![సోషల్ స్టార్ ఎన్టీఆర్..](https://static.v6velugu.com/uploads/2023/05/special-story-on-SR-NTR_YHwhKSxyoj.jpg)
ఒక పేరు కాదు.. ప్రభంజనం. మహానటునిగా వెండితెరపై వెలిగిన నట సార్వభౌముడు...అన్నగా జనం మదిలో నిలిచిన ఘనుడు...తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఓ అద్భుతం. రాజకీయాల్లోనూ ఓ అరుదైన సంచలనం. ఆయన నటన స్ఫూర్తిదాయకం.. ఆయన నడత మార్గదర్శకం. ఆయన సాధించిన కీర్తి అజరామరం. ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఆ మహానటుడిని గుర్తు చేసుకుంటూ.. తెలుగు చలనచిత్ర రంగంలోనూ, రాజకీయాల్లోనూ చెరిగిపోని సంతకం ఎన్టీఆర్. నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని మకుటం లేని మహారాజుగా పాలించి, పుష్కరకాలం తెలుగు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఎన్టీఆర్.. ఎంతోమందికి ఆరాధ్య నటుడు, అభిమాన నాయకుడు. రాజకీయాల్లో ఆయన్ను విభేదించిన వారు కూడా, ఆయన అద్భుత నటనకు, మహోన్నత వ్యక్తిత్వానికి అభిమానులే. ఓ సాధారణ రైతుబిడ్డ సినీ, రాజకీయరంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.
ఎన్టీఆర్ అనగానే ఆయన పోషించిన రాముడు, కృష్ణుడు పాత్రలు గుర్తొస్తాయి. అయితే, ఎన్నో సాంఘిక చిత్రాల్లో సామాన్యుడికి అండగా ఉండే పాత్రలు పోషించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆ ఒరవడిని కొనసాగిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలతో అసలు సిసలు ‘సోషల్ స్టార్’గా వెలుగొందారు. మూడు వందలకు పైగా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండె చప్పుడులా ఆయన ప్రతిధ్వనించారు. రాముడిగా, కృష్ణుడిగా, నటసార్వభౌముడిగా వెండితెరకు సొగసులద్దారు ఎన్టీఆర్. కథానాయకుడిగా ఎన్టీఆర్ చేయని పాత్ర అంటూ లేదు. అన్నిరకాల పాత్రలు పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆయన టచ్ చేయని జానర్ లేదు. పోషించని పాత్ర లేదు.
1950లో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చే సమయానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కువగా సాంఘిక చిత్రాల వైపు వెళ్తోంది. ఆయన తొలిచిత్రం ‘మనదేశం’తో పాటు ఫస్ట్ హీరోగా నటించిన ‘షావుకారు’ సినిమా సాంఘిక చిత్రమే. సాంఘిక చిత్రాల హీరోగా ఎన్టీఆర్‌ను నిలబెట్టిన చిత్రం 1952లో వచ్చిన ‘పెళ్లి చేసి చూడు’. హాస్య ప్రధాన చిత్రాల్లో ఇది ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 1962లో వచ్చిన రక్తసంబంధం, గుడిగంటలు (1964) చిత్రాలు ఎన్టీఆర్ స్థానాన్ని మరింత పదిలం చేశాయి. ఆయన నటించిన సాంఘిక చిత్రాలలో సామాజిక ఇతివృత్తంతో వచ్చినవే ఎక్కువ. ప్రజలకు అండగా నిలిచి, సామాన్యులకు అన్యాయం చేసే ధనిక వర్గాన్ని, పాలకులను ప్రశ్నించడం, వాళ్లకు బుద్ధి చెప్పడం వంటి కథలతో ఎక్కువ సినిమాలు వచ్చాయి. నూట ఎనభైకి పైగా సోషల్ డ్రామాస్ చేశారు ఎన్టీఆర్. డాక్టర్ నుంచి డ్రైవర్ వరకు, పోలీస్ నుంచి జడ్జి వరకు, రైతు నుంచి బడిపంతులు వరకు రకరకాల వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్‌తో ప్రేక్షకుల్ని కట్టి పడేసేవారు.
