ఛీప్​ లిక్కర్​ రేట్ల వల్లే గుడుంబా వైపు !

  • ఎమ్మార్పీ రూ.110 ఉంటే.. బెల్టుషాపుల్లో రూ.150కి అమ్మకం
  • దీంతోనే నాటుసారాకు అలవాటు పడుతున్న జనం
  • మూడు నెలల గుడుంబా ఆపరేషన్​లో నిగ్గుతేలిన నిజాలు
  • దేవరకొండ, హుజూర్​నగర్​లో 90 శాతం నాటుసారా క్లీన్​
  • 90 రోజుల్లో 72 గ్రామాల్లో ఆపరేషన్ పూర్తి

నల్గొండ, వెలుగు :  బెల్టు షాపుల్లో ఛీప్​ లిక్కర్​ రేట్లు పెంచి అమ్మడం వల్లే గ్రామాలు, తండాల్లో జనాలు గుడుంబాకు అలవాటు పడుతున్నట్టు ఎక్సైజ్​శాఖ నిర్వహించిన స్పెషల్​ఆపరేషన్​లో బయట పడింది. క్వార్టర్ లిక్కర్​ ధర ఎమ్మార్పీ రూ.110లు ఉండగా, బెల్టుషాపుల్లో రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. దీంతో మళ్లీ నాటుసారా తయారీ ఊపిరిపోసుకుంది. దీనికి అలవాటుపడుతున్న వాళ్లలో యువకులు కూడా ఉండటం తీవ్రంగా కలిచివేస్తోంది. పల్లెలు, మారుమూల గ్రామాల్లో తయారు చేస్తున్న నాటుసారా పట్టణాలకు సప్లై చేయడం సంచలనం కలిగిస్తోంది. 

ఇప్పటివరకు గంజాయి అతిపెద్ద సమస్య అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా నాటుసారా తోడవడం ఎక్సైజ్, పోలీస్ అధికారులకు పెద్ద సవాల్​గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో వంద రోజులపాటు చేపట్టిన ఆపరేషన్ గుడుంబా కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని హుజూర్​నగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో 72 గ్రామాల్లో వంద రోజులపాటు ఆపరేషన్​ నిర్వహించారు. స్పెషల్​ టీమ్స్​ను రంగంలోకి దింపి నాటుసారా ఆనవాళ్లు మళ్లీ కనిపించకుండా ఆపరేషన్​ సక్సెస్​ చేశారు. అయితే ఎంత రిస్క్​ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నాటుసారా నిర్మూలన జరగాలంటే ఆర్డినరీ లిక్కర్​రేట్లు తగ్గిస్తే తప్ప సాధ్యం కాదని సీనియర్​ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. 

350 కేసులు...243 మంది అరెస్ట్..

జూన్​నుంచి ఆగస్టు వరకు దేవరకొండ, హుజూర్​నగర్​లో మొత్తం 350 కేసులు నమోదుకాగా, 240 మందిని అరెస్ట్​ చేశారు. 1,263 లీటర్లు సారా, 51,944 లీటర్ల వాష్​ ధ్వంసం చేయగా, 8,038 కేజీల బెల్లంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 40 వాహనాలు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్​లో బెల్లం అమ్మకాలపై ఆంక్షలు లేకపోవడంతో అక్కడి నుంచి మన జిల్లాకు అక్రమంగా రవాణా జరుగుతోంది. 

జగ్గయ్యపేట నుంచి హుజూర్​నగర్, మాచర్ల మీదుగా దేవరకొండకు బెల్లం రవాణా చేస్తున్నారు. హుజూర్​నగర్​లో గరిడేపల్లి, పాలకీడు, మఠంపల్లి మండలాల్లోని 32 గ్రామాలు, దేవరకొండలో డిండి, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లోని 40 తండాల్లో వంద రోజులపాటు పోలీసులు నిరంతరం దాడులు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా మూడు టీమ్స్ ను రంగంలోకి దింపారు. 72 గ్రామాల్లో తయారవుతున్న నాటుసారా పరిసర గ్రామాలకు సప్లై చేయడమేగాక, కొండమల్లేపల్లి, దేవరకొండ, హుజూర్​నగర్​ పట్టణాలకు సైతం టువీలర్స్ పై తీసుకొచ్చి అమ్ముతున్నారు. 

నియోజకవర్గం    కేసులు    వ్యక్తులు    సారా(లీటర్లు)    వాష్​     బెల్లం
దేవరకొండ    221    111    525    40,400    7,103 
హుజూర్​నగర్​    129    132    738    11,540    935

నాటుసారాకుప్రైవేట్ సైన్యం కాపలా..

నాటుసారా తయారీ కేంద్రాల వద్ద ప్రైవేట్ సైన్యం కాపలా ఉంటున్నారు. స్పెషల్ ఆపరేషన్​కాబట్టి ఆరుగురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు, రెండు టాటాసుమోలు, సివిల్​ పోలీసులు కలిపి స్పెషల్​ టీమ్స్​గా ఏర్పాటు చేశారు. రెండు మండలాలకు కలిపి ఒక టీమ్​ పనిచేసింది. అదే సాధారణ రోజుల్లో అయితే ఎక్సైజ్​ స్టేషన్​లో ఉన్న సిబ్బంది చాలరు. దీనివల్ల ప్రైవేట్ సైన్యంతో పోరాడటం కష్టమవుతోంది. పలు సందర్భాల్లో పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఎక్సైజ్ సిబ్బందిపై ప్రైవేట్ సైన్యం దాడికి పాల్పడిన ఘటనలు దేవరకొండ, హుజూర్​నగర్​ పరిధిలో చోటు చేసుకున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రీమియం లిక్కర్ రేట్లు పెంచడంతోపాటు ఆర్డినరీ లిక్కర్ రేట్లు కొద్దిమేర తగ్గిస్తే నాటుసారాకు అడ్డుకట్ట పడటమేగాక, సర్కారు​ ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. 

దాడులు నిరంతరం కొనసాగిస్తాం.. 

ఆపరేషన్ గుడుంబా పేరుతో దాడులు నిరంతరంగా కొనసాగిస్తాం. వంద రోజుల ఆపరేషన్ శుక్రవారంతో పూర్తయ్యింది. పోలీసులు, ఎక్సైజ్​ టీమ్స్​ కలిసి ఆపరేషన్​లో పాల్గొన్నారు. 90 శాతం గుడుంబా ఆనవాళ్లు లేకుండా చేశాం. ఇతర ప్రాంతాల నుంచి బెల్లం రవాణా కాకుండా బార్డర్ల వద్ద చెక్​పోస్టులను కట్టుదిట్టం చేశాం. లిక్కర్​ రేట్లు ప్రభుత్వ పరిశీలనలోని అంశం. గంజాయి, నాటుసారా వైపు యువత వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నాం. 

బి. సంతోష్​, ఎక్సైజ్​ సూపరింటెండెంట్, నల్గొండ జిల్లా