
ప్రతి నెలా పౌర్ణమి వస్తుంది. కానీ, రాఖీ పౌర్ణమి మాత్రం స్పెషల్. అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీకగా చెప్పుకునే రోజు. ఈ రోజున అన్నదమ్ములకు రాఖీ కట్టి, నోరు తీపి చేస్తారు. మరి స్పెషల్ డేని ఇంకింత స్పెషల్‌గా మార్చే స్వీట్స్ స్పెషల్మీ కోసం.
రాఖీ మిఠాయి
కావాల్సినవి :
చక్కెర, నీళ్లు, పాలు, గోధుమ పిండి - ఒక్కో కప్పు చొప్పున
యాలకుల పొడి - అర టీస్పూన్
ఫుడ్ కలర్ - పావు టీస్పూన్
నెయ్యి - ఒక టేబుల్ స్పూన్
తయారీ : ఒక పాన్‌లో చక్కెర వేసి, నీళ్లు పోసి మరిగించాలి. ఆ తర్వాత అందులో ఒక నిమ్మ చెక్క రసం పిండాలి. కాసేపయ్యాక యాలకుల పొడి, ఫుడ్ కలర్ కూడా వేయాలి. మరో పాన్‌లో పాలు పోసి కాగబెట్టాలి. దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసి కలపాలి. అందులో గోధుమ పిండి వేసి బాగా కలపాలి. తర్వాత నెయ్యి కూడా వేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి, చేతికి నెయ్యి రాసుకుని పిండిని ముద్ద చేయాలి. ఆ తర్వాత చిన్న ఉండలు చేసి టూత్‌పిక్‌తో గాట్లు పెట్టాలి. అలా చేసిన వాటిని వేడి నూనెలో వేసి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. వీటిని ముందుగా రెడీ చేసిపెట్టుకున్న చక్కెర పాకంలో వేసి మూత పెట్టాలి. గంట తర్వాత తీసి తింటే టేస్టీగా ఉంటాయి.
మ్యారీ గోల్డ్ రోల్స్
కావాల్సినవి :
మ్యారీ గోల్డ్ బిస్కెట్స్ – రెండు ప్యాకెట్లు
నెయ్యి – ఒక టీస్పూన్
పాలు, చక్కెర పొడి, చక్కెర, మిల్క్ పౌడర్ – ఒక్కోటి పావు కప్పు చొప్పున
కొబ్బరి పొడి – అర కప్పు
కొకొవా పౌడర్ – ఒక టేబుల్ స్పూన్
తయారీ : బిస్కెట్స్‌ని ముక్కలు చేసి మిక్సీజార్‌లో గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసి, అందులో చక్కెర పొడి, కొకొవా పౌడర్, నెయ్యి వేసి, పాలు పోసి ముద్ద చేయాలి. బటర్ పేపర్ మీద ఈ ముద్దను పెట్టి చపాతీ కర్రతో వత్తాలి. దానిపై లేయర్‌గా వేసేందుకు ఒక గిన్నెలో కొబ్బరి పొడి, చక్కెర, మిల్క్ పౌడర్ వేసి, పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని లేయర్‌లా పూసి రోల్ చేయాలి. ఒక గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత రోల్స్‌లా కట్ చేయాలి.
ఓరియో స్విస్ రోల్
కావాల్సినవి :
ఓరియో బిస్కెట్స్ - ఒక ప్యాకెట్
పాలు - మూడు టేబుల్ స్పూన్లు
ఓరియో క్రీమ్ - సరిపడా
తయారీ : ఓరియో బిస్కెట్స్‌లో క్రీమ్ తీసేయాలి. బిస్కెట్స్‌ను ముక్కలు చేసి మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి. తరువాత అందులో పాలు పోసి ముద్దగా కలపాలి. పక్కకు తీసి పెట్టిన క్రీమ్‌ని ఒక గిన్నెలో వేసి, ఒక టీస్పూన్ పాలు పోసి కలపాలి. ఆ తర్వాత ముద్దగా చేసిన బిస్కెట్ మిశ్రమాన్ని ఒక కవర్లో వేసి చపాతీ కర్రతో వత్తాలి. కవర్ని కత్తెరతో కత్తిరించి, బిస్కెట్ మిశ్రమంపై క్రీమ్ పూయాలి. తర్వాత దాన్ని కవర్తోపాటే రోల్ చేసి, ఒక గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత కవర్ తీసేసి, చాకుతో రోల్స్ కట్ చేయాలి.
