మన రాజ్యాంగం అందించిన ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే, యువత విద్యావంతులు అయినప్పుడు మాత్రమే ఈ దేశం ‘‘విశ్వగురు’’గా కీర్తి ప్రతిష్టలు పొందుతుంది. భగత్ సింగ్, రాజ్ గురు, చంద్రశేఖర్ ఆజాద్, రుద్రమాదేవి, ఝూన్సీ లక్ష్మీ బాయి, బుద్ధుడు, శంకరాచార్య, స్వామి వివేకానంద వంటి వారు యువకులుగా ఉన్నప్పుడే ప్రపంచంలో ఒక సుస్థిర స్థానం పొందారు. అదే స్ఫూర్తితో నేటి యువత పయనించాలి. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆకాంక్షించిన విధంగా ‘‘కలలు కనండి.. వాటి సాకారానికి ప్రయత్నం చేయండి’’ అనే మాటలు యువత ఆచరించాలి. భారత చోదక శక్తి యువతే. ప్రభుత్వాల ‘‘విపరీతమైన ఉచితాలకు’’ స్వస్తి పలికి, మెరుగైన విద్యనభ్యసిస్తూ ఉపాధి అవకాశాలు పొందాలి. దేశ సమగ్రాభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడమే ‘జాతీయ యువజన దినోత్సవం’ పరమార్థం.
మేల్కోండి.. లక్ష్యం చేరేదాకా ఆగకండి అంటూ.. యువ శక్తిని తట్టి లేపి, భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన సనాతన ధర్మ యువ కిరణం స్వామి వివేకానంద. బెంగాలీ కుటుంబంలో 1863 జనవరి12న స్వామి వివేకానంద జన్మించాడు. అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్లుగా చిన్నప్పటి నుంచే అతనికి నిస్వార్థం, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఏకసంతాగ్రహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ పెరుగుతోంది. చరిత్ర, సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్నీ చదివాడు. చదువులో ముందుకెళ్తున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువయ్యాయి. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస ఆయన సందేహాలను నివృత్తి చేయడంతోపాటు దైవత్వం గురించి విడమరిచి చెప్పడంతో ఆయన శిష్యుడిగా చేరాడు. ఆయన నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబ పరిస్థితి దారుణంగా మారింది. ఆతర్వాత కొంత కాలానికే రామకృష్ణ పరమహంస మరణించారు. తర్వాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉండేవారు. వాళ్లకి నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు. కొంతకాలం తర్వాత వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నారు. దేశమంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. వివిధ మతాలను వాటి తత్వాలను అర్థం చేసుకున్నారు. దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకొని అక్కడ ఒక చిన్న కొండ లాంటి ప్రదేశానికి వెళ్లి మూడు రోజుల పాటు ధ్యానం చేశారు. ఆ ధ్యానం తర్వాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొలపాలని నిర్ణయించుకున్నారు. చికాగోలో జరిగిన సర్వమత మహాసభలకు వెళ్లి.. భారత దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. వివేకానంద ప్రసంగం విని పాశ్చాత్యులు కేరింతలు కొట్టారు. ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులోనే ఆయన మరణించాడు. కేంద్రం ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’ గా ప్రకటించింది.
యువ శక్తిని వాడుకోవాలి
వివేకానందుని స్ఫూర్తితో యువత తమ మెదళ్లకు పదును పెట్టాలి. ప్రభుత్వాలు యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఆకాంక్షల కోసం స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్య్రం తెచ్చారో.. వాటి సాధనకు యువత నడుం బిగించాలి. దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలి. అప్పుడు మాత్రమే ప్రపంచ యవనికపై భారత జెండా సగౌరవంగా రెపరెపలాడుతుంది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, పాలకులు వారి అనుకూల వర్గాలకు ఇచ్చే రాయితీలు, కార్పొరేట్ ప్రపంచానికి అనుకూలంగా చేసే చట్టాలపై యువత ఉద్యమించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ ఆశయాలు ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద భావాలు సాధన కోసం పాటుపడాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువత ఒత్తిడి పెంచాలి. తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువు ‘కొని’ ఇస్తున్నారు. మార్కులు, గ్రేడులే లక్ష్యంగా, డబ్బు సంపాదనే ధ్యేయంగా వారికి విద్యనందిస్తున్నారు. అలా కాకుండా విలువలు, మానవ సంబంధాలు కలిగిన వారిగా వారిని పెంచాలి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఓల్డ్ ఏజ్ హోంలు కనుమరుగవుతాయి. “జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని.. ఆ ఆలోచన మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి’’ అన్న వివేకానంద మాటలు పేరెంట్స్, పిల్లలకు వివరించాలి. అయితే కొంత మంది యువకులు ఇటీవల కాలంలో మద్యానికి, మత్తులకు బానిసలై, బలహీనంగా మారడం అటు తల్లిదండ్రులకు, ఇటు ప్రభుత్వానికి, దేశానికి తీవ్రమైన సమస్యగా మారుతున్నారు. ఇది ఇంకా తీవ్రం కావొద్దంటే తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై శ్రద్ధ వహించాలి.
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి..
ప్రపంచంలో చాలా మతాలకు పుట్టినిల్లు భారతదేశం. అందుకే లౌకిక వాదానికి తొలి ప్రయోగశాల భారత్ అని వివేకానంద వివరించాడు. ఆయన మాటలు ప్రస్తుత పరిస్థితుల్లో శిరోధార్యం. మనం ఇతరుల సహాయం కోసం ఎంత ఎక్కువగా ముందుకు వస్తామో, ఎంత ఎక్కువగా సాయం చేస్తామో, మన హృదయం కూడా అంతే ఎక్కువగా స్వచ్ఛమవుతుందనే వివేకానంద మాటలు యదార్థాలు. ఈ కరోనా కాలంలో ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు, ప్రజా సంఘాల వారు, కరోనా కాలంలో ఆపదలో ఉన్నవారికి ఎన్నో రకాల సేవలు, ‘‘ఐసొలేషన్ కేంద్రాలు’’ ఏర్పాటు చేసి వివిధ రకాల సేవలు అందించారు. కష్టకాలంలో యువత ముందుండాలి. ఇప్పటికే కొందరు ఆదర్శంగా ఉంటున్నారు. యువకులు మంచి నడవడిక, కుటుంబం, మానవతా, నైతిక విలువలు పెంపొందించుకోవడంతోపాటు ఆర్థికాభివృద్ధిలో స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలి. ప్రపంచంలోనే అతి ఎక్కువ యువశక్తి మనదేశంలో ఉండటం సానుకూల అంశమే. ఈ శక్తిని ఇటు యువత, అటు ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యమే. అప్పుడే ‘‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువత నాకు కావాలి” అని ఆశించిన వివేకానందుడి లక్ష్యం నెరవేరుతుంది.
- ఐ. ప్రసాదరావు, సోషల్ ఎనలిస్ట్