సంవత్సరానికి కనీసం పది చిత్రాల చొప్పున తొలి ఇరవయ్యేళ్లలోనే రెండొందల వరకు సినిమాలు చేశారు. అడవి రాముడు, యమగోల, వేటగాడు, రాముడు భీముడు లాంటి ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్ లాంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో కొన్ని మైలు రాళ్లు. తెలుగులో ఫస్ట్ సోషియో ఫాంటసీ మూవీగా ఎన్టీఆర్ నటించిన ‘దేవాంతకుడు’ 1960లో వచ్చింది. తెలుగులో సక్సెస్ సాధించిన ఫస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ ‘లక్షాధికారి’లోనూ ఎన్టీఆరే హీరో. అలాగే మొదటి తెలుగు సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా ‘దొరికితే దొంగలు’ నిలిచింది. ‘సూపర్ మేన్’ అనే సూపర్ హీరో సినిమాలోనూ నటించారు ఎన్టీఆర్. ఇలా సోషల్ మూవీస్‌లోనూ పలు జానర్స్ టచ్ చేశారు రామారావు. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ఏడాది పాటు ఆడిన చిత్రాలు ఇరవై మూడు వరకు ఉన్నాయి.
మారువేషాల సరదా
తను నటించే సినిమాల్లో మారు వేషాలు వేయాలనే సరదా ఎన్టీఆర్‌కు ఉండేది. అందుకే సినిమా ఏ జానర్ అయినా అందులో కనీసం ఒకటి, రెండు మారువేషాలైనా ఎన్టీఆర్ వేసేవారు. అలాంటి సీన్స్ రాయమని రచయితలకు ప్రత్యేకంగా చెప్పేవారు. అందుకు కారణం లేకపోలేదు. ఆ సీన్స్‌ను ప్రేక్షకులు ఎక్కువ ఎంజాయ్ చేసేవారు.అవేకాదు.. థియేటర్స్‌లో ఈలలు, చప్పట్లతో మాస్ ఆడియన్స్‌ను మెప్పించే సీన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునేవారు ఎన్టీఆర్. ఆయన ఎక్కువ మారువేషాలు వేసిన సినిమా ‘వేములవాడ భీమకవి’.
రౌద్రమే కాదు.. సాత్వికత కూడా
కథకు అవసరమైనా, అవసరం లేకున్నా ఎవరితోనైనా ఆయన ఫైట్ చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాలను ఇష్టపడేవారు. కానీ ఎన్టీఆర్ ఏడిపిస్తే ప్రేక్షకులు చూడరు అనేది కొందరు దర్శకుల అభిప్రాయం. అది నిజమేనన్నట్టు వివాహబంధం, సంగీత లక్ష్మి, డాక్టర్ ఆనంద్, నిర్దోషి లాంటి చిత్రాల్లో ఎన్టీఆర్ సాత్విక పాత్రలు పోషిస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. అయినప్పటికీ మాస్ ఆడియెన్స్ మెచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో నటిస్తూనే మరోవైపు తన మనసుకు నచ్చిన సాత్విక పాత్రలతోనూ మెప్పించారు. రక్తసంబంధం, గుడిగంటలు, బడిపంతులు లాంటి సాంఘిక చిత్రాలతో పాటు ‘భీష్మ’ లాంటి పౌరాణిక పాత్రలు, తెనాలి రామకృష్ణ, పల్నాటి యుద్ధం, బొబ్బిలియుద్ధం లాంటి చారిత్రక చిత్రాల్లో రాజదర్పం, హుందాతనం చూపిస్తూనే సాత్వికతను చూపించారు. రాముడు, కృష్ణుడు పాత్రల్లోనూ ఎంతో సాత్వికతను చూపించారు.
ఒక్కడు కాదు.. ఇద్దరు
తన కెరీర్‌లో ముప్పై సార్లకు పైగా డ్యూయెల్ రోల్‌లో కనిపించి అలరించారు ఎన్టీఆర్. ఆయనకంటే ముందు భానుమతి, ఏఎన్నార్ లాంటివారు డ్యూయెల్ రోల్ చేసినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. అయితే 1964లో వచ్చిన ‘రాముడు -భీముడు’ చిత్రం సూపర్ సక్సెస్ సాధించి, ఈ తరహా చిత్రాలకు క్రేజ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత చాలామంది హీరోలు తెరపై రెండు పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే తెలుగు సినిమాల్లో ఎక్కువ సార్లు డ్యూయెల్ రోల్ చేసిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే సొంతం. ఆయన తర్వాత శోభన్‌బాబు ఎక్కువ డ్యూయెల్ రోల్స్ చేశారు.