బిస్కెట్ కుకీ
కావాల్సినవి :
పార్లే- జి బిస్కెట్స్ - రెండు ప్యాకెట్లు
మిల్క్ పౌడర్ - మూడు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
క్కెర - అర కప్పు
నీళ్లు - పావు కప్పు
నెయ్యి - ఒక టీస్పూన్
తయారీ : బిస్కెట్స్‌ని ముక్కలు చేసి మిక్సీజార్‌లో గ్రైండ్ చేయాలి. ఆ పొడిని నూనె లేకుండా వేగించాలి. తర్వాత అందులో మిల్క్
పౌడర్, యాలకుల పొడి కూడా వేసి కలపాలి. పాన్‌లో చక్కెర వేసి నీళ్లు పోసి కరిగే వరకు గరిటెతో తిప్పాలి. మిశ్రమం కొంచెం దగ్గరపడ్డాక అందులో పొడి వేసి కలపాలి. ఆ తర్వాత నెయ్యి కూడా వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసి ముద్ద చేయాలి. తరువాత చిన్న ఉండలు చేసి, కుకీల్లా చేత్తో వత్తి, వాటి మీద చాకుతో గాట్లు పెట్టాలి.
మలాయ్ లడ్డు
కావాల్సినవి :
జీడిపప్పు (వేగించి)- ఒక టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష (వేగించి)- ఒక టేబుల్ స్పూన్
నెయ్యి - పావు కప్పు
చక్కెర పొడి - పావు కప్ప
యాలకులు - రెండు
మిల్క్ పౌడర్ - ఒక కప్పు
తయారీ : ఒక గిన్నెలో మిల్క్ పౌడర్, చక్కెర పొడి, వేగించిన జీడి పప్పు పలుకులు, ఎండుద్రాక్ష, నెయ్యి వేసి గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత వేడి మీదే ఆ పిండిని చిన్న ఉండలు చేస్తే సాఫ్ట్‌గా, స్వీట్‌గా ఉండే మలాయ్ లడ్డు రెడీ.
సూజీ స్వీట్
కావాల్సినవి :
బొంబాయి రవ్వ - అర కప్పు
కొబ్బరి పొడి, మిల్క్ పౌడర్ - ఒక్కోటి పావు కప్పు చొప్పున
చక్కెర - ఐదు టేబుల్ స్పూన్లు
కొకొవా పౌడర్ - ఒక టీస్పూన్
నెయ్యి - సరిపడా
పాలు - పావు లీటర్
తయారీ : పాన్‌లో బొంబాయి రవ్వ వేగించాలి. అందులోనే కొబ్బరి పొడి కూడా వేసి, వేగించాలి. మరో పాన్‌లో పాలు పోసి, చక్కెర, మిల్క్ పౌడర్, బొంబాయి రవ్వ వేసి కలపాలి. ఆ మిశ్రమం ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. తర్వాత మూతపెట్టి కాసేపు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని, అందులో నెయ్యి వేసి కలిపి ముద్ద చేయాలి. దాన్ని రెండు భాగాలుగా చేయాలి. ఒక భాగంలో కొకొవా పౌడర్ కలపాలి. తర్వాత చిన్న ఉండలు చేయాలి. మరో భాగాన్ని కూడా అలాగే ఉండలు చేయాలి. రెండు రంగుల ఉండల్ని కలిపి బిస్కెట్లా వత్తాలి.