Sankranti 2025: సంక్రాంతి ముగ్గులకు ఇంత కథ ఉందా..

సంక్రాంతి పండగొచ్చిందంటే వాకిళ్లన్నీ ముగ్గులతో కళకళలాడిపోతుంటాయి. రంగు రంగుల ముగ్గులు.. ఒక్కోరోజు ఒక్కో తీరుగా ఇళ్ల ముందు ముగ్గులు వేయడానికి ఉత్సాహంగా రెడీ అయ్యే మహిళలను చూడొచ్చు. సంక్రాంతికైతే ముగ్గులకు గొబ్బెమ్మలు, పూలు పెడతారు. పసుపు, కుంకుమ చల్లుతారు. నా ముగ్గు బాగుంది అంటే, నా ముగ్గే బాగుంది అంటూ పోటీలు పడతారు. ఈ ముగ్గుల వెనక సామాజిక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో.. 

ముగ్గంటేనే మహిళలు:

ముగ్గులకు మహిళలకు విడదీయరాని సంబంధం ఉంది. స్త్రీలలో దాగిన కళాత్మకతను బయట పెడతాయి ముగ్గులు. ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెరుకులు, పాలకుండలతో వేసే ముగ్గు ఇంటిని భోగభాగ్యాలతో నింపమని చెప్తుంది. రథం ముగ్గు చెడును బయటకు పంపుతుందని అంటారు.. 

ముగ్గులు ఏం చెప్తాయో తెలుసా: 

ముగ్గు వేయడానికి ముందు ఇంటి ముందున్న నేలను చదును చేస్తారు. రాళ్లు రప్పలు ఉంటే ఏరేస్తారు. ఆవు పేడ కలిపిన నీళ్లతో కళ్లాపి చల్లుతారు. అలా ఆవుపేడతో తడిసిన నేల ఆకాశానికి సంకేతమని చెప్తారు. ముగ్గు వేయడానికి పెట్టే చుక్కలు రాత్రి పూట ఆకాశంలో కనిపించే చుక్కలకు సంకేతం. చుక్కలను ముగ్గుతో గీతలుగా కలిపి, గళ్లతో నింపడాన్ని ఖగోళానికి సంబంధించిన రహస్యం అని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి.అలాగే ముగ్గు మధ్య స్థానం సూర్యునికి ప్రతీక అంటారు. 

ముగ్గు ఆరోగ్యం:

పల్లెలు, గ్రామాల్లో వాకిళ్ల ముందు పేడ కళ్లాపి చల్లడం వల్ల చెడు బ్యాక్టీరియా ఇంట్లోకి రాదు. చలికాలంలో అనేక రకాలైన క్రిమికీటకాలు పెరుగుతాయి. వాటిని నాశనం చేసే శక్తి పేడలో ఉంది. ముగ్గు వేయాలంటే అనేకసార్లు వంగి లేవాలి. చేతులు, కాళ్లకు మంచి వ్యాయామం కూడా. చుక్కలు పెడుతూ, వాటిని కలుపుతూ దృష్టంతా ముగ్గుపైనే పెట్టాలి. అందువల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ నెలంతా సూర్యోదయానికి ముందు లేవడం వల్ల, ఆరోగ్యానికి ఆరోగ్యం. పనులన్నీ చక్కగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 

Also Read : సంక్రాంతికి కనీసం ఈ మూడు పిండి వంటలైనా ఇలా చేస్కోండి

కుడిచేత్తోనే ఎందుకు వేయాలి:

ముగ్గు అందంగా ఉంది. బాగుందని అంటారు. కానీ కొందరు ముగ్గును లక్ష్మీదేవికి నిలయంగా భావిస్తారు. కాబట్టే ముగ్గును పవిత్రంగా చూస్తారు. అందుకే ఎవరన్నా తొక్కితే పెద్దవాళ్లే కాదు, ముగ్గువేసిన వాళ్లూ అసలు ఒప్పుకోరు. అలాగే ముగ్గును కుడిచేత్తోనే వేయాలని, ఎడమచేతిని అసలు వాడకూడదని చెప్తారు. దీని వెనుక ఓ కారణం ఉంది. తాంత్రిక, క్షుద్ర పూజలు చేసే వాళ్లు కూడా ముగ్గులు వేస్తారు. అయితే వాళ్లు ఆ సమయంలో ముగ్గులను కుడిచేత్తో కాకుండా, ఎడమ చేత్తో మాత్రమే వేస్తారు.

ఇంటి ముందు ముగ్గు శుభాన్ని సూచిస్తుంది. కాబట్టి ఎడమచేత్తో వేయొద్దని అంటారు. అలాగే దేవతలు, ఓం, స్వస్తిక్ వంటి ఆకారాల్లో ఉన్న ముగ్గులు వేయొద్దని కూడా చెప్తారు. ముగ్గు లేని ఇల్లు అశుభం అనడం వల్ల పూర్వకాలంలో రుషులు, బ్రహ్మచారులు, అతిథులు ముగ్గు లేని ఇళ్లలోకి వెళ్లే వాళ్లు కాదట. 

సంక్రాంతికి సందడే సందడి:

సంక్రాంతి రోజుల్లో ఇళ్ల ముంగిటే కాదు, దేవాలయాల పరిసరాల్లో కూడా ముగ్గులు వేస్తుంటారు. ఎందుకంటే దేవాలయాలు, విగ్రహాల ముందు ముగ్గులు వేస్తే మంచి జరుగుతుందని, మహిళలు సుమంగళిగా చనిపోతారని నమ్ముతారు. తులసి చెట్టు దగ్గర ముగ్గు వేస్తే మంచి జరుగుతుంది. ముగ్గులో పద్మం ఆకారం ఉంటే, అది దుష్ట శక్తులను అడ్డుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి. నక్షత్రం ఆకారంలో ఉన్న ముగ్గు... భూత, ప్రేత, పిశాచాలను ఇళ్లలోకి రానివ్వవని అంటారు.

ముగ్గు వేశాక దాని చుట్టు అడ్డగీతలు గీస్తారు. దాని వల్ల ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయని, అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లదని కూడా భావిస్తారు. ఇంటి ద్వారం వద్ద తప్పనిసరిగా ముగ్గు వేయాలి. అదీ స్వాగతం పలుకుతున్నట్లు ద్వారాలు తెరిచినట్లు ఉండాలి. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అనేక గ్రామాల్లో, జిల్లా కేంద్రాల్లో ముగ్గుల పోటీలు జరుగుతుంటాయి. మహిళలు, పెళ్లి కాని అమ్మాయిలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

== వెలుగు లైఫ్