తుంబూరేశ్వరాలయాన్ని16 స్తంభాల మండపంతో నిర్మించి అందమైన శిల్పాకృతులతో తీర్చిదిద్దారు. గర్భగుడి ప్రధాన ద్వారాన్ని నల్లసరపు రాతితో నిర్మించారు. చుట్టూరా వివిధ భంగిమల్లోని నర్తకీమణులు, దేవతామూర్తుల శిల్పాలు అమర్చారు. గర్భాలయంలో శివలింగం పుట్టు లింగమని.. ప్రతి ఏటా దాని పరిమాణం పెరుగుతుందని స్థానికులు చెబుతారు. ప్రతి సోమవారం ఆలయంలో శివలింగానికి పూజలు నిర్వహిస్తుండగా.. ఏటా మాఘ పౌర్ణమికి నాలుగు రోజుల పాటు జాతర జరుగుతుంది.
ప్రకృతి అందాల నడుమ
తుంబూరేశ్వరాలయాన్ని ఆనుకుని పెద్ద చెరువు ఉంది. దాని మధ్యలో ద్వీపం మాదిరిగా రాతి గుట్ట ఉంటుంది. ఒక వైపు చెరువు, మరోవైపు కొండలు, ఇంకో వైపు పచ్చని పంట పొలాలతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. గ్రామ శివారులోంచి వెళ్లి గుట్ట ఎక్కి దిగితే చెరువు ఒడ్డున తుంబూరేశ్వరాలయం కనిపిస్తుంది. అక్కడ వేల్పులు(దేవతలు) ఉంటారని స్థానికుల విశ్వాసం. ఆ కారణంగానే గ్రామానికి వేల్పుగొండ అనే పేరు కూడా వచ్చిందని చెబుతారు.
టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాలి
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధిలో భాగంగా చారిత్రక నేపథ్యం కలిగి శిల్ప కళా నైపుణ్యంతో కూడిన తుంబూరేశ్వరాలయాన్ని తీర్చిదిద్ది, సౌకర్యాలు కల్పించాలని చరిత్రకారులు కోరుతున్నారు. గ్రామంలోంచి ఆలయం వరకు రోడ్డు నిర్మించి, ఆలయానికి మరమ్మతులు చేసి ప్రచారం కల్పిస్తే టూరిస్ట్ స్పాట్‌గా మారుతుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మెదక్‌జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్నందున తుంబూరేశ్వరాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.