ఎప్పుడైనా ఆలోచించామా.. నీటి బొట్టు విలువెంత అని..! ఇవాళ (మార్చి 22) ప్రపంచ జలదినోత్సవం

ఎప్పుడైనా ఆలోచించామా.. నీటి బొట్టు విలువెంత అని..! ఇవాళ (మార్చి 22) ప్రపంచ జలదినోత్సవం

నీరు పంచభూతాలలో ముఖ్యమైనదిగా చెప్తుంటారు. గాలి లేకుంటే మనిషి ఎలా బతకలేడో.. నీరు లేకుంటే కూడా ఏ జీవికైనా బతకడం కష్టం. అలాంటి నీటి గురించి.. ఒక్క నీటి బొట్టు విలువేంటో ఎప్పుడైనా ఆలోచించామా..? మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం (World Water Day) సందర్భంగా నీటి విలువ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మరి నీటి బొట్టు విలువెంత..?  బావుల్లోంచి తోడుకున్నంత.. నీళ్లమోటారు స్విచ్ ఆన్ చేసినంత.. బ్యాంకు కార్డులతో నీటి బిల్లులు చెల్లించేంత.. మున్సిపల్ నల్లాలు, ట్యాంకర్ల దగ్గర ఖాళీ బిందెలతో పోట్లాడుకునేంత.. రోజంతా లోటా నీళ్లతో గడిపేంత.. గుక్కెడు మంచి నీళ్లకోసం ప్రాణాలు తీసేంత! ఇంతకీ నీటి విలువ ఎంత?

ALSO READ | March 22 Water World Day: సమస్త జీవకోటికి నీరు ఆధారం

వేసవిలో నీటి కష్టాలు కొత్తగా చూసేదేం కాదు. గతేడాది దక్షిణాఫ్రికాలో నీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో చూశాం. మంచి నీళ్లను సమీకరించాలంటూ ప్రజలకు స్వయానా ప్రభుత్వమే పిలుపునిచ్చింది. కొందరు రోడ్ల పక్కన బకెట్లతో నీటిని అమ్ముకున్న దుస్థితి. మరికొందరికి డబ్బు పెట్టినా నీరు దొరకని పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుంది. తాగునీరు పూర్తిగా అడుగంటిపోయిన నగరంగా కేప్ టౌన్ చరిత్రకెక్కింది. నీటి బొట్టు విలువెంతో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించింది అక్కడి పరిస్థితి.

మంచి నీటి గురించి ఈ వివరాలు తెలుసా..?

• ఒక మనిషికి ప్రతీరోజూ 30 నుంచి యాభై లీటర్ల శుభ్రమైన నీరు అవసరం.
• ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2.1 బిలియన్ ప్రజలు కలుషితమైన నీటినే తాగుతున్నారు.
• ప్రతిఏటా 1,500 ఘన కిలోమీటర్ల పరిమాణంలో వ్యర్ధ జలం వస్తుంటుంది.
•80 శాతం వ్యర్థ జలాన్ని శుద్ధి చేయకుండా వదిలి వేయడం వల్ల అవి ఇతర జలాల్లో కలిసిపోయి మొత్తం జల కాలుష్యానికి కారణమవుతున్నాయి.
•మానవ తప్పిదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఐదువేల మంచినీటి సరస్సులు, నదులు తీవ్ర విష రసాయనాలతో నిండిపోయాయి.
•ఒక లీటర్ కలుషిత నీరు మరో 5 లీటర్ల మంచి నీటిని కలుషితం చేస్తుంది.
• ఈ కలుషితం డయేరియా, టైఫాయిడ్, డిసెంట్రి, అమీబియస్, కలరా వంటి నీటి కాలుష్య సంబంధ వ్యాధులకు కారణమవుతోంది. దీనివల్ల ఏడాదికి 40 లక్షల మంది మరణిస్తున్నారు.
• వ్యర్థమవుతున్న నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తే వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు.