రష్యా, ఉక్రెయిన్‌‌‌‌ సంక్షోభం కోల్డ్​వార్​కు దారితీస్తదా?

రష్యా, ఉక్రెయిన్‌‌‌‌ సంక్షోభం కోల్డ్​వార్​కు దారితీస్తదా?

1991లో సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత కోల్డ్​ వార్​ ముగిసినప్పటికీ దాని వాసనలు ఇంకా పోలేదనడానికి తాజా ఉక్రెయిన్ సంక్షోభమే ఉదాహరణ. ఉక్రెయిన్ సరిహద్దు దగ్గర రష్యా భారీగా సైన్యాన్ని మోహరించడంతో ఇరుదేశాల మధ్యా ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. అది ఎక్కడ యుద్ధానికి దారితీస్తుందో అన్న భయాందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు అమెరికా, దాని నేతృత్వంలోని నాటో సభ్య దేశాలు యుద్ధం వస్తే ఉక్రెయిన్​కు సహకరిస్తామని, రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో కోల్డ్​ వార్​ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
యూరోపియన్ జాతుల మధ్య 1648లో కుదిరిన వెస్టుఫాలియా ఒప్పందం జాతీయత ఆధారంగా దేశాలను, వాటి సార్వభౌమాధికారాలను గుర్తించినప్పటి నుంచి ఒక కొత్త అంతర్జాతీయ సమాజం, వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఇంతకు ముందు చూడని, అనుభవించని ఈ కొత్త అంతర్జాతీయ వ్యవస్థ ఒక వెస్ట్రన్‌‌‌‌  ఆలోచన. ఆ తర్వాత యూరప్​లో జరిగిన రాజకీయ ఘటనలు దేశాల మధ్య పోటీకి దారి తీశాయి. ఈ పోటీ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో వ్యాపించి.. తమ జాతి మిగతా వారికంటే ఉన్నతులుగా రుజువు చేసుకోవడానికి, బలవంతులుగా ఎదగడానికి తాపత్రయ పడేలా చేసింది. ఈ పోటీ విస్తృతమై ప్రపంచవ్యాప్తంగా భూమి, ప్రజలు, వనరులు, వాణిజ్యం, వాణిజ్య మార్గాలు, సంస్కృతులు, సమాజాలు ఇలా అన్నింటిని నియంత్రించాలనే కోరికలకు దారితీసింది. దాని ఫలితమే సైంటిఫిక్‌‌‌‌, టెక్నలాజికల్‌‌‌‌ విప్లవాలు, వలసవాద, సామ్రాజ్య విస్తరణ కాంక్షలు. 17వ శతాబ్దం నుంచి ప్రపంచ చరిత్రను గమనిస్తే 18వ శతాబ్దంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య, 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్, రష్యా మధ్య, 20వ శతాబ్దం మొదట్లో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో జర్మనీ, ఇతర యురోపియన్ దేశాల మధ్య, ఆ తర్వాత అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య, 21వ శతాబ్దంలో అమెరికా, చైనా మధ్యా మనం చూడవచ్చు.

