సైబర్​ క్రైమ్ కట్టడికి.. పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్

సైబర్​ క్రైమ్ కట్టడికి.. పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్
  • రోజు రోజుకూ రెచ్చిపోతున్న  సైబర్ ఫ్రాడ్స్  
  • రూ. వేల నుంచి కోట్లలో దోపిడీ
  • రాష్ట్రంలో 9 నెలల్లో 85 వేల కేసులు నమోదు
  • టెక్నికల్​ స్కిల్స్​ లేక 10 శాతం కేసులే ట్రేసింగ్​ 
  • ఆసక్తి ఉన్న వారిని గుర్తించి శిక్షణ ఇస్తున్న సైబర్​ సెక్యూరిటీ బ్యూరో 

హైదరాబాద్‌, వెలుగు: పోలీస్  ఇన్వెస్టిగేషన్‌లో ట్రెండ్‌ మారుతూ వస్తున్నది. ఇప్పటి వరకు దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, స్నాచింగ్స్‌ సహా ప్రాపర్టీ నేరాల పని పట్టిన పోలీసులు ఇప్పుడు సైబర్ నేరాలపై దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. రోజూ జరిగే సాధారణ నేరాలను దర్యాప్తు చేసే నైపుణ్యం ఉన్నా సైబర్‌‌ క్రైమ్‌ కేసుల దర్యాప్తులో కొంత వెనకబడే ఉంది. పోలీస్​ శాఖలో తక్కువ మందికి టెక్నికల్‌ స్కిల్స్‌ ఉండడమే దీనికి కారణం.

 మేజర్​ సైబర్​క్రైమ్​  జరిగితే  ట్రేస్​ చేయడానికి, లింక్స్‌ గుర్తించేందుకు ఎథికల్ హ్యాకర్స్ ​సాయం తీసుకోవాల్సి వస్తున్నది.  అయితే, గతంతో పోలిస్తే డిపార్ట్ మెంట్‌లో ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్ సంఖ్య పెరిగింది. ఈ మధ్య నియామకమైన 547 మంది ఎస్ఐల్లో సుమారు 260 మంది బీటెక్ పూర్తి చేసిన వారే ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా సైబర్​ క్రైమ్ కట్టడికి ఉపయోగపడతారని భావిస్తున్నారు. వీరితో పాటు డీసీపీ నుంచి మొదలుకుంటే కానిస్టేబుల్‌ వరకు సైబర్​ క్రైమ్  పై అవగాహన కల్పించి ట్రైనింగ్​ఇచ్చేలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది.

మూడు కమిషనరేట్ల పరిధిలో..

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సైబర్ ​క్రైమ్  కట్టడికి ప్రత్యేక విభాగం పని చేస్తున్నది. హైదరాబాద్​  కమిషనరేట్​పరిధిలో ఒక డీసీపీ, ఒక ఏసీపీ, తొమ్మిది మంది ఇన్​స్పెక్టర్లు, ఐదుగురు ఎస్ఐలు,15 మంది కానిస్టేబుల్స్​ పని చేస్తున్నారు. 

సైబరాబాద్​లో ఒక డీసీపీ, మరో ఏసీపీ, ఏడుగురు ఎస్ఐలు, 18 మంది కానిస్టేబుల్స్​  సైబర్ ​క్రైమ్ ఛేదిస్తున్నారు. ఇక రాచకొండకు వస్తే ఒక డీసీపీ, ఏసీపీ, ఏడుగురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, 12 మంది కానిస్టేబుల్స్​ డ్యూటీలు చేస్తున్నారు. వీరు గతంలో ఎలాంటి సైబర్ క్రైమ్​జరిగినా కంప్లయింట్స్​ తీసుకునేవారు. కానీ, సైబర్ ​నేరాల సంఖ్య పెరగడంతో రూ.లక్ష లోపు జరిగే క్రైమ్ ఫిర్యాదులను స్థానిక పోలీస్​స్టేషన్లలోనే తీసుకుంటున్నారు. 

దీని కోసం ఒక్కో పీఎస్‌లో ఒకరి నుంచి ఐదుగురు వరకు కానిస్టేబుల్స్ ​పని చేస్తున్నారు. వీరికి కూడా లా అండ్​ ఆర్డర్​డ్యూటీలు, ఇతర క్రైమ్ కేసులు, బందోబస్తు డ్యూటీలు వేస్తుండడంతో సైబర్​ నేరాల దర్యాప్తు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. వీటిని అధిగమించేందుకు సైబర్ క్రైమ్‌ పోలీస్ యూనిట్స్‌ తో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. సైబర్‌ ‌క్రైమ్‌ కేసులపై ఆసక్తి ఉన్న సిబ్బందికి స్పెషల్‌ ట్రైనింగ్ ఇస్తున్నది. 

28 రకాల సైబర్​ నేరాలపై.. 

సైబర్‌ క్రిమినల్స్ ​రోజు రోజుకూ టెక్నాలజీ పెంచుకుంటున్నారు. పోలీసుల కంటే ముందుగానే అప్‌డేట్‌ అవుతున్నారు. సైకలాజికల్​గా జనాలు ఎలా బోల్తా పడతారో తెలుసుకుని మరీ మోసం చేస్తున్నారు. రూ.వేల నుంచి మొదలుకుంటే రూ. కోట్ల వరకు కొల్లగొడుతున్నారు. అప్పుడప్పుడు వీరి తెలివిని చూసి ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. సైబర్​క్రైమ్ ఎంతలా పెరిగాయంటూ ఈ ఏడాది 9 నెలల కాలంలోనే మూడు కమిషనరేట్ల పరిధిలో 85 వేల కేసులు నమోదయ్యాయి. 

