![స్కూల్ బస్సుల తనిఖీలకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్](https://static.v6velugu.com/uploads/2025/02/special-task-force-inspections-school-bus_eWRkNGn1Td.jpg)
- ఏర్పాటుకు రవాణా శాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సులు, వ్యాన్‌లు, ఆటోల ఫిట్‌నెస్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండేలా రవాణా శాఖ చర్యలు చేపడుతున్నది. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో ఈ వెహికల్స్ డ్రైవర్ల తీరుపైనా ఓ కన్నేసి ఉంచాలని నిర్ణయించింది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని పలు పట్టణాల్లో, గ్రామాల్లో స్కూల్ బస్సులు, వ్యాన్‌లు, ఆటోలు ప్రమాదానికి గురవుతున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల వాహనాల ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోవడంతో పాటు వెహికల్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
దీంతో విద్యార్థులు, అమాయక ప్రజలు గాయపడటంతో పాటు మరణిస్తున్నారు. చాలా చోట్ల ఆర్టీఏ అధికారులు విద్యాసంస్థల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం, వాహనాల ఫిట్‌నెస్, డ్రైవర్ల తీరుపైనా నిఘా లేకపోవడంతోనే విద్యాసంస్థలకు చెందిన వెహికల్స్ ప్రమాదాలకు గురవుతున్నాయని రవాణా శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో హైదరాబాద్‌తో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
కాగా, ఇటీవల వందకుపైగా అధికారులను ఆర్టీఏలోకి కొత్తగా తీసుకోవడంతో వారిని ఈ టాస్క్‌ఫోర్స్‌లో నియమించి, ఈ బాధ్యతలను వారికి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎంవీఐలు, ఎంవీఐలు, ఆర్టీఏలు, డీటీసీలు రోజువారి విధుల్లోనే బిజీగా ఉండడంతోనే వీటిపై దృష్టి పెట్టే సమయం లేదని, అందుకే టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు రవాణా శాఖలోని ఓ ఉన్నాతాధికారి వెల్లడించారు.