ఉక్రెయిన్‌‌‌‌ స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం..
రష్యన్ విప్లవం తర్వాత 1917లో ఏర్పడిన ఉక్రెయిన్.. స్వేచ్ఛా, స్వాతంత్ర్యం, సార్వభౌమ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని తపించిన ఒక వర్గం.. దానికి విరుద్ధంగా సోవియట్ అనుకూల సోషలిస్ట్ అనుబంధాన్ని కలిగి ఉండాలని కలలుగన్న మరో వర్గం ఆలోచనల కలయిక. ఈ వైరుధ్యాలు రెండో ప్రపంచ యుద్ధానంతర కాలం నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత స్వాతంత్ర్యం ప్రకటించుకున్న ఉక్రెయిన్ మొదట ఎదుర్కొన్న సవాలు.. ఇతర దేశాలు, కొత్తగా ఏర్పడ్డ రష్యన్ సమాఖ్యతో సంబంధాలను ఎలా బ్యాలెన్స్‌‌‌‌ చేసుకోవాలన్న విషయంపైనే. అప్పటి నుంచి అంతర్గత రాజకీయాలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి. ఇది ఆర్థిక విధానాలు, విదేశీ సంబంధాల్లో గందరగోళ, అస్తవ్యస్త పరిస్థితులను సృష్టించింది. 1991 నుంచి 2004 వరకు ఉక్రెయిన్ అధ్యక్షునిగా ఉన్న లియోనిడ్ క్రావ్‌‌‌‌చుక్ వెస్ట్రన్‌‌‌‌ కంట్రీస్‌‌‌‌కి అనుకూలంగా వ్యవహరించగా, లియోనిడ్ కుచ్మా రష్యన్ ఆధారిత విధానాలను తీసుకున్నారు. 2004లో విక్టర్ యనుకోవిచ్, విక్టర్ యాష్చెంకోల మధ్య జరిగిన అధ్యక్ష పోటీ వరుసగా రష్యన్ ఫెడరేషన్, వెస్ట్రన్‌‌‌‌ కూటమికి అనుకూల విధానాల మధ్యే జరిగింది. లియోనిడ్ కుచ్మా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధానిగా ఉన్న విక్టర్ యనుకోవిచ్ ఆ ఎన్నికల్లో ఓడిపోయినా.. అధికారం బదలాయించడానికి ఒప్పుకోకపోవడంతో 2005లో వచ్చిన ఆరెంజ్ విప్లవంతో దిగిరాక తప్పలేదు. ఆ తర్వాత 2010లో జరిగిన ఎన్నికల్లో విక్టర్ యనుకోవిచ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

ఒకసారి వారికి.. మరోసారి వీరికి అవకాశం
1991 నుంచి జరుగుతున్న ఎలక్షన్స్​లో ప్రజాభిప్రాయం చీలిపోయి పాశ్చాత్య కూటమికి అనుకూలమైన విధానాలకు ఒకసారి, రష్యాకు అనుకూల విధానాలకు మరొకసారి మద్దతు లభించింది.  యూరోపియన్ యూనియన్‌‌‌‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి వ్యతిరేకంగా యనుకోవిచ్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ 2013 యూరోమైడాన్ నిరసనలు యనుకోవిచ్‌‌‌‌ను అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి దారితీశాయి. ఆ తర్వాత అర్‌‌‌‌‌‌‌‌సెనియ్‌‌‌‌ యట్సేన్యుక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆ ఒప్పందాలపై సంతకం చేయడంతో రష్యా ప్రతిచర్యలకు దిగింది. క్రిమెయాలో మెజారిటీ ప్రజలు రష్యాలో చేరడానికి మొగ్గు చూపుతున్నారని, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఆ ప్రాంతాన్ని రష్యాలో కలపడమే కాక ఉక్రెయిన్ లోని డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో అక్కడి వేర్పాటువాదులు ఏర్పాటు చేసిన స్వయం ప్రకటిత ప్రభుత్వాలను గుర్తించింది. ఈ చర్యలు వెస్ట్రన్‌‌‌‌ కంట్రీస్‌‌‌‌ను కలవరపాటుకు గురిచేసి రష్యాపై ఆంక్షలు విధించేందుకు కారణమయ్యాయి. రష్యా చర్యలకు ప్రతిగా ఉక్రెయిన్ పార్లమెంట్ 2017లో నాటో సభ్యత్వం, వ్యూహాత్మక సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు, నాటో భద్రతా విధానాలను అవలంబించేందుకు నిర్ణయం తీసుకుంది. 2020లో అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ కొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని ఆమోదించారు. దాని ప్రకారం ఉక్రెయిన్ నాటోతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చింది. 

