ఇసుక దందాకు చెక్..​ సీఎం వార్నింగ్​తో కదిలిన అధికారయంత్రాంగం

ఇసుక దందాకు చెక్..​  సీఎం వార్నింగ్​తో కదిలిన అధికారయంత్రాంగం
  • స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ టీమ్​ ఏర్పాటు
  • అందబాటులోకి సాండ్​ ట్యాక్సీ
  • పుంజుకోనున్న నిర్మాణ పనులు ​

నాగర్​కర్నూల్, వెలుగు:ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించడంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. డిండి వాగులో ఇసుకను తోడే ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఇసుక తోడేందుకు వాడే హిటాచీ, జేసీబీలు, రవాణకు వాడే ట్రాక్టర్లు, టిప్పర్లను సీజ్​ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్ట్​  చేస్తామని హెచ్చరించారు. ఇసుకతో పాటు మైనింగ్​ దందాకు అడ్డుకట్టవేస్తామని స్పష్టం చేశారు. 

ఇల్లీగల్​ ఇసుక దందాను అడ్డుకునేందుకు డీఎస్పీ నేతృత్వంలో స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశారు.  మైనింగ్​ శాఖ గుర్తించిన రీచ్​ల నుంచి సాండ్​ ట్యాక్సీ ద్వారా ఇసుక వినియోగానికి అనుమతులు ఇవ్వనున్నారు. అధికారికంగా గుర్తించిన ఇసుక రీచ్​ల వద్ద  మైనింగ్, రెవెన్యూ, పోలీస్​ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. సాండ్​ ట్యాక్సీ ద్వారా బుక్​ చేసిన ట్రాక్టర్లకు కూలీలతో ఇసుక తవ్వుకునేలా రూల్​ పెట్టారు. ఇసుక తవ్వకాలకు సాయంత్రం 5 వరకు టైం ఫిక్స్​ చేశారు. ఇసుక కోసం ఆన్​లైన్​లో  బుక్​ చేసుకున్న వారు రీచ్​ల వద్ద కూపన్లను ఇస్తే ఇసుక తరలించడానికి అనుమతిస్తారు.

పుంజుకోనున్న నిర్మాణ పనులు.. 

ఇసుక అందుబాటులో లేక ఏడాదిగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పుంజుకునే అవకాశాలున్నాయి. ఇసుక రీచ్​లను గుర్తించేందుకు మీనమేషాలు లెక్కపెట్టిన మైనింగ్​ అధికారులు ఇల్లీగల్​ దందాను అడ్డుకునేందుకు తమ శాఖలో సరిపడా స్టాఫ్​  లేదని చెబుతూ వచ్చారు. దీంతో జిల్లాలో నిర్మాణంలో ఉన్న పాలమూరు,-రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్​ వంటి భారీ ఇరిగేషన్​ ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకూ ఇసుక కొరత తప్పలేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి ఇసుక అందుబాటులో లేక తిప్పలు పడ్డారు. ఇదే అదనుగా ట్రాక్టర్​కు రూ.6,500, టిప్పర్​కు రూ.60 వేల చొప్పున ఇసుక మాఫియా వసూలు చేయడంతో నిర్మాణం రంగం కుదేలైంది.      

ఇక్కడ పగలు రాత్రి ఒకటే..

డిండి పరివాహక పరిసర ప్రాంత గ్రామాల్లో పగలు రాత్రి అంటూ తేడా ఉండదు. దుందుభి నది పరివాహక గ్రామాలైన దాసర్లపల్లి, మామిళ్లపల్లి, లక్ష్మాపూర్, పెద్దాపూర్, మొలగర, జప్తిసదగోడు గ్రామాలతో పాటు వంగూర్  మండలంలోని ఉల్పర, మిట్ట సదగోడు, డిండి చింతపల్లి, ఉల్పర, మొల్గర, చింతపల్లి గ్రామాలు కాసులు కురిపిస్తున్నాయి. ఏకంగా హిటాచీలు, జేసీబీలను వాగుల్లోకి దింపి ఇసుకను తోడేస్తున్న మాఫియా, ఇసుకను జిల్లా సరిహద్దులు దాటించి హైదరాబాద్​కు తరలిస్తున్నారు. ఇక ఇసుక తరలిస్తున్న గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. పొలిటికల్​ పార్టీలు, గ్రూపుల వారీగా ఇసుకను తరలించేందుకు పోటీ పడుతున్నాయి. అధికారుల చర్యలతో పరివాహక ప్రాంత గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్ల నుంచి విముక్తి దొరుకుతుందని ఆయా ప్రాంత రైతులు అంటున్నారు. 

ALSO READ : తెలంగాణలో అన్నిట్లో ఇన్​చార్జుల పాలన.!

టాస్క్​ఫోర్స్​ కమిటీ ఏర్పాటు..

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి జిల్లాలో డీఎస్పీ నేతృత్వంలో స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ కమిటీ ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లోని పోలీసులను సమన్వయం చేసుకుంటూ ఇసుక, మైనింగ్​ అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటారని ఎస్పీ తెలిపారు.

మాఫియాకు సపోర్ట్  చేసిన ఆఫీసర్లు..

మహబూబ్​నగర్, నాగర్​ కర్నూల్​ జిల్లాల గుండా ప్రవహించే డిండి వాగు మాఫియాకు అడ్డాగా మారింది. మిడ్జిల్, తాడూరు, తిమ్మాజీపేట, తెల్కపల్లి, వంగూరు, కల్వకుర్తి, ఉప్పునుంతల మండలాల నుంచి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లోని చిన్నా చితక వాగులను వదలని ఇసుక మాఫియా పొలిటికల్​ సపోర్ట్​తో వాగులను తోడేస్తున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో ఇసుక దందాకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.