“నాది బడి పలుకుల భాష కాదు… పలుకుబడుల భాష…..నా మాతృభాష తెలుగు” అని ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. ప్రజల కష్టాలను, వారు అనుభవిస్తున్న బాధలను తెలంగాణ పలుకుబడిలో ఆయన అద్భుతంగా చెప్పారు. తెలంగాణ పలుకుబడిని అంతగా ప్రేమించిన కాళోజి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాష ఒక కీలక పాత్ర పోషించింది. ఉద్యమ సందర్భంగా అచ్చమైన తెలంగాణ పలుకుబడిలో కేసీఆర్ చేసిన ప్రసంగాలు తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరచాయి. సీమాంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ పలుకుబడిలో ఎవరైనా మాట్లాడటానికి వెనకాముందు ఆడేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ భాషను ఓ ఆయుధంగా చేసుకుని కేసీఆర్ ఉద్యమంలోకి దిగారు. అడుగడుగునా తెలంగాణ భాషలో సాగే కేసీఆర్ ప్రసంగాలు తెలంగాణ ప్రజలను కట్టి పడేశాయి.
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ప్రధానంగా ఈ మూడు అంశాలపై తెలంగాణ ప్రజలు ఉద్యమించారు. ఈ మూడే కాదు తెలంగాణ ఉద్యమానికి బలమైన కల్చరల్ కోణం కూడా ఉంది. అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకున్న తెలంగాణ భాషకు , ఇతర సంప్రదాయాలకు సరైన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదన కూడా ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో తెలంగాణ భాషకున్న ప్రాధాన్యం ప్రత్యేకమైంది. సాహిత్యంతో పాటు సంస్కృతి, కళలు ప్రజలను ఒక వేదిక మీదకు తీసుకువచ్చాయి. ఉద్యమం వైపు నడిపించాయి. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఉపయోగపడ్డాయి. పల్లెల జనజీవితాన్ని ప్రతిబింబించిన తెలంగాణ ధూంధూంలను ఈ కోణంలో నుంచే చూడాలి.
తెలంగాణ భాషకు గొప్ప చరిత్ర
తెలంగాణ భాషది గొప్ప చరిత్ర. అది ఒక సహజమైన భాష. కృత్రిమత్వానికి ఎక్కడా చోటుండదు. వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా తెలంగాణ తెలుగు భాష వచ్చింది. తెలంగాణ మాటలతో ఎంతోమంది రచయితలు, కవులు గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు.
జనాన్ని ఏకం చేసిన పాట
తెలంగాణ ఉద్యమంలో జనాన్ని నడిపించినవాటిలో ‘పాట’ పాత్రను మరువలేం. తెలంగాణ యాసలో ‘వెనకాముందు చూసుడేంది రాజిగా, ఎత్తర తెలంగాణ జెండా’, ‘ వీరులారా వందనం….అమరవీరులారా వందనం’, ‘బొగ్గు దొవ్వి బొందలా గడ్డలు చేస్తే … బొంబాయి దుబాయి దారే మనకు మిగిలే’, వంటి పాటలు ప్రజలను ఉద్యమానికి దగ్గర చేశాయి. పాటలే తెలంగాణ ఉద్యమానికి ఆయుధాలయ్యాయి.
భాషకు ఐకాన్
తెలుగు సిన్మాలే కాదు మీడియాలోనూ ఆది నుంచి ఆంధ్ర ప్రాంతవాసులు మాట్లాడే తెలుగు భాష ఆధిపత్యమే కొనసాగింది. ఆంధ్ర భాషనే మీడియా భాషగా చలామణీ అయింది. 2012 లో ప్రారంభమైన వీ6 న్యూస్ చానెల్ దీనికి అడ్డుకట్ట వేసింది.తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో తొలిసారిగా తెలంగాణ పలుకుబడికి వీ6 పట్టం కట్టింది. ఈ చానెల్ లో ప్రతిరోజూ రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చే ‘ తీన్మార్ ’ న్యూస్ బులెటిన్ తెలంగాణ భాషకు ఐకాన్ అయింది. రోజువారీ జరిగే అనేక సంఘటనలపై ‘ తీన్మార్ ’ మన భాషలో వార్తలు చెప్పే ప్రత్యేకమైన బులెటిన్. ‘ తీన్మార్ ’ పాత్రలన్నీ అచ్చ తెలంగాణ భాషలోనే మాట్లాడుకుంటాయి. దీంతో ‘ తీన్మార్ ’ తెలంగాణ సమాజంలోకి దూసుకుపోయింది. అంతేకాదు ఇవాళ చాలా మంది గర్వంగా, ‘ఇదీ మన భాష’ అని ఆత్మగౌరవంతో మాట్లాడుకోవడంలో ‘తీన్మార్’ ప్రభావం చాలా ఉంది. వీ6 గ్రూప్ నుంచే వచ్చిన ‘వెలుగు’ డైలీ కూడా తెలంగాణ భాషకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తోంది. తెలంగాణ మాటలను హెడ్డింగుల్లోనూ, కథనాల్లోనూ విరివిగా వాడటాన్ని గమనించవచ్చు.
