మనదేశంలోని కుల వ్యవస్థమై ధ్వజమెత్తి.. కులాల దుమ్ము దులిపిన మొదటి ఉద్యమకారుడు జ్యోతిబాపూలే. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్యస్థైర్యం కల్పించిన మహనీయుడాయన. మహారాష్ట్రకు చెందిన జ్యోతిబా.. థామస్ పేయిన్ రచించిన మానవ హక్కులు అనే పుస్తకం ద్వారా ప్రభావితమై సామాజిక కార్యకర్తగా, రచయితగా నిరంతరం అణచివేతలపై ధిక్కార స్వరమై నిలిచారు. పశువుల కంటే హీనంగా మారిన అణగారిన కులాల కోసం తన జీవితాన్ని దారబోశారు. పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి 1873 సెప్టెంబర్24న సత్యశోధక్ సమాజ్(సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్)ను ఏర్పాటు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు చేరవచ్చు. పూలే 1848లో బాలికల కోసం పుణేలో మొట్టమొదటి బడిని ప్రారంభించి, విద్య అనేది విశ్వజనీనమైందని చాటి చెప్పిన మొదటి సంస్కర్త ఆయనే.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో వెనుకబడ్డ కులానికి చెందిన ఓ తోట మాలి కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న పూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవారు. కాలక్రమేణా పీష్వా పరిపాలనా కాలంలో పూల వ్యాపారం చేయడం వల్ల వారి ఇంటి పేరు పూలేగా మార్పు చెందింది. ఏడాది వయసులోనే పూలే తల్లిని కోల్పోయారు. ఏడేండ్ల వయస్సు వరకు ఒక మరాఠీ బడిలో చదివారు. తర్వాత చదువు మానేసి వ్యవసాయంలో తండ్రికి సాయం చేసేవారు. కొద్ది రోజులే బడికి వెళ్లినప్పటికీ.. ఆ తర్వాత బడి మానేసినా ప్రతిరోజూ నిద్ర పోయే ముందు కొద్దిసేపు లాంతరు వెలుగులో చదువుకునే వారు. చదువుపట్ల పూలే ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్, ఒక క్రైస్తవ పెద్దమనిషి జ్యోతిబా తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. అలా ఆయన 1841లో పుణేలోని స్కాటిష్ మిషన్ స్కూల్లో చేరారు.
పోరాటానికి అప్పుడే నిర్ణయం
13 ఏండ్లకే జ్యోతిబా పూలేకు 9 ఏండ్ల సావిత్రితో పెండ్లయ్యింది. చదువు పూర్తయ్యాక ఆయన తన కుల వృత్తి అయిన పూల వ్యాపారం ప్రారంభించారు. అయితే పూలే 1848లో తన బ్రాహ్మణ స్నేహితుడి పెండ్లికి వెళ్లాడు. అక్కడ అందరూ పూలేని కులం తక్కువ వాడని అవమానించారు. అప్పుడే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా వారి ఆధిపత్యా న్ని వ్యతిరేకించారు. జ్ఞాన సంపదను అందరికీ పంచాలని పట్టుబట్టారు. అమెరికా స్వాతంత్య్ర పోరాటం ఆయను చాలా ఎక్కువగా ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలు స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించాలని సామాన్యుల్ని ప్రోత్సహించారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే భావించారు. అందువల్ల మహిళలు విద్యావంతులు కావాలని బలంగా నమ్మారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని బడికి పంపారు. 1848 ఆగస్టులో బాలికల కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరాని వారికి కూడా పాఠాలు చెప్పవలసి రావడంతో ఉపాధ్యాయులెవరూ ముందుకు రాకపోయేసరికి పూలే, భార్య సావిత్రి కలసి పిల్లలకు పాఠాలు బోధించేవారు.
సంఘ సంస్కరణలకు మొదటి సారథి
బాల్య వివాహాలు సర్వసాధారణమైన ఆ రోజుల్లో.. ముసలి వారికిచ్చి పెండ్లి చేయడం వల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యే వారు. వితంతువులు మళ్లీ వివాహం చేసుకోవడానికి అప్పటి సమాజం అంగీకరించేది కాదు. పూలే వితంతు పునర్వివాహాల గురించి పెద్ద యుద్ధమే చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించారు. 1864లో బాలహత్య ప్రతిబంధక గృహాన్ని స్థాపించి, వితంతువులైన గర్భిణులకు అండగా నిలిచారు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించిన ఘనత పూలేదే. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి పూలే దత్తత తీసుకున్నారు. 1873 సెప్టెంబర్ 24న సత్య శోధక సమాజాన్ని పూలే స్థాపించారు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులను బ్రాహ్మణుల చెర నుంచి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు. కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కల్పించేవారు. వేదాలను పవిత్రంగా భావించడాన్ని పూలే వ్యతిరేకించారు. విగ్రహారాధనను కూడా ఆయన ఖండించారు.
రైతులు, కార్మికులను సంఘటితం చేసేలా..
1891లో ప్రచురించిన సార్వజనిక్ ధర్మపుస్తక్ మత, సాంఘిక విషయాలపై పూలే అభిప్రాయాలను తెలియజేస్తుంది. స్త్రీ, పురుషుల మధ్య లింగవివక్షను పూలే ఆనాడే వ్యతిరేకించారు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించారు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈ తరహాలో ఒక భారతీయ హిందువు ఒక సంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి. 1868లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చారు. 1889లో పౌరోహిత్య వ్యతిరేకతపై ‘బండారం’ అనే పుస్తకాన్ని రాశారు. 1877లో సత్యశోధక సమాజం తరపున దీనబంధు వార పత్రిక ప్రారంభించారు. 1880లో ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడు లోభాండేతో కలసి రైతులు, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించారు.
శూద్రులే దేహానికి ప్రాణం..
దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాల లాంటి వాళ్లు అని చెప్పిన మహాత్మా పూలే ఆధునిక భారత సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాల బానిసలుగా బతుకుతున్న కింది కులాల వారిలో తమ బానిసత్వం పట్ల ఆయన చైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ పూలే తన గురువు అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రకటించడం పూలే గొప్పతనానికి నిదర్శనం. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారత పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి గులాంగిరి గ్రంథాన్ని తన గౌరవ కానుకగా పూలే సమర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతి కోసం చేసిన కృషికి ఫలితంగా ఆయనకు మహాత్మ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ పూలే 1890 నవంబర్ 28న కన్నుమూశారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనం ఆ మహాత్మునికి ఇచ్చే నిజమైన నివాళి.
గులాంగిరితో కులాల దుమ్ము దులిపారు
1873లో గులాంగిరి పుస్తకం ప్రచురించి కులాలకున్న దుమ్ము దులిపారు పూలే. ప్రతి ఒక్కరికీ సమాన స్వేచ్ఛ హక్కు ఉండాలన్నారు. సత్యశోధక సమాజం తరఫున ప్రారంభించిన దీనబంధు వారపత్రికలో రైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవారు. దేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు పూలేనే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నారు. ఆయన ఆలోచనలకు, విశ్లేషణకు గులాంగిరి అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మ ణులు చుట్టిన దాస్యపు సంకెళ్ల నుంచి వాళ్లు విముక్తి కావడం, తోటి శూద్రుల నిజ పరిస్థితిని బహిర్గతం చేయడం, కాస్త విద్యనైనా నేర్చుకోవడం శూద్ర సహోదరుల కర్తవ్యంగా చూపించారు. ప్రతి గ్రామంలోనూ శూద్రులకు బడులు కావాలని, కానీ వాటిలో బ్రాహ్మణ ఉపాధ్యాయులు మాత్రం వద్దని నినదించారు.
- సంపత్ గడ్డం, దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు