నేడు తెలుగు భాషా దినోత్సవం

నేడు తెలుగు భాషా దినోత్సవం

వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం అందరికీ తెలిసిందే. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా  గిడుగు రామ్మూర్తి జయంతినే మాతృ భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వికాసానికి పాటుపడిన వారు ఎవరని అడిగితే వెంటనే గుర్తొచ్చేవారిలో విరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు ఎప్పుడూ ఉంటారు. వారికి సమాన స్థాయిలోనే కృషి చేసిన వారు గిడుగు రామ్మూర్తి. 

1863, ఆగస్టు 29న అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు రామ్మూర్తి ... ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తగానూ ఆయన మంచి పేరు సాధించారు. ఆయన జీవిత కాలంలో ఎన్నో ఉద్యమాలను చేపట్టడమే గాక.. అవి మంచి ఫలితాలనూ సాధించడం మరో విశేషం. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం చేపట్టిన గిడుగు.. విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.  

పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలను గిడుగు రామ్మూర్తి చేపట్టారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించారు. ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ గిడుగు రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి ఆయన స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే గడిపారు.

తెలుగు వికాసానికి తోడ్పాటేది... ?

దేశ భాషలందు తెలుగు తెస్స అని వాదించే మనం.. ఈ రోజుల్లో తెలుగులో మాట్లాడడానికే కొందరు అసం--తృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో తెలుగు భాషకు కందుకూరి, గురజాడ, గిడుగు రామ్మూర్తి లాంటివారు ఎంతో కృషి చేసి మన భాషకు గౌరవం అందేలా చేశారు. కానీ ప్రస్తుత రోజుల్లో అంతా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం చదువులు.. తెలుగు ఉనికే తగ్గిపోయింది. పాఠశాలలో చదువులు అంటే సరే.. కనీసం ఇంట్లో అయినా తెలుగు మాట్లాడుతున్నారా అంటే అదీ లేదు. తెలుగు భాష అభివృద్ధి అనేది మన ఇంటి నుంచే మొదలైతే.. అది దేశమంతటా వ్యాప్తి చెందుతుంది. అలా ప్రతి ఒక్కరూ అనుకుంటేనే తెలుగు భాషకు గౌరవం ఇచ్చినట్టు. ఎంత సాధించినా.. ఏం చేసినా... మన మాతృభాషలో ఉన్న  కంఫర్ట్ మరేభాషలోనూ ఉండదు కదా..