
- సీఐడీలో త్వరలో ప్రత్యేక విభాగం
- ఆన్‌లైన్ మార్కెటింగ్,స్కీమ్స్‌పై నిరంతరం నిఘా
- టెక్నికల్ స్కిల్స్ ఉన్న సిబ్బంది నియామకం
- ప్రపోజల్స్ రెడీ చేస్తున్న పోలీసుశాఖ
హైదరాబాద్, వెలుగు: ఆన్‌లైన్ అడ్డాగా సాగుతున్న ఆర్థిక నేరాల కట్టడికి రాష్ట్ర పోలీస్ డిపార్ట్‌మెంట్ కసరత్తు ప్రారంభించింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తరహాలో మరో కొత్త యూనిట్‌కు ఏర్పాట్లు చేస్తోంది. నేరం జరగక ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సీఐడీ కేంద్రంగా ‘ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్’ ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రపోజల్స్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్స్, మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్స్ సహా సైబర్ మోసాలకు అవకాశం ఉన్న అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌పై ఇంటెలిజెన్స్ యూనిట్‌తో నిఘా పెట్టనున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా సంబంధిత పోలీసులను అప్రమత్తం చేస్తారు. ఇందుకోసం టెక్నికల్ స్కిల్స్ ఉన్న సిబ్బందిని ఇంటెలిజెన్స్ యూనిట్‌లో నియమించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో ప్రాపర్టీ క్రైం కన్నా ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాల్లో బాధితులు రూ.22,812 కోట్లు కోల్పోయారు. ఇందులో మన రాష్ట్రం నుంచి బాధితులు 1,20,869 మంది ఉన్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఆర్థిక నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నది. వర్క్ ఫ్రం హోం, జాబ్స్, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు, మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్స్ అంటూ ఆన్‌లైన్ అడ్డాగా అమాయకులను మోసగాళ్లు దోచుకుంటున్నారు. ఈ దందాలో బాధితులు కోల్పోయిన డబ్బు తిరిగి రాబట్టడం పోలీసులకు కత్తిమీద సాములాంటిదే. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ మోసాల్లో రికవరీ సాధ్యం కావడం లేదు.
ఆన్‌లైన్‌పై ఇంటెలిజెన్స్ నిఘా ఇలా
ఈ కామర్స్ సైట్లు, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రాం సహా అన్ని సోషల్ మీడియా వేదికలపై ఇంటెలిజెన్స్ సిబ్బంది నిఘా ఉంచుతారు. ఆయా కంపెనీల వెబ్ పేజెస్‌తో పాటు ఫేక్ సైట్ల వివరాలు సేకరిస్తారు. అనుమానాస్పద వెబ్‌సైట్లను గుర్తించడంతో పాటు ఆకర్షించే ప్రకటనలపై నిఘా పెడతారు. ఆన్‌లైన్‌లో ఉన్న కంపెనీలు ఫేక్ కంపెనీలా లేక నిజమైనవా అని తెలుసుకునేందుకు ఆయా కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేస్తారు. మోసం జరగక ముందే సంబంధిత పోలీసులకు సమాచారం అందిస్తారు. ఈ విధానంతో ఆర్థిక మోసాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు.