మాటలు కూడా సరిగా రాని వయసులో సరిగమలు పలికిందామె. వయొలిన్తోనూ గమకాలు అందుకుంది. శృతికి తగ్గట్టుగా వయొలిన్ తీగల్ని కదిలిస్తూ.. తెలుగు ఇండియన్ ఐడల్ వరకు వెళ్లింది. అంతేనా ఆర్కెస్ట్రాతో కలిసిపోతూనే తనకంటూ ఒక ప్రత్యేకత తెచ్చుకుంది. రియాలిటీ షో ఆర్కెస్ట్రాలో ఒక అమ్మాయి వయొలిన్ వాయించడం ఇదే తొలిసారి. ఇండస్ట్రీలోనూ ఫిమేల్ వయొలనిస్ట్లు లేరు. ఆ లోటును నేను భర్తీ చేస్తానంటున్న ఈ మ్యుజీషియన్ పేరు కామాక్షి అంబటిపూడి. పదహారేండ్ల ఈ వయొలనిస్ట్ గురించి ఆమె మాటల్లోనే..
మా ముత్తాత శ్రీ రామకృష్ణయ్య వయొలిన్ మీద అద్భుతంగా సంగీతాన్ని పలికించేవాళ్లు. తాతయ్య పాలపర్తి నాగేశ్వరరావు కూడా వయొలిన్ విద్వాంసుడు. అమ్మ భవాని వీణ వాయిస్తుంది. కర్నాటక సంగీతంలో డిప్లొమా చేసింది. ఇలా నా చుట్టూ మ్యూజిక్ ఉండటంతో.. తెలియకుండానే నాక్కూడా సంగీతంతో బంధం ఏర్పడింది. అయితే, చిన్నప్పుడు వయొలిన్‌ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో అమ్మవాళ్లు కూడా గట్టిగా చెప్పలేకపోయేవాళ్లు. వేరొక గురువు దగ్గర చేర్పిస్తే మ్యూజిక్‌లోని సీరియస్‌నెస్ తెలుస్తుందని శ్రీనివాసమూర్తి గారి క్లాస్‌లకి తీసుకెళ్లారు. ఇంట్లోవాళ్లు అనుకున్నట్టే అక్కడికెళ్లాక.. సంగీతం ఇంపార్టెన్స్ తెలిసింది. తాతయ్యతో కలిసి కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టా. అలా ఇప్పటివరకు రెండొందలకు పైగా కచేరీలు చేశా. 2016లో చెన్నై అకాడమీ నుంచి అవార్డు కూడా తీసుకున్నా. అయితే ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన మాత్రం లేదు.
ఇండియన్ ఐడల్‌లో అవకాశం ఇలా
సింగర్ శ్రీలలితతో కలిసి ఇరవైకి పైగా మ్యూజిక్ వీడియోలు చేశా. వాటిలో ఒక వీడియోకి సాయి, పవన్ అనే ఇద్దరు మ్యుజీషియన్స్ కూడా మాకు తోడయ్యారు. వాళ్లకే తర్వాత ఇండియన్ ఐడల్ ఆర్కెస్ట్రా కాంట్రాక్ట్ వచ్చింది. అప్పుడు వయొలిన్ కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. అయితే, నేను వాళ్లకు మొదటి ఛాయిస్ కాదు. ఆర్కెస్ట్రాలో అందరూ మగవాళ్లే ఉండటంతో మేల్ వయొలనిస్ట్ కోసమే వెతికారు. కానీ, ఎవరూ దొరకకపోవడంతో చివరికి నన్ను కాంటాక్ట్ అయ్యారు.
క్లాసికల్ మ్యూజిక్‌లో వయొలిన్‌ని ఎక్కువగా వాయించాల్సి ఉంటుంది. వేళ్ళ కదలిక చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గమకాలు ఎక్కువ ఉంటాయి. సినిమా పాటలకు వచ్చేసరికి వయొలిన్ ప్లెయిన్‌గా, నోట్స్ గీత గీసినట్టుగా ఉంటాయి. అందుకే, మొదట చేయగలనా? లేదా? అని చాలా భయపడ్డా. పైగా ఇండస్ట్రీ గురించి అసలు తెలీదు. దాంతో ఒప్పుకోవాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డా. ఇంట్లోవాళ్లకూ ఇదే కన్ఫ్యూజన్. చివరికి వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకని ధైర్యం చేశా. చాలా కష్టపడ్డా. దానికి తగ్గట్టే మొదటి ఎపిసోడ్‌లోనే నా పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది.
ఆ బిట్ ఇబ్బంది పెట్టింది
వయొలిన్ వాయించేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. పాట థీమ్, సిచ్యుయేషన్ని బట్టి వేళ్ళ కదలిక మార్చుతుండాలి. పాట విని .. ఏ వేలు వాడితే ఆ ట్యూన్ వచ్చిందో చెప్పాలి. అన్నింటికీ మించి పాడటం తెలిసి ఉండాలి. అయితే కొన్ని పాటలు ఇబ్బంది పెడతాయి. ‘మన్మథుడు’ సినిమాలో ‘డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ’ పాటలో పెద్ద వయొలిన్ బిట్ ఉంటుంది. అది రిహార్సల్స్, టెక్నికల్ షూట్లో కూడా పోయింది నాకు. కానీ, ఫైనల్ షూటింగ్లో సక్సెస్ అయ్యా. ఇంకొన్ని పాటలకు కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి.
అదే నా గోల్
పాటలు తేలిగ్గా జనాల్లోకి వెళ్తాయి. దానివల్ల సింగర్స్‌కి గుర్తింపు వస్తుంది. కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే నాలాంటి వయొలనిస్ట్కి ఇంత పేరు వస్తుందని ఊహించలేదు. ఈ రెస్పాన్స్ చూశాక ఫ్యూచర్లో శాస్త్రీయ సంగీతంతో పాటు అవకాశం వస్తే సినిమాలకు పనిచేయాలి అనుకుంటున్నా. ఏఆర్ రెహ్మాన్, బాంబే జయశ్రీ, రంజనీ , గాయత్రీ ముందు వయొలిన్ వాయించాలనేది నా డ్రీమ్. చిన్నప్పటి నుంచీ కర్నాటక సంగీతం కూడా నేర్చుకున్నా.. అందులో సర్టిఫికెట్ కోర్సు చేశా. వీటితో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనుకుంటున్నా.
సాధారణంగా.. ఒరిజినల్ పాటలో ఉన్న వయొలిన్ బిట్‌ని షోలో వాయిస్తుంటాం. కానీ, కొన్నిసార్లు పాటలో వయొలిన్ లేకపోయినా డైరెక్టర్స్ ఏదైనా క్రియేట్ చేసి పెట్టమంటుంటారు. అలా అప్పటికప్పుడు నేను వయొలిన్ బిట్ క్రియేట్ చేసి వాయించిన ‘ఓకే బంగారం’ సినిమాలోని ‘ఏదో అడగనా..’ పాటకు మంచి పేరు వచ్చింది. అలాగే రీసెంట్గా ఇన్స్ట్రుమెంటల్ రౌండ్లో వాయించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ పాట వయొలిన్ బిట్‌కి చాలా రీచ్ వచ్చింది.
::: ఆవుల యమున