతదేశంలో ముస్లిం అధికారాన్ని పున: స్థాపించడం లక్ష్యంగా కొనసాగింది. పాశ్చాత్య విద్యకు వ్యతిరేకంగా దియోబందీ ఉద్యమం జరిగింది.

ఈ ఉద్యమ నాయకులు జాతీయోద్యమంలో కాంగ్రెస్​కు సహకరించి ప్రత్యేక పాకిస్తాన్​ డిమాండ్​ను వ్యతిరేకించారు. అలీఘర్​ ఉద్యమ స్థాపకుడు సర్​సయ్యద్​ అహ్మద్​ ఖాన్. ముస్లింల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం, రాజకీయ చైతన్యం పెంపొందించడం, ఆధునిక విద్యను ప్రచారం చేయడం ఈ ఉద్యమ లక్ష్యాలు.

వహాబి లేదా వలీఉల్లా ఉద్యమం

పాశ్చాత్య భావాల ఫలితంగా ముస్లింల్లో కలిగిన తొలి స్పందనే వహాబి ఉద్యమంగా ఆవిర్భవించింది. ఈ ఉద్యమం తొలి ఇస్లాం సంస్కరణోద్యమంగా మొదలైంది. ఆ తర్వాత సిక్కులపై పవిత్ర యుద్ధంగా, బ్రిటీష్​ వారిని బెంగాల్​ నుంచి తరిమివేసే యుద్ధంగా మారింది. సౌదీ అరేబియాకు చెందిన అబ్దుల్ వహాద్, ఢిల్లీకి చెందిన షావలీఉల్లా చేత ప్రభావితమైన రాయ్​బరేలీకి చెందిన సయ్యద్​ అహ్మద్​ బెరిల్వీ వహాబి ఉద్యమం ప్రారంభించాడు.

ఈయన ఇమామ్​గా కొనసాగాడు. ఈయన లక్ష్యం పంజాబ్​ నుంచి సిక్కులను, బెంగాల్​ ప్రాంతంలోని సీతన నుంచి బ్రిటీష్​ వారిని తరిమివేసి భారతదేశంలో పవిత్ర యుద్ధం ద్వారా ముస్లిం అధికారాన్ని పున:స్థాపించడం.అరబ్బు మత సంస్కర్త అబ్దుల్​ వహాబి అనుచరులనే వహాబిలు అంటారు. వహాబి ఉద్యమం మొదట ఉత్తర భారతదేశంలో ప్రారంభమై క్రమక్రమంగా హైదరాబాద్, మద్రాస్, బెంగాల్, పంజాబ్, బాంబే, ఉత్తరప్రదేశ్​ ప్రాంతాలకు వ్యాప్తి చెందింది.

హైదరాబాద్​ సంస్థానంలో వహాబి ఉద్యమాన్ని ముబారిజ్​ ఉద్దౌలా స్థాపించారు. భారత్​లో పాట్నా ముఖ్య కేంద్రంగా ఉండేది. ఈ ఉద్యమంలో భాగంగా దారుల్​ హర్బ్ గా పిలిచిన ఇండియాను దారుల్​ ఇస్లాంగా మార్చాలన్నారు. ఈ ఉద్యమాన్ని బ్రిటీష్​ ప్రభుత్వం నాయకులకు ప్రవాస జీవితాన్ని విధించడం ద్వారా అణచివేసింది. 

దియోబందు ఉద్యమం

1866లో యునైటెడ్​ ప్రావిన్స్ లోని షహరన్​పూర్​ జిల్లాలో దియోబంద్​ అనే ప్రాంతం వద్ద మౌలానా హుస్సేన్​ అహ్మద్, మహ్మద్​ ఖాసీం, రషీద్​ అహ్మద్​ గంగోహి కలిసి దారుల్​ ఉలూమ్​ అనే విద్యా సంస్థ(మదర్సా)ను స్థాపించి పాశ్చాత్య విద్యకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమ నాయకులు జాతీయోద్యమంలో కాంగ్రెస్​కు సహకరించి ప్రత్యేక పాకిస్తాన్​ డిమాండ్​ను వ్యతిరేకించారు. సర్​ సయ్యద్​ ఖాన్​ స్థాపించిన సంస్థలకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. మౌలానా అబుల్​ కలాం ఆజాద్ ఈ ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడే. ముస్లింల్లో ఖురాన్, హడీస్​ బోధనలను ప్రచారం చేయడం, హిందూ ముస్లింల ఐక్యత, విదేశీ పాలకులకు వ్యతిరేకంగా జిహాద్​ చేపట్టడం దియోబందు ఉద్యమ లక్ష్యాలు. 

సిల్క్​ లేఖల ఉద్యమం: ఈ ఉద్యమం దియోబందునాయకులు చేపట్టారు. ఇది 1913 నుంచి 1920 వరకు బ్రిటీష్​ పాలనా రహిత భారత్​ ఏర్పడాలని, ఇందుకోసం టర్కీ, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్​ల సహాయం తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభమైంది. ఈ ఉద్యమ నాయకుడు ఒబూదుల్లా సింధి. ఈ ఉద్యమ పేరుకు ప్రధాన కారణం సిల్క్​ దుస్తులపై లేఖలు రాయడం. 

అహ్రర్ ఉద్యమం

ఈ ఉద్యమం దియోబందు ఉద్యమంలో భాగంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ప్రముఖ నాయకులు మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ పనిచేశాడు. ఇతర నాయకులు హకీం అజ్మల్​ ఖాన్, హసన్ ఇమామ్, మజర్​ ఉల్​ హక్. ముస్లిం లీగ్, పంజాబ్​ హిందూ సభకు వ్యతిరేకంగా నిరసన తెలుపడం, అలీఘర్​ ఉద్యమంలో భాగమైన వారి వైఖరిని వ్యతిరేకించడం ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశాలు. 

అహ్మదీయ ఉద్యమం

అహ్మదీయ అనేది ఇస్లాంలో ఒక శాఖ. ఈ ఉద్యమాన్ని 1889లో మీర్జాగులాం అహ్మద్​ పంజాబ్​లోని కదియానలో ప్రారంభించాడు. దీనినే కదియానీ ఉద్యమం అని కూడా అంటారు. క్రైస్తవ మిషనరీలకు, ఆర్య సమాజానికి వ్యతిరేకంగా ఇస్లాం మతాన్ని రక్షించడం, ఇస్లాం మతాన్ని సంస్కరించడం ఈ ఉద్యమ లక్ష్యాలుగా ఉండేవి. ఈ ఉద్యమ ఫలితంగా ముస్లింల కోసం అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారు. ఇది ఉదారవాద సూత్రాల ఆధారంగా నడిచింది. 

అలీఘర్​ ఉద్యమం

ఈ ఉద్యమ స్థాపకుడు సర్​ సయ్యద్​ అహ్మద్​ ఖాన్. ముస్లింల సాంస్కృతిక పునరుజ్జీవనం, ముస్లింల్లో రాజకీయ చైతన్యం పెంపొందించడం, ఆధునిక విద్యను ప్రచారం చేయడం ఉద్యమ లక్ష్యాలు. అలీఘర్​ ఉద్యమం ముస్లింల్లో మొదటిసారిగా చైతన్యాన్ని రేకిత్తించింది. ఉద్యమ ప్రభావం వల్ల భారత్​లో ముస్లింలకు ఉర్దూ జాతీయ భాష అయింది. 

ఫరైజ్ ఉద్యమం 

ఈ ఉద్యమాన్ని 1818లో హాజీ షరియతుల్లా ప్రారంభించాడు. ఇతను తూర్పుబెంగాల్​కు చెందిన షమైల్​ ప్రాంతవాసి. ఇతని గురువు మౌలానా మురాద్. ఇతను భారతదేశాన్ని ఎ ల్యాండ్​ ఆఫ్​ దర్​ ఉల్​ హర్బ్​గా అభివర్ణించాడు. ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం మతపరమైన సంస్కరణ. ఇస్లాంలోని పంచసూత్రాలను పాటించాలని ప్రయత్నించింది.

