ఇండస్ట్రీని ఏలిన నటరారాజు

ఇండస్ట్రీని ఏలిన నటరారాజు

నటనతో సౌత్‌ సినిమాకి కొత్త వన్నెను అద్దిన నటుడాయన. విదేశాల్లో సైతం వివిధ సత్కారాలు పొందిన ఘనుడాయన. రిక్షావోడి నుంచి రారాజు వరకు ఎన్నెన్నో పాత్రలకు ప్రాణం పోశారు. దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాకి చిరునామాగా నిలిచారు. నడిగర తిలకంగా ప్రేక్షకులు నేటికీ కొనియాడుతున్న శివాజీ గణేషన్. ఆ మహానటుడు అందరినీ వదిలి అనంతలోకాలకు వెళ్లిపోయిన రోజు ఇది. ఈ సందర్భంగా ప్రత్యేక నివాళి.

రామాయణంలో సీత వేషం

శివాజీ పూర్తి పేరు విల్లుపురం చిన్నయ్య మండ్రయార్ గణేషమూర్తి. 1928, అక్టోబర్ 1న మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. ఏడేళ్ల వయసులోనే నాటకాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. పదేళ్ల వయసులో తిరుచిరాపల్లిలోని ఓ డ్రామా కంపెనీతో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. నటనతో పాటు భరతనాట్యం, కథక్, మణిపురి డ్యాన్స్ కూడా నేర్చుకున్నారు. రకరకాల పాత్రల్లో ఆకట్టుకునే శివాజీ గణేషన్.. రామాయణంలో సీత వేషం వేసి ప్రేక్షకుల మెప్పు పొందారు.

తొలి సినిమాతోనే ప్రేక్షకులు ఫిదా

1952లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శివాజీ. మొదటి సినిమా ‘పరాశక్తి’. అయితే ఆ సినిమాలో పాత్రకి శివాజీ రైట్ చాయిస్ కానే కాదని ఏవీఎం సంస్థ భావించింది. కానీ సహనిర్మాత పెరుమాళ్ మొదలియార్ మాత్రం ఆయనే ఈ క్యారెక్టర్ చేయాలని పట్టుబట్టారు. ఆయన నమ్మకమే నిజమైంది. శివాజీ నటనకి ప్రేక్షకలోకం ఫిదా అయిపోయింది. మొదట్లో వీసీ గణేషన్ పేరుతోనే నటించేవారు. ‘శివాజీ కంద ఇందు రాజ్యం’ సినిమాలో నటించాక ఆయన పేరు ముందు శివాజీ చేరింది. ఆ పాత్రను అద్భుతంగా పోషించినడంతో సినిమా చూసినవారంతా ఆయన్ని శివాజీ శివాజీ అని పిలవడం మొదలుపెట్టారు. దాంతో వీసీ గణేషన్ కాస్తా శివాజీ గణేషన్‌ అయిపోయాడు.

వందో సినిమాలో తొమ్మిది పాత్రలు

ఒకే సినిమాలో రకరకాల పాత్రలు పోషించిన మొట్టమొదటి నటుడు శివాజీ గణేషన్. తన వందో సినిమా అయిన నవరాత్రిలో తొమ్మిది రకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇది మిగతా యాక్టర్స్ అందరినీ ఇన్‌స్పైర్ చేసింది. ఎంజీఆర్‌‌ కూడా ఓ చిత్రంలో తొమ్మిది పాత్రలు చేశారు. ‘దశావతారం’లో కమల్ పది పాత్రల్ని పోషించారు. క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్, యాక్షన్ ఫిల్మ్స్ ఇలా ప్రతి జానర్ లలో  శివాజీ  సినిమాలు చేశారు. రియల్‌ లైఫ్ క్యారెక్టర్లు, హిస్టారికల్ రోల్స్, పురాణ పురుషుల పాత్రల్ని పోషించడంలో ఆయనకు ఆయనే సాటి. చిదంబరం పిళ్లై, వీరపాండ్య కట్టబొమ్మన, కర్ణుడు, భగత్ సింగ్, నారద పాత్రల్లో జీవించారాయన. 