ఇందులో ఎక్కువగా డిజిటల్ అరెస్ట్‌, ఇన్వెస్టిమెంట్‌ ఫ్రాడ్స్‌, జాబ్ ఫ్రాడ్స్, ఇతర నేరాలు ఉంటున్నాయి. ఈ తీవ్రతను గుర్తించిన సైబర్​సెక్యూరిటీ బ్యూరో మొత్తం 28 రకాల సైబర్​నేరాలు జరుగుతున్నాయని తెలుసుకుంది. వీటి కట్టడికి స్కిల్స్​ఉన్న ఎక్కువ మంది సిబ్బంది అవసరమని గుర్తించింది. అందులో భాగంగానే బ్యాంక్ అకౌంట్స్,ఫేక్ మొబైల్ నంబర్స్ గుర్తించడంలో ప్రాథమిక దర్యాప్తు చేసే విధంగా శిక్షణ ఇస్తోంది. తర్వాత వివిధ పోలీస్​స్టేషన్లలో రిక్రూట్​ చేసేలా ప్లాన్ ​చేస్తున్నది. 

డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని.. వృద్ధుడి నుంచి రూ.8.3 లక్షలు కొట్టేశారు

బషీర్ బాగ్, వెలుగు: మనీలాండరింగ్ పేరిట 85 ఏండ్ల వృద్ధుడి నుంచి సైబర్ చీటర్స్ రూ.8.30 లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి తొలుత సైబర్ నేరగాళ్లు  కాల్ చేసి, తమను ముంబై పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. తన పేరిట ముంబై బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ అయిందని, దాని ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు బెదిరించారు. అనంతరం స్కైప్ యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలని చెప్పి, బాధితుడితో స్కామర్లు పోలీస్ యూనిఫామ్ లో వీడియో కాల్ మాట్లాడారు. 

ఆ తర్వాత ఫోన్ కు ఫేక్ అరెస్ట్ వారెంట్ పంపించి, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వెంటనే అరెస్ట్ కాకుండా ఉండాలంటే బెయిల్ కోసం డబ్బులు పంపించాలని సూచించారు. దీంతో బాధితుడు నిజమేనని నమ్మి రూ. 8.30 లక్షలను రెండు దఫాలుగా స్కామర్ల అకౌంట్ కు పంపించాడు. 

చీటర్స్ ఇంకా డబ్బులు పంపించాలని  ఒత్తిడి చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్ ద్వారా గురువారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.

ఎక్స్​పర్ట్స్​సూచనలు.. సలహాలతో 

సైబర్ ​క్రైమ్​ పై పోలీసుల్లో అవగాహన​పెంచడానికి ఇదివరకే సైబర్ వారియర్స్‌, సైబర్‌‌ కాప్స్‌ పేరుతో ట్రైనింగ్‌ ఇచ్చారు. ఓటీపీలు తెలుసుకుని బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కొట్టేసే స్థాయి నుంచి డిజిటల్​అరెస్ట్​ చేసి కోట్లు కొల్లగొట్టే స్థాయికి సైబర్​క్రిమినల్స్ చేరుకోవడంతో అంతే టాలెంట్​ఉన్న సిబ్బంది కావాలని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో భావిస్తోంది. అందుకే పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పేరు మోసిన ఎక్స్ పర్ట్స్​ను తీసుకువచ్చి ట్రైనింగ్ ​ఇప్పిస్తున్నది. 

కమాండ్​కంట్రోల్​ సెంటర్​లో ఉన్న సైబర్ ​సెక్యూరిటీ బ్యూరోతో పాటు సైబర్ ​క్రైమ్  పోలీస్​స్టేషన్లలో నెలలో మూడు సార్లు బ్యాచ్​ల చొప్పున ఈ ట్రైనింగ్​ సెషన్​నడుస్తోంది. ఇందులో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించడం, సైబర్​ క్రైమ్​ తీవ్రతను గుర్తించడం, నేరగాళ్లు వినియోగించిన ఫోన్‌ నంబర్స్, బ్యాంక్ అకౌంట్స్‌, క్రిమినల్స్‌ హిస్టరీని ట్రాక్ చేయడం లాంటి విషయాల్లో తర్ఫీదు ఇస్తున్నారు.

 సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల తీరును తెలుసుకోవడం, ఆయా రాష్ట్రాల పోలీసుల కో ఆర్డినేషన్‌తో సాల్వ్​ చేసేలా స్టడీ చేయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో అనుమానిత సైట్ల గుర్తింపు, ఫేక్‌ లింక్స్‌ను అనాలసిస్‌ చేయడం ఎలాంటి వెబ్‌పేజ్‌లో సైబర్‌‌ నేరగాళ్లు ఉంటారనే వివరాలను వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. 

ఈ కార్యక్రమం పూర్తయ్యాక సైబర్ ​క్రైమ్​ పోలీస్​స్టేషన్లతో పాటు స్థానిక పోలీస్​ స్టేషన్లలో వీరిని నియమించాలని ప్లాన్​చేస్తున్నారు. -ఆపరేషన్స్ కోసం ఇందులోని సిబ్బందితో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి సైబర్​ క్రిమినల్స్​ పని పట్టేలా కార్యాచరణ కొనసాగుతోంది.