ఎన్టీఆర్ ఒక ప్రభంజనం..ఒక సంచలనం

  • ఎన్టీఆర్.. ఇది ఒక పేరు కాదు. 
  • ఒక ప్రభంజనం. ఒక సంచలనం. 
  • తెలుగు సినీ పరిశ్రమలో ఆయనది ఓ అద్భుతమైన శకం.
  •  ఆయన నటన మార్గదర్శకం. 
  • ఆయన సాధించిన కీర్తి అజరామరం. 
  • ఆ మహానటుడి 99వ జయంతి సందర్భంగా
  • ఇది ‘వెలుగు’ అక్షర నీరాజనం.

పురాణ పురుషుడు

తెలుగు తెరపై రాముడైనా, రావణుడైనా, కృష్ణుడైనా, దుర్యోధనుడైనా, వేంకటేశుడైనా, పరమ శివుడైనా.. ఏ పౌరాణిక పాత్ర పోషించినా అందులో ఎన్టీఆర్‌‌‌‌ది ఒక ప్రత్యేకమైన శైలి. ఈ జానర్‌‌‌‌ చిత్రాలకు అందరినీ ఆకట్టుకోగల రూపం, మెప్పించగల నట ప్రావీణ్యం, వాక్చాతుర్యం ఉండాలి. అవన్నీ మెండుగా ఉన్నాయి కనుకే ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగువారి మనసుల్లో ఆరాధ్య దైవంగా నిలిచారు ఎన్టీఆర్. ఆయన పోషిస్తే ఆ పాత్రకే నిండుదనం వచ్చేది. 1956లో వచ్చిన ‘మాయాబజార్’లో తొలిసారి కృష్ణుడిగా నటించారు ఎన్టీఆర్. కృష్ణుడంటే రామారావే అనేంతగా మెప్పించారు. ఆ పాత్రను అంతలా మలిచిన ఘనత దర్శకుడు కేవీ రెడ్డిది. ఆ తర్వాత దాదాపు పద్దెనిమిది పౌరాణిక చిత్రాలతో పాటు కొన్ని సోషల్ మూవీస్‌‌లోనూ రామారావు కృష్ణుడిగా కనిపించారు. అలాగే ‘చరణదాసి’ అనే సాంఘిక చిత్రంలో మొదటిసారి రాముడిగా కనిపించిన ఎన్టీఆర్, పూర్తి స్థాయి రాముడిగా కనిపించింది మాత్రం 1958లో వచ్చిన తమిళ చిత్రం ‘సంపూర్ణ రామాయణం’లో. అయితే 1963లో వచ్చిన ‘లవకుశ’ చిత్రం రాముడిగా ఎన్టీఆర్‌‌కి ఎనలేని కీర్తిప్రతిష్టల్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘రామాంజనేయ యుద్ధం’ లాంటి చిత్రాల్లో రాముడిగా కనిపించడంతో పాటు, ‘శ్రీరామ పట్టాభిషేకం’లో రాముడి పాత్ర పోషిస్తూ ఆయనే డైరెక్ట్ చేశారు. 

ఇక వేంకటేశ్వరస్వామి మహత్యం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం సినిమాల్లో శ్రీనివాసుడి గానూ మెప్పించారు. ‘నర్తనశాల’లో రెండు పాత్రల్లో కనిపించారు. ఇలాంటి పురాణ పురుషుల పాత్రలే కాదు దుష్ట పాత్రలతోనూ తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. ‘భూకైలాస్’ చిత్రంలో రావణబ్రహ్మగా నటించిన ఆయన, తన సొంత బ్యానర్‌‌‌‌లో వచ్చిన ‘సీతారామకళ్యాణం’లో రావణుడిగా మెప్పించారు. తొలిసారి ఆయన దర్శకత్వం వహించిన చిత్రం కూడా ఇదే. ఇక ‘శ్రీక్రిష్ణ పాండవీయం’లో కృష్ణుడిగానే కాక దుర్యోధనుడిగానూ నటించారు. ఆ చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ‘దానవీరశూరకర్ణ’లో మూడు పాత్రలు, ‘శ్రీమద్విరాటపర్వము’లో ఐదు పాత్రలు చేస్తూ దర్శకత్వం వహించిన ఘనత ఆయనకే సొంతం. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో నటించారు ఎన్టీఆర్. ఇలా దాదాపు నలభై ఎనిమిది పౌరాణిక చిత్రాల్లో ఆయన నటించారు. వీటిలో ఎక్కువశాతం విజయాలే. అత్యధిక పౌరాణికాల్లో నటించిన రికార్డ్ కూడా ఆయనదే.