జానపదాల్లో జగదేకవీరుడు
కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ సోషల్ డ్రామాలకు పర్ఫెక్ట్ యాప్ట్ అనుకున్నారంతా. అయితే ఎన్టీఆర్‌తో కేవీ రెడ్డి తీసిన ‘పాతాళ భైరవి’ ఆ అభిప్రాయాన్ని మార్చి, జానపద చిత్రాల హీరోగానూ ఎన్టీఆర్‌ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. దీంతో జానపద చిత్రాల్లో హీరో అంటే తోటరాముడిలా ఉండాలనే భావన ప్రేక్షకులకు ఏర్పడింది. కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవడానికి జానపద చిత్రాలు ఎన్టీఆర్‌కి ఎంతో హెల్పయ్యాయి. జయసింహ, జగదేకవీరుని కథ, పల్లెటూరి పిల్ల, బాలనాగమ్మ, భట్టి విక్రమార్క, అలీబాబా నలభై దొంగలు, గులేబకావళి కథ, చిక్కడు- దొరకడు, ఏకవీర, రాజమకుటం, మంగమ్మ శపథం, గోపాలుడు భూపాలుడు, కంచుకోట, గండికోట రహస్యం, బందిపోటు లాంటి యాభైకి పైగా జానపద చిత్రాల్లో ఆయన నటించారు.అక్కినేని నాగేశ్వరరావు కూడా ఆ తరహా సినిమాలు తగ్గించడంతో అత్యధిక జానపద చిత్రాలు చేసిన హీరో అయ్యారు ఎన్టీఆర్. ఆయన తర్వాత ఆ ఘనత కాంతారావుకు దక్కింది.
రాముడైనా.. కృష్ణుడైనా
పౌరాణిక చిత్రాలు అనగానే అందరినీ ఆకట్టుకోగల రూపం, మెప్పించగల నట ప్రావీణ్యం, వాక్చాతుర్యం ఉండాలి. అవన్నీ మెండుగా ఉన్నాయి కనుకే ఎన్నో పౌరాణిక పాత్రలతో తెలుగువారి మనసుల్లో ఆరాధ్య దైవంగా నిలిచారు ఎన్టీఆర్. ఆయన పోషిస్తే ఆ పాత్రకే నిండుదనం వచ్చేది. సాంఘిక చిత్రమైన ‘ఇద్దరు పెళ్లాలు’లో మొదటిసారి కృష్ణుడిగా నటించారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయిలో కృష్ణుడిగా నటించిన చిత్రం ‘మాయాబజార్’ (1956). పౌరాణికాలకు కాలం చెల్లిందనుకుంటున్న సమయంలో ఈ సినిమా తీశారు కేవీ రెడ్డి. ఇందులో తొలిసారి కృష్ణుడిగా నటించారు ఎన్టీఆర్. కృష్ణుడంటే రామారావే అనేంతగా ఆయన మెప్పించారు. ఆ పాత్రను అంతలా తీర్చిదిద్దారు కేవీ రెడ్డి. ఆ తర్వాత శ్రీకృష్ణుడి పాత్రను దాదాపు 25 సార్లు ఎన్టీఆర్ పోషించడం విశేషం. దాదాపు 17 సార్లు పౌరాణికాల్లో ఆ పాత్ర ధరించిన ఆయన, జానపద, సాంఘిక చిత్రాల్లోనూ కృష్ణుడిగా కనిపించారు.
ఇంతవరకూ ఏ నటుడూ తెరపై ఓ పౌరాణిక పాత్రను ఇన్నిసార్లు పోషించింది లేదు. అందుకే కృష్ణుడు అనగానే సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ అందరికీ ఎన్టీఆర్ గుర్తొస్తారు. అలాగే ‘చరణదాసి’ అనే సాంఘిక చిత్రంలో మొదటిసారి రాముడిగా కనిపించిన ఎన్టీఆర్, పూర్తి స్థాయి రాముడిగా కనిపించింది మాత్రం 1958లో వచ్చిన తమిళ చిత్రం ‘సంపూర్ణ రామాయణం’లో. అయితే 1963లో వచ్చిన ‘లవకుశ’ చిత్రం రాముడిగా ఎన్టీఆర్‌కి ఎనలేని కీర్తిప్రతిష్ఠల్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘రామాంజనేయ యుద్ధం’ లాంటి చిత్రాల్లో రాముడిగా కనిపించడంతో పాటు, ‘శ్రీరామ పట్టాభిషేకం’లో రాముడి పాత్ర పోషిస్తూ ఆయనే డైరెక్ట్ చేశారు. ఇక వేంకటేశ్వరస్వామి మహత్యం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం సినిమాల్లో వేంకటేశ్వరుడిగానూ మెప్పించారు. ఇక ‘రాముడు’ అనే పేరు కలిసొచ్చేలా శభాష్ రాముడు, టైగర్ రాముడు లాంటి పదిహేను సినిమాలు చేశారు ఎన్టీఆర్.
