గంజాయి పట్టిస్తే.. నగదు బహుమతి

గంజాయి పట్టిస్తే.. నగదు బహుమతి
  • మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక టీమ్ 
  • వరంగల్ సీపీ అంబర్​ కిశోర్​ ఝా

హనుమకొండ, వెలుగు : వరంగల్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్​ కంట్రోల్​ పై స్పెషల్​ ఫోకస్ పెట్టినట్టు పోలీస్​ కమిషనర్​ సీపీ అంబర్​ కిశోర్​ ఝా  చెప్పారు.    ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చూడటంతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించేందుకు యాంటీ డ్రగ్స్​ కంట్రోల్​ టీమ్ ను నియమించినట్లు తెలిపారు.

ఇందులో ఒక రిజర్వ్​ ఇన్​ స్పెక్టర్​, ముగ్గురు ఆర్​ఎస్సైలు, ఇతర పోలీస్​ సిబ్బందిని సభ్యులుగా చేర్చి మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.   స్పెషల్​ టీం ఆఫీసర్లు వరంగల్ ట్రై సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మత్తు పదార్థాలు తీసుకునేందుకు అనువుగా ఉండే ప్రదేశాలు, కాలేజీలు, జంక్షన్లు, సినిమా టాకీస్​ లు, షాపింగ్​ మాల్స్, పాఠశాలల సమీపంలో గంజాయి విక్రయాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు తెలిపారు.  వాటితో పాటు  రాత్రి సమయాల్లో నగరంలో గంజాయి సేవించే ప్రాంతాలను గుర్తించడంతో పాటు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతున్నట్లు పేర్కొన్నారు.

 గంజాయి లాంటి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని, ఎక్కడైన మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగానికి సంబంధించిన వివరాలు తెలిస్తే వెంటనే '87125 84473' నెంబర్​ కు సమాచారం అందించాలని సూచించారు.  సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని,  అధిక మొత్తంలో గంజాయి సమాచారం అందించిన  వారికి నగదు పురస్కారం కూడా అందిస్తామని సీపీ స్పష్టం చేశారు. గంజాయి రహిత పోలీస్ కమిషనరేటే  ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సీపీ అంబర్​ కిశోర్​ ఝా పిలుపునిచ్చారు.