పరువు హత్యల సంస్కృతి ఆగేదెలా?

పరువు హత్యల సంస్కృతి ఆగేదెలా?

రాష్ట్రంలో, దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట కులం కేంద్రంగా లేదా ప్రేమ పెళ్లి కేంద్రంగా మర్డర్‌ చేసి టెర్రర్‌ చేసే విషసంస్కృతి పెరిగిపోతోంది. ఇలాంటి దుర్ఘటనల నివారణ కోసం ప్రభుత్వాలు, పౌర సమాజం ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం మరింత ఆందోళనకరం. ఆ మధ్య రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో రాయపోలు నాగమణి ప్రజారక్షణ అయిన పోలీసు ఉద్యోగం చేస్తున్న ఈ యువతి, ఎస్సీ కులానికి చెందిన శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకున్నదని, ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె అన్నయ్యే తన చెల్లిని   హత్య చేశాడు.

మొన్నటి రోజు సూర్యాపేట జిల్లాలో మాల కులానికి చెందిన యువకుడు బంటిని గౌడ కులానికి చెందిన యువతి పెళ్లి చేసుకున్నందుకు యువతి తోబుట్టువులే బంటిని హత్య చేశారు. పైగా తమ నాయనమ్మకు గిఫ్టుగా ఇచ్చామన్నారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమంటే పార్టీ (దావత్‌) చేసుకుందామని నమ్మకమైన స్నేహితుడితో పిలిపించుకుని ఆ స్నేహితుడితో కలిసి మరీ బంటిని హత్య చేశారు. ఈ సంఘటన మరవక ముందే పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండలం, ముప్పిరితోట గ్రామ గౌడ కులానికి చెందిన యువకుడు సాయి కుమార్‌ గౌడ్‌ను, ముదిరాజు కులానికి చెందిన సహధ్యాయిని అనే యువతిని ప్రేమించినందుకు యువతి తండ్రే హత్య చేశాడు. 

సాయికుమార్‌ గౌడ్‌కు సహధ్యాయిని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రతీకారంగా అదే గ్రామంలో ఆ యువకుడిని తరిమి తరిమి హత్య చేశాడు. దళిత (హిందువుగా చెప్పే దళిత కులం) యువకుడు బుల్లిపురం నాగరాజు సుల్తానా అనే ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాగరాజును సుల్తానా సోదరులు తమ మతం కాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాగరాజును హత్య చేశారు. 

ఈ సంఘటనలే కాకుండా, రోజు రోజుకు భూములు, ఆస్తులు, ఇతర ఆర్థిక అవసరాలు, విలాసవంతమైన అలవాట్లకు, మరే కారణం చేతనైన గాని, యువతీ- యువకులను, తల్లీతండ్రిని, అన్నను -అక్కను-, తమ్ముడిని, మామను-అత్తను, ఇలా ఒకరేమిటి అనేక బంధాలను తెగ నరికే నేరమయ విషసంస్కృతి పెచ్చరిల్లుతోంది.  

కోర్టులు, చట్టాలు, విశ్వవిద్యాలయాలు - విద్యాసంస్థలు, పోలీస్‌, వివిధ పాలనా యంత్రాంగం, పార్టీలు, రాజకీయాలు, మేధావులు, శాస్త్రవేత్తలు, ఇలా ఒకటేమిటి అన్నీ ఉండి ఏం ప్రయోజనం? ఈ నేరమయ విషాన్ని పిచ్చోడి చేతిలో రాయిలాగ, కండ్లు లేని మృగజీవులను జనారణ్యంలోకి వదిలినట్లే కదా?  కొన్ని రక్షణలతోనైనా ఇంకా సంతృప్తి పడటం కోసం సిద్ధంగా ఈ ప్రజలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. 

ఈ న్యాయమైన ఆలోచనల కోసమైన పౌర సమాజంలో వస్తున్న ఈ నూతన మార్పులను గ్రహించడంలో అన్ని రకాల వ్యవస్థలు విఫలం కాకూడదు? ఈ పరువు (కులమత) హత్యలను నిరోధించడానికి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను చేసి, ఉన్న వాటిని కఠినంగా అమలు చేయాలని ప్రజలు ముఖ్యంగా పౌర సమాజం గట్టిగా మాట్లాడాలి, కొట్లాడాలి. హక్కులు, బాధ్యతల కోసం ఎంతస్థాయిలో పోరాడామో అంతే స్థాయిలో కుల, మత సమాజాలలో ప్రజాస్వామ్య చింతనాపరులు వారి వారి సమాజాల్లో హత్య, వివక్ష, బహిష్కరణ, నేర సంస్కృతిని పారదోలే ఆలోచనలు కచ్చితంగా చేయాలి.

- పాపని నాగరాజు,
అధ్యక్షుడు, 
కుల నిర్మూలన వేదిక