సోషల్‌‌‌‌ స్టార్

మూడు వందలకు పైగా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌. 1950లో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన.. తొలి ఇరవయ్యేళ్లలోనే  రెండొందల వరకు సినిమాలు చేశారు. సంవత్సరానికి కనీసం పది చిత్రాలు ఆయనవి విడుదలయ్యేవి. ఆయన టచ్ చేయని జానర్ లేదు. పోషించని పాత్ర లేదు. ముఖ్యంగా సాంఘిక చిత్రాల్లో రకరకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్‌‌‌‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేసేవారు. నూట ఎనభైకి పైగా సోషల్‌‌‌‌ డ్రామాస్‌‌‌‌ చేశారు ఎన్టీఆర్. డాక్టర్ నుంచి డ్రైవర్ వరకు, పోలీస్ నుంచి జడ్జి వరకు, రైతు నుంచి బడి పంతులు వరకు ఆయన చేయని పాత్రంటూ లేదు.  యమగోల, వేటగాడు లాంటి ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ లాంటి చిత్రాలు ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లో కొన్ని మైలు రాళ్లు. ఇక ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఏడాది పాటు ఆడిన చిత్రాలు ఇరవై మూడు వరకు ఉన్నాయి.

ఇంకో విశేషమేమిటంటే.. ‘రాముడు’ టైటిల్‌‌‌‌తో చాలా సినిమాలు చేశారు ఎన్టీఆర్. అడవి రాముడు, శభాష్ రాముడు, బండ రాముడు, టాక్సీ రాముడు, టైగర్ రాముడు, రాముడు భీముడు, పిడుగు రాముడు, రాముని మించిన రాముడు,  డ్రైవర్ రాముడు, చాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, శృంగార రాముడు, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు, సరదా రాముడు, కలియుగ రాముడు, రాము.. ఇలా పదిహేను సినిమాలకు పైగా టైటిల్స్‌‌‌‌లో ఆయన పేరు ఉంది. అంతేకాదు.. ముప్ఫైసార్లకు పైగా డ్యూయెల్ రోల్స్​లో కనిపించి అలరించారు. కెరీర్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో తొంభై అయిదు మంది దర్శకులతో పని చేశారాయన. స్వయంగా పద్దెనిమిది సినిమాలకు డైరెక్షన్‌‌‌‌ చేశారు. దాదాపు ముప్ఫై చిత్రాల్ని నిర్మించారు.

జానపద ధీరుడు

పౌరాణిక, చారిత్రక చిత్రాల్లోనే కాకుండా జానపద చిత్రాల్లోనూ తిరుగులేని ముద్ర ఎన్టీఆర్​ది. కమర్షియల్ హీరోగా నిల దొక్కుకోడానికి ‘పాతాళ భైరవి’ లాంటి జానపద చిత్రాలు ఆయనకి ఎంతో హెల్ప్ అయ్యాయి. జయసింహ, జగ దేకవీరుని కథ, పల్లెటూరి పిల్ల, బాలనాగమ్మ, భట్టి విక్రమార్క, ఆలీబాబా నలభై దొంగలు, గులేబకావళి కథ, చిక్కడు- దొరకడు, ఏకవీర, రాజమకుటం, మంగమ్మ శపథం, గోపాలుడు భూపాలుడు, కంచుకోట, గండికోట రహస్యం, బందిపోటు లాంటి యాభైకి పైగా జానపద చిత్రాల్లో ఆయన నటించారు.

‘చరిత్ర’ సృష్టించి..

పౌరాణిక పాత్రలు చేయడానికి ఎంత ఇష్టపడేవారో.. చారిత్రక పాత్రలు పోషించడానికి కూడా అంతే ఇష్టపడేవారు ఎన్టీఆర్. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో పదిహేనుకు పైగా సినిమాలు హిస్టారికల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో చేశారాయన. పైగా వాటిలో చాలా సినిమాలను ఆయనే నిర్మించారు. కొన్నింటిని డైరెక్ట్ చేశారు. మరికొన్నింటికి కథ, కథనం సమకూర్చారు. ఇంకొన్ని సినిమాలకి ఎడిటింగ్ వర్క్ కూడా చేశారు. సామ్రాట్ అశోక, అక్బర్ సలీమ్ అనార్కలి, వేములవాడ భీమకవి, చాణక్య చంద్రగుప్త లాంటి ఎన్నో హిస్టారికల్ ఫిల్మ్స్‌‌‌‌లో ఆయా వ్యక్తుల పాత్రలకు ప్రాణం పోశారాయన. ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’లో అయితే పోతులూరి వీరబ్రహ్మం, గౌతమ బుద్ధుడు, ఆదిశంకరుడు, రామానుజం, వేమన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. అలాగే ‘మేజర్‌‌‌‌‌‌‌‌ చంద్రకాంత్‌‌‌‌’లోని ‘పుణ్యభూమి నా దేశం’ పాటలో కూడా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీరపాండ్య కట్టబ్రహ్మన, శివాజీ గెటప్స్‌‌‌‌లో కనిపించారు. ‘నారు పెట్టావా నీరు పోశావా.. కోత కోశావా కుప్ప నూర్చావా’ అంటూ స్క్రీన్‌‌‌‌పై ఆయన సింహంలా గర్జిస్తుంటే థియేటర్లు చప్పట్లతో మార్మోగాయి. ఆ వీరులంతా నిజంగా ఇలాగే ఉండేవారా అన్నట్లుగా ఫీలయ్యారు ఆడియెన్స్.