దేవుడైనా.. దుష్టుడైనా
ఏ పౌరాణిక పాత్ర పోషించినా అందులో ఎన్టీఆర్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలు విశేషాదరణ పొందాయి. అత్యధిక పౌరాణిక చిత్రాలలో నటించిన నటునిగానూ ఆయన రికార్డు సృష్టించారు. అందులో రాముడు, కృష్ణుడు లాంటి పురాణ పురుషులే కాకుండా దుష్ట పాత్రలతోనూ తనదైన ముద్ర వేశారు ఎన్టీఆర్. ‘భూకైలాస్’ చిత్రంలో రావణబ్రహ్మగా ఆయన నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తూ, ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేసిన ‘సీతారామకళ్యాణం’లోనూ రావణుడిగా మెప్పించారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘శ్రీకృష్ణ పాండవీయం’లో కృష్ణుడిగానే కాక దుర్యోధనుడిగానూ నటించారు. ఇక ‘దానవీరశూరకర్ణ’లో మూడు పాత్రలు, ‘శ్రీమద్విరాటపర్వము’లో ఐదు పాత్రలు చేస్తూ దర్శకత్వం వహించిన ఘనత ఆయనకే సొంతం. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో నటించారు. ఇలా దాదాపు నలభై ఎనిమిది పౌరాణిక చిత్రాల్లో ఆయన నటించారు. వీటిలో ఎక్కువశాతం విజయాలే.
చరిత్ర చూపించాలని..
జానపద, పౌరాణిక చిత్రాలతో పాటు హిస్టారికల్ సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ ఎంతో ఆసక్తి చూపించేవారు. సామ్రాట్ అశోక, అక్బర్ సలీమ్ అనార్కలి, వేములవాడ భీమకవి, చాణక్య చంద్రగుప్త లాంటి చారిత్రక చిత్రాల్లో ఆయా వ్యక్తుల పాత్రలకు ప్రాణం పోశారు. ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’లో టైటిల్ రోల్‌తో పాటు గౌతమ బుద్ధుడు, ఆదిశంకరుడు, రామానుజం, వేమన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేశారు. చివరిచిత్రం ‘మేజర్ చంద్రకాంత్’లోని ‘పుణ్యభూమి నా దేశం’ పాటలో కూడా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, వీరపాండ్య కట్టబ్రహ్మన, శివాజీ పాత్రల్లో ఆయన సింహంలా గర్జిస్తుంటే థియేటర్లు చప్పట్లతో మార్మోగాయి. తన కెరీర్‌లో పదిహేనుకు పైగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాల్లో నటించారు రామారావు. వాటిలో ఎక్కువ సినిమాలకు ఆయనే నిర్మాత. కొన్నింటిని స్వయంగా డైరెక్ట్ చేశారు.
మహోన్నత వ్యక్తిత్వం
నాటకాల్లో వేషాలు వేయడం మొదలు, రాజకీయ నేతగా తన చివరి శ్వాస వదిలే వరకూ అలుపెరుగని పోరాటం చేశారు ఎన్టీఆర్. తన లక్ష్య సాధన కోసం ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ పోరాట పటిమను చూపారు. అదే ఆయన్ని అసాధారణ వ్యక్తిగా, మహోన్నతుడిగా నిలబెట్టింది. చాలామంది ఆయన్ని ఆవేశపరుడని అనేవారు. అంతే మొండితనం కూడా ఆయన సొంతం. ఒక మాట ఇస్తే దానికి తిరుగుండేది కాదు. ఆరునూరైనా దాన్ని అమలు చేసేవారు. అందుకోసం అహోరాత్రులు శ్రమించడం ఆయనకు అలవాటు. ఇక క్రమశిక్షణ, నియమనిష్ఠలు అనేవి ఆయన జీవితంతో మమేకమయ్యాయి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అన్నట్టుగా ఒక లక్ష్యం, ధ్యేయం, ఆదర్శం ఉంటే సాధించలేనిది ఏదీ లేదని చెప్పడానికి ఆయన జీవితమే నిదర్శనం.
కృషి, పట్టుదల, పోరాట పటిమతో తెలుగు వారి అభిమాన కథానాయకుడు అయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా మారి బహుముఖ ప్రజ్ఞతో మెప్పించారు. అరవై ఏళ్ల వయసులో పార్టీ ప్రచార పగ్గాలందుకుని ఎండ, వానలను లక్ష్యపెట్టకుండా ముప్ఫై ఐదువేల కిలోమీటర్లు ఊరూరా తిరుగుతూ తన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేశారు. ఎన్నో ఏళ్ల సినిమా జీవితం ఓ ఎత్తయితే.. రాజకీయ పార్టీ ఆరంభించి, కొద్ది నెలల్లోనే దాన్ని రూలింగ్ పార్టీగా నిలపడానికి చేసిన కృషి మరో ఎత్తు. అందుకే ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా, అనుకున్నదే తడవుగా పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికార పీఠాన్ని అధిష్టించగలిగారు.