300లకు పైగా సినిమాలు

మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన శివాజీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన నటించిన తమిళ సినిమాలు ఆంధ్రప్రదేశ్ లోనూ రిలీజయ్యేవి. శివాజీ చాలా తెలుగు సినిమాల్లోనూ నటించారు. పరదేశి, పెంపుడు కొడుకు, మనోహర, బొమ్మలపెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, సంపూర్ణ రామాయణం, రామదాసు, భక్త తుకారాం, జీవన తీరాలు, నివురుగప్పిన నిప్పు తదితర చిత్రాల్లో ఆయన నటన చూసి తెలుగువారంతా అభిమానులయ్యారు. తెలుగులో ఆయనకు జగ్గయ్య డబ్బింగ్ చెప్పేవారు. ఆయన స్వరం కూడా శివాజీని తెలుగువారికి దగ్గర చేసిందని చెప్పొచ్చు. 

అలెగ్జాండర్ పాత్ర ఆఫర్ చేసిన ఎన్టీఆర్

తమిళంలో బీఆర్ పంతులు తీసిన ‘కర్ణన్’ సినిమాలో కర్ణుడిగా శివాజీ, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. ఆయన నటకు ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్.. తర్వాత తాను తీసిన చాణక్య చంద్రగుప్తలో అలెగ్జాండర్ పాత్ర ఆఫర్ చేశారు. డి.రామానాయుడు ‘ప్రేమ్‌నగర్’ చిత్రాన్ని తమిళంలో శివాజీతో రీమేక్ చేశారు . దాసరి నారాయణరావుకు కూడా శివాజీ అంటే చాలా ఇష్టం. అందుకే ‘విశ్వనాథ నాయకుడు’ చిత్రంలో పాత్రకి ఆయన్ని ఏరి కోరి తీసుకున్నారు. కాస్త వయసు మీద పడిన తర్వాత కూడా ‘ఆత్మబంధువు’లో లీడ్ రోల్‌తో అదరగొట్టారు శివాజీ. సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. జల్లికట్టు, వన్స్ మోర్, సాధనై తదితర సినిమాలకు తన నటనతో ప్రాణం పోశారు. క్షత్రియ పుత్రుడు, నరసింహ చిత్రాల్లో కమల్, రజినీలకు తండ్రిగా ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తోటి నటీనటులకుశివాజీ ఎంతో గౌరవం ఇచ్చేవారు. ఓ సినిమాలో ఆయనకి, నగేష్‌కి మధ్య ఒక సీన్ ఉంది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించిన తర్వాత.. శివాజీని నగేష్ డామినేట్ చేసినట్టు దర్శకుడికి అనిపించింది. దాంతో ఎడిటింగ్‌లో ఆ సీన్‌ని తీసేస్తున్నట్టు శివాజీతో చెప్పారట. దానికాయన.. నగేష్ చాలా గొప్పగా నటించాడు, అలాంటి సీన్ ఎలా తీసేస్తారు, దాన్ని అలాగే ఉంచమని చెప్పారట. ‘లయన్ కింగ్’ మూవీ ఇండియాలో రిలీజైనప్పుడు, తండ్రి సింహానికి తమిళంలో డబ్బింగ్ చెప్పాల్సిందిగా శివాజీని అడిగారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.

నెహ్రూ ఆహ్వానం

ఇండియన్ సినిమాకి శివాజీ చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది ప్రభుత్వం. ‘క్షత్రియ పుత్రుడు’ మూవీకి నేషనల్ అవార్డు వరించింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయన కీర్తి కిరీటంలో చేరింది. నాలుగుసార్లు ఫిల్మ్ ఫేర్‌‌తో పాటు మూడు సార్లు తమిళనాడు స్టేట్ అవార్డ్ కూడా తీసుకున్నారు శివాజీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం, అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించాయి. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం షెవాలియర్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద లీజియన్ ఆఫ్ హానర్‌‌ పురస్కారంతో సత్కరించింది.  ఈజిప్ట్ అధ్యక్షుడు భారత సందర్శనకు వచ్చినప్పుడు అప్పటి ప్రధాని జవహర్‌‌లాల్ నెహ్రూ ఆయన కోసం ఓ పార్టీని ఏర్పాటు చేశారు. దానికి హాజరైన రాజకీయాలతో సంబంధం లేని ఒకే ఒక్క వ్యక్తిని శివాజీ గణేషన్. అంతే కాదు.. ఈజిప్టులోని కైరోలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో వీరపాండ్య కట్టబొమ్మన సినిమాకిగాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక ఇండియన్ అవార్డును తీసుకోవడం అదే తొలిసారి. 1962లో ఇండియన్  కల్చరల్ అంబాసిడర్‌‌గా తమ దేశానికి రమ్మంటూ అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ శివాజీని ఆహ్వానించారు. మారిషన్ అధ్యక్షుడు కూడా తమ ఇండిపెండెన్స్ డేకి ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. ఇలాంటి గౌరవాలెన్నో ఇంకా ఎన్నో ఆయనకి దక్కాయంటే శివాజీ గణేషన్‌ కీర్తి విదేశాలకు సైతం ఎలా పాకిందో అర్థం చేసుకోవచ్చు.