వెకిలిగా చూపేవారు
తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తెలంగాణ భాషకు తగిన గుర్తింపు ఉండేది కాదు. సినిమాల్లో అయితే బాగా చిన్నచూపు చూసేవారు. కమెడియన్లకు, విలన్ పాత్రలకు తెలంగాణ యాసనే వాడేవారు. కేవలం నవ్వుకోవడానికి పనికొచ్చే భాషగా సిన్మా పెద్దలు ట్రీట్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చాక పరిస్థితి మారిపోయింది. గతంలో కేవలం కమెడియన్లకు వాడిన తెలంగాణ భాషను ఇప్పుడు హీరో కేరక్టర్లకు కూడా వాడుతున్నారు.
తెలుగు సిన్మా పరిశ్రమపై మొదటి నుంచి ఆంధ్రుల ఆధిపత్యం ఎక్కువ. దీంతో తెలంగాణ వాతావరణానికి అద్దం పట్టే సిన్మాలు చాలా తక్కువగా వచ్చాయి. తెలుగు టాకీ యుగం ప్రారంభమైనప్పటి నుంచి అన్ని విభాగాల్లో ఆంధ్ర ప్రాంతంవారు మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఉండేవారు. దర్శకులు, నిర్మాతలు, రచయితలు, హీరో….ఇలా అందరూ కోస్తా ప్రాంతం వారే ఉండేవారు. ఫలితంగా కోస్తా ప్రాంతం భాషే సిన్మా భాష అయిపోయింది. తెలంగాణ భాషకు తెలుగు సిన్మా పట్టం కట్టక పోవడానికి దీన్నే ప్రధాన కారణంగా భావించాలి.
1975 లో వచ్చిన ‘ చిల్లరదేవుళ్లు’ తెలంగాణ పలుకుబడిలో వచ్చిన తొలి సిన్మా. ఆ తర్వాత చాలా కాలానికి బి. నరసింగరావు తెలంగాణ పలుకుబడిలో ‘ మా భూమి ’ సిన్మా తీశారు. ఆ తర్వాత వచ్చిన ‘రంగులకల’ , ‘ దాసి ’ సిన్మాలు తెలంగాణ బతుకుచిత్రాలను వెండితెరమీద ఆవిష్కరించాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలుగు సిన్మా పరిశ్రమలోనూ మార్పులు వచ్చాయి. తెలంగాణ భాషను గౌరవించే దిశగా తెలుగు సిన్మా పరిశ్రమ అడుగులు వేస్తోంది. తెలంగాణ శ్లాంగ్ ను ఫుల్ లెంగ్త్ లో వాడే సిన్మాలు వస్తున్నాయి. తెలంగాణ పల్లె కల్చర్ ను కళ్లకు కట్టినట్లు చూపించిన ‘ ఫిదా ’ సిన్మా కమర్షియల్ గా హిట్ అయింది. ‘ పెళ్లి చూపులు ’ లాంటి సిన్మాలో హీరో తెలంగాణ భాషలోనే మాట్లాడతాడు. దీంతో తెలంగాణ పల్లె వాతావరణానికి అద్దం పట్టే కథలను సిన్మాలుగా తీయడానికి నిర్మాతలు, దర్శకులు ఉత్సాహపడుతున్నారు. ఆ కోవలో వచ్చిందే ‘దొరసాని ’ సిన్మా.
(ఇవాళ తెలంగాణ భాషా దినోత్సవం)