తన చిత్రాల ద్వారా చిత్రసీమకు పరిచయం అయిన వారిని ప్రోత్సహించడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుండేవారు. వాళ్లకు ఏమైనా ఇబ్బందులు కలిగిన సమయంలో తానే ముందుండి చేయూత నిచ్చేవారు. అలా ఆయన ఆదుకున్న వారిలో శోభన్ బాబు, సత్యనారాయణ, చలపతిరావు లాంటి నటులను, దేవిక, బి.సరోజాదేవి, కె.ఆర్.విజయ లాంటి హీరోయిన్స్‌ను ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. అయితే వాళ్లు స్టార్స్‌గా బిజీగా ఉన్న రోజుల్లో మాత్రం వారి డేట్స్ అడిగేవారు కాదు. నటునిగా ఎప్పుడు ప్రయోగాలు చేయాలనుకు న్నా తన సొంత చిత్రాలలోనే చేసేవారు ఎన్టీఆర్. ఇతర నిర్మాతలు కోరినా ప్రయోగాలు వికటిస్తే నిర్మాతలు నష్టపోతారని వద్దని వారించేవారు. అందుకే త్రిబుల్ రోల్ చేసిన కులగౌరవం, దానవీరశూరకర్ణ, ఐదు పాత్రలు పోషించిన ‘శ్రీమద్విరాట పర్వము’ సొంతంగా నిర్మించారు.
అలాగే ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ‘బ్రహ్మంగారి చరిత్ర’ను కూడా ఆయనే నిర్మించారు. తొలి తెలుగు రంగుల చిత్రమైన ‘లవకుశ’ (1963) భారీ విజయం సాధించడంతో ఆ తర్వాత ఎన్టీఆర్‌తో కలర్‌లో సినిమాలు తీయాలని చాలామంది నిర్మాతలు ముందుకొచ్చారు. అయితే అప్పట్లో కలర్ ముడి ఫిలిమ్ సంపాదించడం కష్టం. పైగా దానివల్ల సినిమా బడ్జెట్ పెరిగేది. దాంతో నిర్మాతల మేలు కోరి మరో పదేళ్లపాటు బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోనే నటించారు ఎన్టీఆర్. తన సొంత సంస్థలో మాత్రం ‘శ్రీకృష్ణ సత్య’ అనే కలర్ మూవీ చేశారు. ఇక తన ఫస్ట్ సోషల్ కలర్ మూవీ ‘దేశోద్ధారకులు’ (1973) సక్సెస్ తర్వాత కలర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అప్పటికే నాలుగుసార్లు విరిగిన చేతికి ‘సర్దార్ పాపారాయుడు’ మూవీ షూటింగ్‌లో మరోసారి గాయమైంది. ఆ కట్టుతోనే ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత అలాంటిది. అలాగే నిర్మాతల శ్రేయస్సు కోసం తనకు 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఏడాదికి ఐదు నుండి ఏడు చిత్రాల్లో నటిస్తూనే సాగారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోకుండా తన సొంత వనరులతో స్టూడియోను, సినిమా థియేటర్లను నిర్మించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో పాలిటిక్స్‌లోనూ సినీతారలకు విలువ పెరిగింది. రాజకీయాల్లోకి రావాలనుకున్న ఎంతోమంది సినీతారలకు ఆయన స్ఫూర్తి.
రికార్డుల రారాజు
ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ చెరిగిపోని, తరిగిపోని రికార్డులెన్నో నెలకొల్పారు ఎన్టీఆర్. అయితే ఆయనెప్పుడూ రికార్డుల వెంటపడలేదు. తన దగ్గరకు వచ్చిన పాత్రలు చేశారు. అరుదైన రికార్డులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. దేశంలోనే 100 చిత్రాలు పూర్తిచేసుకున్న ఫస్ట్ హీరోగా నిలిచారు ఎన్టీఆర్. అలాగే 200 చిత్రాల్లో నటించిన మొదటి హీరో కూడా ఆయనే. ఇక తెలుగులో 300 చిత్రాల మైలురాయి దాటిన ఫస్ట్ హీరో కూడా ఎన్టీఆరే. ఆయన 100వ చిత్రమైన ‘గుండమ్మకథ’ (1962), 200వ చిత్రమైన ‘కోడలు దిద్దిన కాపురం’ (1970), 300వ చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ భారీ విజయాలను అందుకున్నాయి. 1964లో 18 చిత్రాలలో నటించి అప్పట్లో అరుదైన రికార్డు నమోదు చేశారు. అందులో పదికిపైగా కాస్ట్యూమ్ డ్రామాస్ కావడం విశేషం.