యాక్టివిస్ట్గా పొలిటికల్ కెరీర్ ప్రారంభం

రాజకీయాల్లో కూడా రాణించారు శివాజీ గణేషన్. మొదట ఓ యాక్టివిస్ట్గా పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టారు. తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగంలో చేరారు. చాలా యేళ్ల తర్వాత దాన్నుంచి బయటకు వచ్చి తమిళ నేషనల్ పార్టీలో చేరారు. ఇందిరాగాంధీ హయాంలో రాజ్యసభ్య మెంబర్ అయ్యారు. ఆవిడ మరణంతో శివాజీ పొలిటికల్ కెరీర్‌‌ కుంటుపడింది. ఆ తర్వాత పలు పార్టీలతో కలిసి పని చేసినా.. 1991లో ఆయన రాజకీయ జీవితానికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పడింది.

మనసున్న మనిషి

శివాజీ ఎంతో మంచి వ్యక్తి. ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు భారీగా విరాళాలు ఇచ్చేవారు. మిడ్‌ డే మీల్ పథకాన్ని మొదలుపెట్టినప్పుడు కూడా తన వంతు సాయం ప్రకటించారు. సర్వస్వాన్ని సేవకు ధారపోసి, పేదరికంలో జీవిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ పి.కక్కన్‌కి ఎనభై గ్రాముల గోల్డ్ చెయిన్‌ను గిఫ్టుగా ఇచ్చారు. ఇండో పాకిస్థాన్ యుద్ధ సమయంలోనూ శివాజీ భారీగా విరాళాన్ని ఇచ్చారు. వీరపాండ్య కట్టబొమ్మనని ఉరి తీసిన చోటే సొంత ఖర్చుతో ఆయన విగ్రహం పెట్టించారు. ఎన్నో దేవాలయాలకి ఏనుగు విగ్రహాల్ని సొంత సొమ్ముతో ఇచ్చారు.

నలుగురు సంతానం

శివాజీ భార్య పేరు కమల. వారికి నలుగురు సంతానం. తమిళ యాక్టర్ ప్రభు అందరిలో చిన్నవాడు. 1950లో శివాజీ ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్‌‌ స్థాపించారు. ప్రస్తుతం దాన్ని ఆయన పెద్ద కొడుకు రామ్‌కుమార్ చూస్తున్నాడు. మనవళ్లు విక్రమ్ ప్రభు, దుష్యంత్‌ రామ్‌ కుమార్‌‌ కూడా సినీ ఇండస్ట్రీల్లోకి వచ్చారు. దుష్యంత్ తాత గుర్తుగా జూనియర్ శివాజీ అనే పేరుతో నటిస్తున్నాడు. 

అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారం

నటిస్తూ నటిస్తూ ఆ వేదిక మీదే చనిపోవాలని ఎప్పుడూ అంటుండేవారు శివాజీ. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. 2001 జులై 21 గుండెపోటుతో కన్ను మూశారు. ఆయనకి తుది వీడ్కోలు పలకడానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులంతా వచ్చారు. అభిమానుల కోసం అంత్యక్రియల్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రఖ్యాత లాస్‌ ఏంజెలెస్‌ టైమ్స్ పత్రిక.. ‘ద మార్లన్ బ్రాండో ఆఫ్ ది సౌత్ ఇండియాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ’ పేరుతో ఓ ప్రత్యేక శీర్షిక ప్రచురించింది. శివాజీ గణేషన్ను చూస్తే ఓ మహారాజు కదిలి వస్తున్నట్టుగా ఉండేదని అందరూ అంటుంటారు. నిజమే. ఆయన రాజులా బతికారు. రాజులానే ఇండస్ట్రీని ఏలారు. జనాల హృదయ సీమల్లోనూ నట రారాజుగానే నిలిచిపోయారు.