డ్రగ్స్​ పని పట్టేందుకు స్పెషల్​ వింగ్స్​​ పెట్టాలె

హైదరాబాద్‌లో 23 ఏండ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ డ్రగ్స్​కు బానిసగా మారి చనిపోవడం అందరినీ కలచివేసింది. మొన్న కెల్విన్.. నిన్న టోనీ.. ఇయ్యాల మరొకటి.. ఇలా డ్రగ్ మాఫియా పెడ్లర్లు చాప కింద నీరులా రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు ప్రతి జిల్లా, కమిషనరేట్ల​ పరిధిలో స్పెషల్​ నార్కోటిక్ ​సెల్ ​ఏర్పాటు చేయాలె. ఇప్పటికే ఉన్న డీ అడిక్షన్​సెంటర్లను బలోపేతం చేయడంతోపాటు కొత్తగా మరికొన్నింటిని నెలకొల్పాలి. చట్టాలను పక్కాగా అమలు చేసి డ్రగ్స్ ముఠాను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉమ్మడి పాలనలో హైదరాబాద్​నగరంలో మొత్తం 6 పబ్బులకు అనుమతులుండగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వాటి సంఖ్య60 దాటింది. హైదరాబాద్ శివారులో మూతపడ్డ పలు ఫార్మా కంపెనీలు డ్రగ్స్ తయారీకి, నిల్వకు అడ్డాలుగా మారిపోయాయి. పబ్బులు. ఫామ్ హౌస్​లు, రిసార్టుల కేంద్రంగా శని, ఆదివారాల్లో రాత్రి వేళలో జరిగే పార్టీల్లో మత్తు పదార్థాల వాడకం బాగా జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మత్తు పదార్థాల రవాణా, వాడకంలో గంజాయి టాప్​లో ఉంది. కొకైన్‌‌, హెరాయిన్, బ్రౌన్ షుగర్ లాంటి వాటితో పోలిస్తే గంజాయి ధర చాలా తక్కువ. అందుకే ఎక్కువ మంది గంజాయికి బానిసలవుతున్నారు. గంజాయి మొక్క రెసిన్ తో హాష్​తయారు చేసి కూడా వాడుతుంటారు. గంజాయిలో 10 నుంచి- 20 శాతం టీహెచ్‌‌‌‌‌‌‌‌సీ పవర్‌‌‌‌ఉంటే హాష్‌‌‌‌‌‌‌‌లో 20 శాతం నుంచి 60 శాతం వరకు ఉంటుంది. గంజాయి, ఇతర మత్తు పదార్ధాలకు స్టూడెంట్స్, యువకులే ఎక్కువగా బానిసలవుతున్నారు. స్టూడెంట్స్​ క్రికెట్‌‌తదితర ఆటలు ఆడే సమయంలో, సినిమాలు, షికార్లకు వెళ్లినప్పుడు, కాలేజీలకు డుమ్మా కొట్టి నదులు, చెరువుల వద్ద ఈత కొడుతున్నప్పుడు, కేఫ్‌‌లలో సిగరెట్లు తాగుతున్న సమయంలో, బార్లు, బహిరంగ ప్రాంతాల్లో మద్యం తాగుతున్నప్పుడు వారిని గంజాయి మాఫియా గ్యాంగ్ సీక్రెట్ గా గమనిస్తుంటుంది. సందర్భాన్ని బట్టి వారితో మాటలు కలిపి కొంత మత్తు పదార్థాన్ని వారికి రుచి చూపిస్తారు. తర్వాత వారిని నిదానంగా మత్తుకు అలవాటు చేస్తూ.. అవి లేకుండా ఉండలేని పరిస్థితి కల్పిస్తారు. గంజాయికి అలవాటు పడుతున్న వారు, గంజాయి రవాణా చేస్తున్న వారు కూడా 25 ఏండ్లలోపు వారే కావడం గమనార్హం. 

డీ-అడిక్షన్ కేంద్రాలేవీ..

తెలుగు రాష్ట్రాల్లో మత్తు పదార్థాల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. చిత్ర పరిశ్రమలోని ముఖ్యులు, ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు డ్రగ్స్​కు బానిసలవుతున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. డ్రగ్స్​ బారి నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్ కేంద్రాలు నామ మాత్రంగా ఉన్నా.. అవి ఆల్కహాల్, కల్లు అలవాటును మాన్పించే కేంద్రాలుగానే పని చేస్తున్నాయి. మత్తు పదార్థాల వాడకం పెరిగిపోయిన దృష్ట్యా ప్రభుత్వం డీ అడిక్షన్​సెంటర్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. నగరాలతోపాటు జిల్లా కేంద్రాలకు వాటిని విస్తరించాలి. 

స్పెషల్ ​నార్కోటిక్ సెల్ ఎక్కడ ?

 రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక యాంటీ నార్కోటిక్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. స్వయంగా సీఎం కేసీఆర్ ఆదేశించినా.. కార్యాచరణ జరగలేదు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ నార్కోటిక్ ఎన్​ఫోర్స్​మెంట్​వింగ్(హెచ్ న్యూ) మాత్రమే ఏర్పాటు చేశారు. ఇది తప్ప రాష్ట్రంలో  ఇతర ఏ కమిషనరేట్ పరిధిలో గాని, జిల్లా పరిధిలో  గాని మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పలేదు. డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్రస్థాయిలో స్పెషల్​సెల్  ఏర్పాటు చేయాలా? లేదా జిల్లా  స్థాయిలోనా ? లేదా కమిషనరేట్ పరిధిలోనా ? అనే దానిపైన కూడా ఇప్పటి వరకు స్పష్టమైన నిర్ణయం జరగలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్సీబీకి హైదరాబాద్​లో కార్యాలయం ఉన్నా అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండటం లేదు. స్థానిక పోలీసు విభాగంలో కూడా మత్తు పదార్థాల వాడకాన్ని అడ్డుకునేందుకు జిల్లా స్థాయిలో యాంటి- నార్కోటిక్ విభాగం ఏర్పాటు చేయాలి. ఆ విభాగంలో మెరికల్లాంటి యువ పోలీసు సిబ్బందిని తీసుకొని వారికి  తర్ఫీదునిచ్చి, మాదకద్రవ్యాలను గుర్తించడం, వాటి రవాణాను అడ్డుకోవడానికి  ప్రత్యేక శిక్షణతో పాటు అధికారాలు కూడా ఇవ్వాలి. అప్పుడే ఎక్కడికక్కడ డ్రగ్స్​ను నిరోధించడం వీలవుతుంది.

చట్టాలను పక్కాగా అమలు చేయాలె..

మత్తు పదార్థాలను నిరోధించడానికి మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నా.. వాటి అమలు సరిగా ఉండటం లేదు. మాదక ద్రవ్యాల వాడకం, ఉత్పత్తి చేయడం, వాటిని నిల్వచేయడం, వ్యాపారం చేయడం మన దేశ చట్టాల ప్రకారం నేరం. వాటికి కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. నేరస్తులకు పదేండ్ల వరకు కఠిన జైలు శిక్షలతో పాటు లక్షల జరిమానా విధించేందుకు చట్టాలున్నాయి. పదే పదే ఈ నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వాటి అమలు తీరే సరిగ్గా లేకపోవడం బాధాకరం. వియత్నాం, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాల్లో మత్తు పదార్థాల కేసుల విషయంలో చట్టాలు పక్కాగా అమలు చేస్తారు.

:: డాక్టర్. బి. కేశవులు, న్యూరో– సైకియాట్రిస్ట్