ఉక్రెయిన్‌‌‌‌ నాటోలో చేరితే....
ఉక్రెయిన్ నాటో సభ్యత్వం కోరుకోవడం, దానికి అనుకూలంగా నాటో నిర్ణయం తీసుకోవటం తమకు వ్యూహాత్మకంగా మంచిది కాదని రష్యా భావిస్తోంది. ఆ కారణం చేతనే ఉక్రెయిన్ మీద ఒత్తిడి పెంచేందుకే సరిహద్దుల వద్దకు సైన్యాన్ని తరలించిందనేది విశ్లేషకుల భావన. మరో వైపు కోల్డ్​ వార్​ టైంలో వెస్ట్రన్‌‌‌‌ కంట్రీస్  ఉమ్మడి రక్షణ కోసం సోవియెట్ యూనియన్​కు వ్యతిరేకంగా ఏర్పాటైన నాటో ఆ యుద్ధం ముగిసినా విచ్చిన్నం అవ్వకుండా, ఇంకా విస్తరించడం రష్యాకు ఆందోళన కలిగిస్తోంది. 1997 నుంచి పూర్వపు సోవియట్ యూనియన్‌‌‌‌లో భాగమైన 14 దేశాలు నాటోలో  భాగస్వామ్యం తీసుకున్నాయి. అందులో రష్యాతో సరిహద్దులు పంచుకుంటున్న లాత్వియా, ఎస్టోనియా ఉండటం, సోవియట్ యూనియన్​లో రష్యా తర్వాత అతిపెద్ద దేశమైన ఉక్రెయిన్ సభ్యత్వం కోరుకోవడం రష్యాను కలవరపాటుకు గురిచేసే అంశం. అందుకే నాటోలో ఉక్రెయిన్​కు సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా షరతు పెట్టింది.

పూర్తి స్థాయి యుద్ధం రాకపోవచ్చు
ఈ పరిణామాల నేపథ్యంలో రెండు ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఒకటి.. యుద్ధం వస్తే ఉక్రెయిన్​కు నాటో బలగాలను పంపుతుందా? రెండోది.. అసలు ఉక్రెయిన్, రష్యా మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందా? అనేవే. ఉక్రెయిన్ నాటో సభ్యత్వం కోరుకున్నప్పటికీ, అది ఇంకా నాటోలో సభ్య దేశం కాలేదు, కాబట్టి ఒక నాన్ మెంబెర్ రక్షణ కోసం నాటో దళాలు నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం లేదు. అవి ఉక్రెయిన్​కు ఆయుధాలను, లాజిస్టిక్స్ ను సరఫరా చేసే అవకాశం మాత్రమే ఉంది. నాటోలో కీలక భాగస్వామి అయిన జర్మనీ ఇప్పటికే సైన్యాన్ని, ఆయుధాలను పంపబోమని తేల్చి చెప్పింది. ఇక లక్ష మంది సైన్యంతో రష్యా.. ఉక్రెయిన్​తో పూర్తిస్థాయి యుద్ధం చేయకపోవచ్చు. ఇప్పటికే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. రష్యా కూడా ఉక్రెయిన్​తో యుద్ధం కోరుకోవడం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకటించారు. అయితే ఉక్రెయిన్​లోని కొన్ని ప్రాంతాలను మాత్రమే అక్రమించుకునే లక్ష్యంతో రష్యా యుద్ధంలోకి దిగే అవకాశాలను కొట్టి పారేయలేం. పూర్తి స్థాయి యుద్ధం కాకున్నా ప్రాంతీయ ఘర్షణల అవకాశాలను కొట్టేయలేం.

శాంతి చర్చలే మంచిది..
ఆర్థికంగా, వ్యూహాత్మకంగా నాటో-రష్యా మధ్య ఘర్షణలు అంత ప్రయోజనకరం కాదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాలకు రష్యా అతి పెద్ద వ్యాపార భాగస్వామి. ఇరువైపులా దాదాపు 38 శాతం ఎగుమతులు, దిగుమతులు ఉన్నాయి. పాశ్చాత్య దేశాల చమురు దిగుమతుల్లో 26 శాతం, గ్యాస్ దిగుమతుల్లో 40 శాతం రష్యా నుంచే రావాలి. వ్యూహాత్మకంగా రష్యాతో వైరం  చైనాకు ప్రయోజనం. ఇప్పటికే ఉక్రెయిన్ సంక్షోభంపై రష్యాకు అనుకూలంగా, నాటోకు వ్యతిరేకంగా చైనా మాట్లాడింది. కాబట్టి నాటో దుందుడుకుతనం రష్యా -చైనాల మధ్య మరింత సన్నిహిత సంబంధాలకు దారితీస్తుంది. రష్యా, చైనా మైత్రి ఇండియాకూ అంత మంచిది కాదు. ఇప్పటికే సరిహద్దుల్లో చైనాతో సమస్యలను ఎదుర్కొంటున్న ఇండియాకు రష్యా కీలక రక్షణ భాగస్వామి. ఉక్రెయిన్, రష్యా సంక్షోభం శాంతి చర్చలతో సమసిపోవాలని భారత్ కోరుకుంటోంది.