మూడు భాషల్లో గోల్డెన్ జూబ్లీ
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గోల్డెన్ జూబ్లీస్ చూసిన నటుడిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు, బొబ్బిలిపులి చిత్రాలు గోల్డెన్ జూబ్లీ ఆడాయి. అలాగే తమిళంలో ఎన్టీఆర్ శ్రీరామునిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ (1958) సినిమా డైరెక్ట్ గా 264 రోజులు ఆడింది. ఆ తర్వాత 101 రోజులు ప్రదర్శితమైంది. అలా మొత్తం 365 డేస్ పూర్తి చేసుకొని గోల్డెన్ జూబ్లీ చూసింది. ఎన్టీఆర్ హిందీలో నటించిన ‘నయా ఆద్మీ’ (1956) కూడా నలభై రెండు వారాలు డైరెక్ట్‌గా ఆడి, ఆ తర్వాత షిఫ్ట్‌పై గోల్డెన్ జూబ్లీ చూసింది.
తొమ్మిది నెలలకే..
1983 జనవరి 9... హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం.. రాష్ట్ర వ్యాప్తంగా కదలివచ్చిన అశేష జనవాహిని మధ్య ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ నెలకొల్పిన తొమ్మిది నెలల వ్యవధిలో 200 పైగా సీట్లు సాధించి.. ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి కావడమనేది ఓ చరిత్ర. ఇది జరిగి 40 ఏళ్లవుతోంది. ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ అది చెరిగిపోని రికార్డు. తల పండిన రాజకీయ నేతలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన రోజు అది. రాజకీయాల్లో ఎన్టీఆర్ మహోన్నత ఘనతకు ఇది ఓ మచ్చుతునక. ఎన్టీఆర్ కంటే ముందు కూడా కొందరు నటీనటులు రాజకీయాల్లో ఉన్నారు. కానీ వాళ్లంతా ఏదో విధంగా ముందు నుంచీ రాజకీయాలతో అనుబంధం ఉన్నవారే. ఏ పార్టీతో అనుబంధం లేకుండా, సొంత పార్టీ నెలకొల్పి, తక్కువ కాలంలో తన పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనుడు ఎన్టీఆర్ మాత్రమే.
జననేతగా జనం జేజేలు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు.. తన పరిపాలనాదక్షత, ప్రవేశపెట్టిన పథకాలు, ప్రవర్తించిన తీరుతో జననేతగా ప్రజలు ఆయనకు జేజేలు పలికారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అరుదైన అవకాశం ఆయనకే దక్కింది. హార్ట్ ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో (1984 ఆగస్టు 15న) ఆయన్ను బర్తరఫ్ చేసి, నాదెండ్ల భాస్కరరావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ రామ్ లాల్. ప్రజాబలంతో కేవలం నెలరోజుల వ్యవధిలోనే నాదెండ్లను గద్దె దింపి, 1984 సెప్టెంబర్ 16న మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఎన్టీఆర్. బర్తరఫ్ అయిన ఓ ముఖ్యమంత్రి కేవలం నెలరోజుల్లో మళ్లీ సీఎం కావడం ఇదే మొదటిసారి. ఇదే ఏడాది క్యాన్సర్ కారణంగా ఎన్టీఆర్ భార్య బసవతారకం కన్నుమూశారు. ఇది ఎన్టీఆర్ జీవితంలో పెను విషాదం.
వరుసగా మూడుసార్లు సీఎంగా..
1984లో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశమంతటా కాంగ్రెస్ గాలి వీచింది. నాలుగు వందలకు పైగా ఎంపీ సీట్లతో రికార్డు సృష్టించింది. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుండి 33 స్థానాలకు పోటీ చేసి, 30 ఎంపీ సీట్లను టీడీపీ కైవసం చేసుకుని పార్లమెంట్‌లో ప్రతిపక్షంగా వ్యవహరించింది. దేశ రాజకీయ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘటన. ఆపై అసెంబ్లీని రద్దు చేసి 1985లో మార్చిలో ఎన్నికలకు వెళ్ళారు ఎన్టీఆర్. మళ్ళీ 200కు పైగా సీట్లు సాధించి మార్చి 9న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేసిన ఘనత తెలుగులో ఒక్క ఎన్టీఆర్‌కే దక్కింది.
కేంద్ర రాజకీయాల్లోనూ..
1989 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమయ్యారు ఎన్టీఆర్. దీంతో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తొలిసారి ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే కేంద్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా.. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1993లో ఆయన నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ విడుదల కాగా, ఈ మూవీ విజయోత్సవ సభలో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. 1994 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి 219 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. 26 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. డిసెంబర్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాతి ఏడాది ఆగస్టు సంక్షోభంతో ఎన్టీఆర్ పదవిని కోల్పోయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1996 జనవరి 18న ఎన్టీఆర్ కన్నుమూశారు. ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ గెలిచిన ప్రతీసారి 200కు పైగా సీట్లు సాధించడం విశేషం.
