వెనుకబడిన తరగతులు అనే పదాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు గానీ సామాజిక శాస్త్రవేత్తలు గానీ ఎక్కడా స్పష్టంగా నిర్వచించలేదు. వెనుకబడిన తరగతులు అనే పదాన్ని సంఘంలోని సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయంగా వెనుకబడిన కులాల సమూహంగా నిర్వచించవచ్చు. కాకా కాలేల్కర్ కమిషన్ (1955) ప్రకారం దేశంలో మొత్తం 2399 ఓబీసీ కులాలు ఉన్నాయి. మండల్ కమిషన్ ప్రకారం దేశంలోని మొత్తం ఓబీసీల జనాభా 52 శాతంగా ఉన్నది.
నాయర్ ఉద్యమం
ఈ ఉద్యమం తిరువాన్కూర్ రాజ్యంలోని మధ్యతరగతి ప్రజలు చేశారు. ఇది నంబూద్రి, తమిళ, మరాఠా బ్రాహ్మణుల సామాజిక, రాజకీయ ప్రాబల్యానికి వ్యతిరేకంగా 19వ శతాబ్దం చివరలో జరిగింది. ఇందులో సి.వి.రామన్ పిళ్లై, పద్మనాభ పిళ్లై పాల్గొన్నారు. రామన్ పిళ్లై మార్తాండవర్మ అనే చారిత్రక నవలను రాశారు. మలయాళీ మెమోరియల్ అనే సంస్థను నిర్వహించాడు. వీటి ద్వారా గతించిన నాయర్ల సైనిక వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. మలయాళీ మెమోరియల్ 1891లో తమిళ బ్రాహ్మణులను ప్రభుత్వ సర్వీసులో నియమించడాన్ని వ్యతిరేకించింది. రామకృష్ణ పిళ్లై సంపాదకత్వం వహించిన స్వదేశాభిమాని అనే పత్రిక ద్వారా రాజకీయ హక్కులు డిమాండ్ చేశారు. పద్మనాభ పిళ్లై నాయర్ సేవా సమాజం అనే సంస్థను స్థాపించి, నాయర్ల సామాజిక, రాజకీయపరమైన అభ్యున్నతి కోసం కృషి చేశాడు.
జస్టిస్ ఉద్యమం
ఇదొక మధ్యతరగతి కుల ఉద్యమం. ఇందులో సి.ఎన్.మొదలియార్, టి.ఎన్.నాయర్, పి.త్యాగరాయచెట్టి తదితర నాయకులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో రెడ్డి, కమ్మ, బలిజ నాయకులు వెళ్లాలులు, ముదలియార్, చెట్టియార్స్, కొందరు మలయాళీలు వంటి కులాలు ముందు వరుసలో నిలిచాయి. ఇది 1915–16లో మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగింది. 1917లో వీరు జస్టిస్ అనే ఆంగ్ల దినపత్రికను ప్రారంభించారు. ఈ ఉద్యమం 1917లో మద్రాస్ కేంద్రంగా జస్టిస్ పార్టీ లేదా సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ స్థాపనకు దారి తీసింది. ఈ పార్టీ బ్రహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించిన తొలి రాజకీయ పార్టీ.
లక్ష్యాలు
1. విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాల్లో బ్రాహ్మణ ప్రాబల్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడం.
2. బ్రాహ్మణ ఆధిపత్యం కలిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే జాతీయోద్యమాన్ని వ్యతిరేకించడం.
ఆత్మగౌరవ ఉద్యమం
ఇది భాష, కుల ప్రాతిపదికన నడిచిన ఉద్యమం. దీనిని 1925లో తమిళనాడులో ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని ఇ.వి.రామస్వామి నాయకర్ ముందుండి నడిపించాడు. పెరియార్ 1879లో ఈరోడ్‌లో జన్మించి, 1973లో మరణించాడు. ఈయనకు ఫాదర్ ఆఫ్ మోడ్రన్ తమిళనాడు అని, పుగుత్తరివు పగలవన్ అని అంటారు. ఈయన కుడి అరసు(తమిళవారపత్రి–1925), విడుతలై (1935), పుగుత్తరివు (1934) అనే మూడు తమిళపత్రికలను, రివోల్ట్, పురచ్ఛి అనే మ్యాగజైన్స్‌ను ప్రచురించడంతోపాటు ఫ్యామిలీ ప్లానింగ్ అనే పుస్తకాన్ని 1930లో రాశాడు. కుడి అరసు ఆత్మగౌర ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది.
ఇతను 1950లో జైలుశిక్ష అనుభవించడానికి కారణమైన పుస్తకం పొన్మొజిగల్. పెరియర్ జస్టిస్ పార్టీని 1944లో ద్రావిడ కజగం(డీకే) అనే రాజకీయ పార్టీగా మార్చాడు. తన వివాహాన్ని సివిల్ వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్ చేయించుకోవడం అతని అనుచరుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. దీన్ని తీవ్రంగా నిరసించిన అన్నాదురై ద్రవిడ మున్నెట్ర కజగం (డీఎంకే) అనే పార్టీని 1949లో స్థాపించాడు. 1970లో యునెస్కో వారు పెరియర్‌ను ది సోక్రటీస్ ఆఫ్ సౌత్ ఏషియా అనే పేరుతో గౌరవించారు.
శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం
ఇది కేరళలో 20వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన ఉద్యమం. ఇది ఎఝవ/ ఇరువల కుల సమస్యలను, అన్యాయాలను ఎదుర్కొనేందుకు జరిగింది. వీరిని బహిరంగ ప్రదేశాల నుంచి తరిమివేశారు. వీరు ఆలయ ప్రవేశం లేకపోవడం వంటి సామాజిక మినహాయింపులు ఎదుర్కొన్నారు. ఈ ఉద్యమం నారాయణగురు (నాను అసన్) ఆధ్వర్యంలో జరిగింది. ఇతను అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండిస్తూ జాతి మీమాంస అనే వ్యాసాన్ని రాశాడు. ఇతని అనుచరులను నియోబుద్ధిస్టులు అంటారు. వీరు ఏర్పాటు చేసిన సంస్థ నారాయణ ధర్మ పరిపాలన. ఈ ఉద్యమం ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనే నినాదాన్ని ఇచ్చింది. ఎస్ఎన్డీపీ ముఖ్య లక్ష్యంగా సామాజిక మార్పును తీసుకురావడం, నైతిక సూత్రాలను ప్రచారం చేయడం అనేవి ఉండేవి.
వీరి మొదటి సమావేశం1903లో త్రివేండ్రం సమీపంలోని కున్నుకుజిలో కుమలాలయం బంగళాలో నిర్వహించారు. ఇందులో పల్పు, కుమారన్ అసన్ పాల్గొన్నారు. ఇందులో ఎస్ఎన్ డీపీ పేరు ప్రతిపాదించారు. ఎస్ఎన్డీపీ స్థాపకుడిగా పల్పు, మొదటి అధ్యక్షులుగా శ్రీ నారాయణ గురు, మొదటి కార్యదర్శిగా కుమారన్ అసన్లు పనిచేశారు. ఈ సంస్థ ఏర్పాటుకు వివేకానంద దివ్యసందేశం పునాదిగా పనిచేసింది. అరువిప్పురంలో ఆలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న వవుత్తుసభను ఎన్ ఎన్డీపీ యోగం కమిటీగా ఏర్పర్చారు. క్విలాన్లో జరిగిన సమావేశంలో ఎస్ఎన్డీపీలో ఎఝవా కులం(కల్లు గీతవారు)తోపాటు, ఇతర వెనుకబడిన కులాలను కూడా చేర్చుకోవాలని శ్రీ అయ్యప్పన్ ఆధ్వర్యంలో తీర్మానం ప్రవేశపెట్టారు.
వైకోమ్ సత్యాగ్రహం
ఇది దేశంలో మొదటి, భారీ మానవ హక్కుల ఉద్యమం. ఇది కొట్టాయం దగ్గరలోని వైకోమ్ అనే గ్రామంలో జరిగింది. ఇది కేరళలో ఒక పద్ధతి ప్రకారం జరిగిన మొదటి ఉద్యమం. దీనికి కాంగ్రెస్ నాయకులైన మాధవన్, కేలప్పన్, దీనబంధుగా పిలిచే సి.ఎఫ్. ఆండ్రూస్లు నాయకత్వం వహించారు. ఈ సత్యాగ్రహం పార్వతీ పరమేశ్వర దేవాలయంలో ప్రారంభమైంది. వైకోమ్‌లోని మహాదేవార్ ఆలయంలోనికి అస్పృశ్యుల ప్రవేశం కోసం జరిగింది. దీనికి భారతదేశం అంతటి నుంచి అనేక జాతలు వచ్చారు.
ఇందులో ఆత్మగౌరవ ఉద్యమ జాతి అతి ముఖ్యమైన జాతగా ప్రసిద్ధిగాంచింది. ఇందుకుగాను నాయకర్ అనుచరులు అతనికి వైకోమ్ వీరన్ అనే బిరుదును ఇచ్చారు. ఈ జాత రామస్వామి నాయకర్ మదురై నుంచి వైకోమ్ వరకు చేపట్టారు. ఈ సత్యాగ్రహం వల్ల దీర్ఘకాలంగా నిద్రావస్థలో ఉన్న వెనుకబడిన కులాలు జాగృతమయ్యాయి.
నాడార్ ఉద్యమం
నాడార్లను నాడాన్, షానార్లు అంటారు. వీరు ఎక్కువగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని వెనుకబడిన కులాలకు చెందిన కల్లుగీత కార్మికులు. వీరు సంస్కృతీకరణ కోసం ఉద్యమించారు. ఇందులో భాగంగా తమకు తాము నాడార్ లనే బిరుదు పొంది క్షత్రియ హోదా కల్పించుకున్నారు. నాడార్ మహా జనసంఘం ఏర్పాటు చేసుకుని అగ్రవర్ణాల జీవనవిధానాన్ని, ఆచార వ్యవహారాలను అనుకరించారు. నాడార్ మహాజన సంఘం స్థాపకుడు రావు బహదూర్ రత్నస్వామి నాడార్.