
- ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
సామాజిక న్యాయం అంటే... సమాజంలోని సంపద, అవకాశాలు, హక్కులు, అధికారాలను అందరూ సమానంగా పొందడం. కానీ, వాస్తవంగా మెజారిటీ ప్రజలకు సమాన అవకాశాలు దక్కడం లేదు. దీంతో ప్రజల్లో అభద్రతా భావం పెరిగి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలకు సమాన అవకాశాలు దక్కి, సంపద పంపిణీ జరిగినప్పుడే సామాజిక న్యాయం చేకూరుతుంది. అప్పుడే జాతి, మతం, లింగం, ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఎదుర్కొంటున్న వివక్ష దూరమవుతుంది. ప్రజలందరూ ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఏర్పడుతుంది.
ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20న నిర్వహిస్తోంది. చట్టపరంగా ఎలాంటి వివక్ష, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని 2007 నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ‘సమ్మిళిత సాధికారత. సామాజిక న్యాయం కోసం అంతరాలను తగ్గించడం’ అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాం. ప్రస్తుత ఆధునిక సమాజంలో దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య రోజురోజుకూ అంతరాలు పెరిగిపోతున్నాయి.
ముఖ్యంగా దేశాల మధ్య అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, ప్రకృతి విపత్తులు, డిజిటల్ డివైడ్, మానవ హక్కుల ఉల్లంఘనలతో సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. పట్టణీకరణ, పారిశ్రామీకరణ, ప్రపంచీకరణతో ప్రపంచ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ... సమాజంలో అంతరాలు తొలగిపోవడం లేదు. కనీస అవసరాలు కూడా నోచుకొని ప్రజలు ఇంకా ఉన్నారు. పేదరికం, ఆకలి, నిరుద్యోగం, లింగ వివక్ష వంటి అసమానతలు సమాజంలో వేళ్లూనుకొని ఉన్నాయి. వీటిని నిర్మూలించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు గండి
సామాజిక న్యాయం సాధించడానికి రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చినప్పటికీ.. ఇంకా వాటి లక్ష్యం సంపూర్ణంగా నెరవేరడం లేదు. అన్ని వర్గాలు సమానంగా లబ్ధి పొందడం లేదు. ప్రైవేటీకరణతో రిజర్వేషన్ వ్యవస్థకు గండిపడుతున్నది. ప్రభుత్వాలు ప్రజలను ఉచితాలతో మభ్యపెడుతున్నారు తప్ప, సాధికారత వైపు తీసుకపోవడం లేదు. ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉచితాలు కాదు ప్రజలకు ఉపాధి కల్పించి సాధికారత వైపు నడిపించాలని పేర్కొన్నది.
దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకు సమానత్వానికి ఆమడ దూరంలోనే ఉన్నారు. ఆనాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయకోసం చేసిన పోరాటం కోట్లాది ప్రజల విముక్తికి దారితీసింది. ఇప్పటికీ సామాజిక న్యాయం కోసం అనేక ఉద్యమాలు వస్తున్నాయి. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తమ వాటాకోసం దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు వీటిని గుర్తించి న్యాయం చేసినప్పుడే ప్రజల జీవితంలో మార్పు వస్తుంది.
రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి
పౌరులందరికీ సమాన అవకాశాలు అందాలని ఉద్ఘాటిస్తూ భారత రాజ్యాంగం సామాజిక న్యాయానికి పట్టం కట్టింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయి. విద్య, ఉద్యోగాల్లో బడుగు, వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం 1989 సామాజిక న్యాయ సాధనకు గొప్ప పునాది. మహిళలు, బాలలు, వృద్ధులు, వికలాంగుల సంరక్షణకు అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇవి క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో అమలుకు నోచుకోవడం లేదు. బాలలకు ఉచిత విద్యను అందించటానికి విద్యాహక్కు చట్టం (2009) సైతం సామాజిక న్యాయ సాధనలో భాగమే.
సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు 25శాతం సీట్లు కేటాయించాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది. కానీ, అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అసమానతలకు తావు లేకుండా చూడాలి. సంపన్నుల సంపదపై కన్నా, సామాన్య, మధ్యతరగతి వర్గాల ఆదాయంపై ఎక్కువగా పన్నులు విధించడం సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం.
పన్ను విధింపులో పేదలను తప్పించాలి. విద్య, వైద్య సౌకర్యాలు విస్తరించి పేద, అణగారిన వర్గాలు, స్త్రీల, బాలల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేయాలి. బడ్జెట్లో వైద్యంపై 3 శాతం, విద్యకు 6 శాతం నిధులను కేటాయించాలి. శాసన, కార్యనిర్వహణ, న్యాయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడం అత్యావశ్యకం. కోర్టులు ఇచ్చే తీర్పులు, శాసన వ్యవస్థ చేసే చట్టాలు సామాజిక న్యాయానికి చోదక శక్తులు కావాలి. వాటిని పకడ్బందీగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వ వ్యవస్థ తీసుకోవాలి. ఆధునిక అవసరాలకు అనుగుణమైన సామాజిక న్యాయ విధానాలను అమలు చేయాలి. అప్పుడే సమానత్వానికి బాటలు పడతాయి.
పెరుగుతున్న సామాజిక అసమానతలు
భారత్‌లోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒకశాతం ధనవంతుల దగ్గరే ఉందని ప్రముఖ ప్రముఖ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరిట వెలువడిన నివేదిక తెలిపింది. అట్టడుగున ఉన్న సగం జనాభా వద్ద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందని చెబుతూ ఆర్థిక అసమానతలను ఈ నివేదిక స్పష్టం చేసింది. భారతదేశంలో ఆనాదిగా పాతుకుపోయిన కుల వ్యవస్థ, అస్పృశ్యత, అంటరానితనం వలన బడుగు, బలహీన వర్గాలు వివక్షకు గురైనారు.
సమాజంలో కుల వివక్ష పూర్తిగా సమసిపోవడం లేదు. నేటికీ దళితులు అవమానాలు ఎదుర్కొంటున్న సందర్భాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గణాంకాల ప్రకారం పారిశుద్ధ్య కార్మిక వృత్తిలోనే 68.9 శాతం దళితులు కొనసాగుతున్నారు. జైల్లో కూడా కుల వివక్ష కొనసాగుతోందని ఇటీవల సుప్రీంకోర్టు తప్పుపట్టింది. షెడ్యూల్డ్ కులాల ఖైదీలతో పారిశుద్ధ్య పనులైన మరుగుదొడ్లు కడిగించడం వంటి అవమానకరమైన పనులు చేయించడం, ఉన్నత కులాల ఖైదీలకు సులభమైన పనులు అప్పగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- సంపతి రమేష్ మహారాజ్ సోషల్ ఎనలిస్ట్