సంక్షేమ పథకాలు
ఎన్టీఆర్ పరిపాలన అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తొలి నాయకుడు ఎన్టీఆర్. ఆయన పాలనా కాలంలో తీసుకొచ్చిన కొన్ని పథకాలు..
2 రూపాయలకే కేజీ బియ్యం: 1983లో ఆయన అధికారంలోకి రాగానే... పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మెచ్చుకుంది.
పటేల్ పట్వారీ విధానం రద్దు: తెలంగాణలోని గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకొని రైతులను దోచుకున్న పటేల్, పట్వారీల అధికారాలను తొలగించారు.
బుద్ధ విగ్రహం: నెక్లెస్ రోడ్డు చుట్టూ విగ్రహాలను ఏర్పాటు చేయించింది కూడా ఆయనే. హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేయించారు.
5 లక్షల ఇండ్లు: ఎన్టీఆర్ అధికారంలో ఉన్న టైంలో పేదల కోసం దాదాపు 5 లక్షల ఇండ్లు కట్టించారు.
శాసన మండలి రద్దు: శాసనమండలిని నడిపించడం ప్రభుత్వానికి అనవసరమైన ఖర్చు అని భావించి, దాన్ని రద్దు చేశారు.
మధ్యాహ్న భోజనం: రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంచాలనే ఉద్దేశంతో, పేద విద్యార్థులను స్కూళ్లకు రప్పించాలని మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు.
వీటితోపాటు దేశంలోనే తొలిసారిగా వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. దేశంలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు, ఆస్తి హక్కు కల్పించిన తొలి నాయకుడు ఎన్టీఆర్. 72 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 64 సంస్థలను లాభాల బాటలో నడపగలిగారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యాన్నదానం ప్రారంభించింది కూడా ఆయనే.
తెలుగు భాషకు..
తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావడంలో విశేష కృషి చేశారు ఎన్టీఆర్. తెలుగుభాషాభివృద్ధి కోసం తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించడంతో పాటు ప్రభుత్వ జీవోలన్నీ తెలుగులోనే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే నామఫలకాలన్నీ తెలుగులోనే రాయించడం వెనుక ఎన్టీఆర్ కృషి ఎంతో ఉంది.
విద్యారంగంలో తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు మహిళా విశ్వవిద్యాలయం, వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం లాంటివి దేశంలోనే తొలిసారిగా నెలకొల్పారు ఎన్టీఆర్. అలాగే బాపు–రమణలతో దృశ్యశ్రవణ విద్యా విధానం కూడా ఏర్పాటు చేశారు.
మహానుభావుడు
నందమూరి తారక రామారావు తెలుగు వాడి ఆత్మగౌరవ ప్రతీక. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుమూల అటవీ గ్రామాల పర్యటన చేశారు. అందులో భాగంగానే 1987లో అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ( ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా) మహాముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామానికి వచ్చారు. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్న. ఆయన్ను చూడడానికి నా ఫ్రెండ్స్‌తో కలిసి ఎర్రబస్సులో వెళ్లాం. ఆ మీటింగ్‌లో ఎన్టీఆర్‌ను దగ్గరి నుంచి చూసే అదృష్టం దక్కింది. ఆయన అటవీ గ్రామాల పర్యటన తర్వాత మా ప్రాంతంలో ఎర్రమొరం రోడ్లు వేయించారు.
కరెంట్ లైన్లు వేశారు. తాగు, సాగునీటి బోర్లు వేశారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, శ్రీకృష్ణ దేవరాయలు పాత్రలు నాకు బాగా ఇష్టం. మా కుల దైవం పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలా నటించి మాకు స్వామి వారి నిజదర్శనం అయ్యేటట్టు చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం, అభిమానం. అప్పటి నుండి నేటివరకు అన్న స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నందుకు గర్వంగా ఉంది.
అందె భాస్కరాచారి, మహాముత్తారం, జయశంకర్-భూపాలపల్లి జిల్లా
16 ఏండ్లప్పుడే.. అభిమానిగా మారా
నాకు 16 ఏండ్లు ఉన్నప్పుడు 1988–1990 సమయంలో ఎన్టీఆర్ అభిమానిగా మారిపోయా. అప్పట్లో ఆయన సిద్ధాంతం, ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు నన్ను టీడీపీ, ఎన్టీఆర్ వైపు ఆకర్షించాయి. సామాన్యులు, మహిళలు కూడా రాజకీయాల్లోకి రావడం ఆయన హయాంలోనే జరిగింది. ఆ రోజుల్లో 2 రూపాయలకు కిలో బియ్యం పథకం మరువలేనిది. పురుషులతో సమానంగా ఆడబిడ్డకు ఆస్తి హక్కు చట్టం తెచ్చారు. తన ఇంట్లో అమలు పరిచారు. ఇప్పుడు అది ఎందరో ఆడబిడ్డలకు ఒక ఆసరాగా, వరంగా మారింది. అప్పట్లో మూడు.. నాలుగు సార్లు వెళ్లి కలిశా. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందా. ఎన్టీఆర్ చనిపోయాక చంద్రబాబు హయాంలోనూ ఎన్టీఆర్ అభిమానిగానే ఉన్నా. ఏనాడూ ఎన్టీఆర్‌ని విమర్శించలేదు. నా ముందు ఎవరైనా విమర్శిస్తే ఊరుకోలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే హనుమకొండ చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మ దహనం చేశాను.
