హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో పంజాగట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రణీత్ రావు కేసును విచారించేందుకు జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ ను నియమించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరిపనున్నారు. ఈ విచారణలో ప్రణీత్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేసి రిమాండ్ కు తరలించనున్నారు పోలీసులు.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రతిపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. ఈ కేసులో పంజాగుట్ట పీఎస్‌లో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఆధారాలు దొరక్కుండా ఎస్‌ఐబీ లాగర్ రూమ్‌లో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసి పక్కా ప్లాన్‌తో ప్రణీత్ రావు వ్యవహరించినట్లు గుర్తించారు.
ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ప్రణీత్‌రావు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్‌రావును హైదరాబాద్‌కు తరలించారు.