షరియతుల్లా మరణం తర్వాత ఈ ఉద్యమానికి తన కుమారుడైన మహమ్మద్​ ముషిన్​ లేదా దాదూమియాన్​లు నాయకత్వం వహించారు. ఈ ఉద్యమ కేంద్రాలుగా హదూర్​పూర్, బారసత్​లు కొనసాగాయి. దాదూమియాన్​ 1847లో అరెస్టు కావడంతో ఉద్యమం బలహీనపడింది. 

మహమ్మదన్​ లిటరసీ పాలసీ

ఈ ఉద్యమం కలకత్తా కేంద్రంగా నవాబ్​ అబ్దుల్ లతీఫ్​ స్థాపించాడు. దీనికి లతీఫ్​ కార్యదర్శిగా, మహమూద్​ రహీముద్దీన్​ అధ్యక్షుడిగా ఉండేవారు. ఈ సంస్థ ముస్లిం పిల్లల విద్యపై ముఖ్యంగా ఇంగ్లీష్​ విద్య(పాశ్చాత్య)పై దృష్టి పెట్టడంతోపాటు యువకులు నవీన ఆలోచనలు కలిగి హిందూ బ్రిటీష్​ యువకులతో పోటీపడాలని కృషి చేసింది. అలాగే, ముస్లిం సమాజంలో సంస్కరణల కోసం పాటుపడింది.   

సర్​ సయ్యద్​ అహ్మద్​ ఖాన్​

టీచర్ గా, రాజకీయ నాయకుడిగా, ముస్లింల సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమ సారథిగా సర్​ సయ్యద్​ అహ్మద్​ ఖాన్​ పేరుగాంచాడు. ఇతనిని ఫాదర్​ ఆఫ్​ టూ నేషన్​ థియరీ అంటారు. ముస్లిం ప్రజల్లో అభివృద్ధి సాధించడానికి అలీఘర్​ ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. 1857 తిరుగుబాటుకు బ్రిటీష్​ వారు అవలంబించిన విధానాలే కారణమని ఇతని గ్రంథాలైన ది కాజ్​ ఆఫ్​ ఇండియన్​ మ్యుట్నిలో విమర్శించాడు. దాదాబాయి నౌరోజి సంపద తరలింపు సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు.

1864లో అలీఘర్​లో సైంటిఫిక్​ సొసైటీని స్థాపించారు. కాంగ్రెస్​ పార్టీని ప్రాక్టీస్ లేని న్యాయవాదుల క్లబ్​గా పేర్కొన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటును వ్యతిరేకించాడు. కాంగ్రెస్ పార్టీలో చేరవద్దు అని 1886లో మొహమ్మదన్ ఎడ్యుకేషనల్​ కాన్ఫరెన్స్​ను ఏర్పాటు చేసి విద్య, ఆర్థిక ప్రగతికి తోడ్పడ్డాడు.

1870లో తహజిబ్​ ఉల్​అఖ్​లఖ్​(మహ్మదీయ సంఘ సంస్కరణ) అనే పత్రికను అలీఘర్​లో స్థాపించాడు. ఇతని రచన లాయల్​ మహమ్మదీయన్స్ ఆఫ్​ ఇండియా బ్రిటీష్ వారికి మద్దతుగా రాశారు. బెనారస్ రాజా శివరామ్​ ప్రసాద్​తో కలిసి 1888లో బ్రిటీష్​ పరిపాలనకు విశ్వాసం ప్రకటించే సంస్థ అయిన యునైటెడ్​ ఇండియన్ పేట్రాటిక్​ అసోసియేషన్​ను స్థాపించాడు. దీని ద్వారా కూడా ముస్లింలను కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని కోరాడు.