కానీ.. ఎన్టీఆర్‌ని ఒక్క మాట అనలేదు. నా చుట్టూరా ఉన్నవాళ్లని కూడా అననివ్వలేదు. దాదాపు 35 ఏండ్లుగా ఆయన చూపిన బాటలో నడిచే ప్రయత్నమే చేస్తున్నా. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, లేకున్నా.. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం లేకున్నా.. నేను ఎన్టీఆర్ అభిమానిగా, టీడీపీ కార్యకర్తగానే ఉన్నా. వరంగల్, హన్మకొండ నుంచి నాడు టీడీపీలో పనిచేసి.. ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న ఎందరో లీడర్లు నన్ను పార్టీ మారమంటే కూడా ఎన్టీఆర్‌పై అభిమానంతో మారలేదు. టీడీపీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా సొంతంగా ఏటా పెద్దాయన జయంతి, వర్ధంతి నిర్వహిస్తున్నా. ఉన్నన్ని రోజులు ఎన్టీఆర్ అభిమానిగా ఆయన స్థాపించిన టీడీపీ పార్టీ నిజమైన కార్యకర్తగా నడుచుకుంటా.
చీకటి రాజు, హనుమకొండ సిటీ
గుండెల్లో ఉంటాడు
నేను చిన్ననాటి నుంచే ఎన్టీఆర్ అభిమానిని. నేను మొదట ఖానాపూర్‌లో ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించా.1982లో టీడీపీలో చేరా. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత శ్రీపతి రాజేశ్వర్‌తో కలిసి ఎన్టీఆర్‌ని కలిశా. ఆయన నా భుజంపై చేయి వేసి బ్రదర్ అని ఆప్యాయంగా పలకరించిన మాటలు ఎన్నటికీ మరచిపోలేను. ఎన్టీఆర్ సమక్షంలో నేను టీడీపీలో చేరడమే కాకుండా క్రియాశీలకంగా పనిచేశా. గండిపేటలో కూడా ఎన్టీఆర్ నాయకత్వంలో రాజకీయ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నా. ప్రతి రోజు ఉదయం ఆయన ఫొటో చూసిన తర్వాతే బయటకు వెళ్తా. నన్ను మా ఊరిలో చాలామంది ఎన్టీఆర్ అని పిలుస్తారు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రతి మే 28న ఎన్టీఆర్ జయంతి, జనవరి 18న వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తుంటా. రోగులకు పండ్లు, దుప్పట్లు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తుంటా. నేను బతికున్నంత కాలం ఎన్టీఆర్ రూపం నా గుండెల్లో భద్రంగా ఉంటుంది.
– కొండాజీ సాయి ప్రసాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు
నా కార్ లోనే తిప్పాను
ఎన్టీఆర్‌తో 1983 నుంచి పరిచయం ఉంది. 1985 ఎన్నికల్లో ఎన్టీఆర్‌తో కలిసి అప్పటి బుగ్గారం నియోజకవర్గంలో ప్రచారం చేశా. 1995 ఎన్నికల్లో ఎన్టీఆర్ అప్పటి మెట్పల్లి నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు నా మారుతి కారులోనే రెండు రోజులు గ్రామ గ్రామానికి తిప్పాను. మా ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. రేగుంట బాబు అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన హయాంలో మల్లాపూర్ మండలం టీడీపీ అధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్, సర్పంచ్‌గా పని చేశా. మండలంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరితే అప్పట్లో లక్షల్లో నిధులు మంజూరు చేశారు. బుగ్గారం, మెట్పల్లి నియోజకవర్గాల్లో ప్రచారం కోసం వస్తే నన్ను తప్పకుండా పిలిచేవారు. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ మనసులోనే ఉన్నాయి. ఎప్పటికీ చెదిరిపోవు.
– రంగు రామాగౌడ్ , రేగుంట, జగిత్యాల జిల్లా
::: రమేష్ బాబు పమ్మి వెలుగు నెట్వర్క్