- వరుసగా ఆరుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు ట్రాన్స్ఫర్
- కొత్తగూడెం జీజీహెచ్‌లో డాక్టర్ల కొరత
- నిలిచిన సర్జరీలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం జిల్లా జనరల్ హాస్పిటల్(జీజీహెచ్)కు స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం లేదు. ఇటీవల జరిగిన బదిలీల్లో హాస్పిటల్ నుంచి ఆరుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు పలు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ల స్థానంలో ఇప్పటికీ ఒక్కరంటే ఒక్కరూ కూడా రాలేదు. జీజీహెచ్ కు వచ్చేందుకు ఏ డాక్టరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. స్పెషలిస్ట్ డాక్టర్లు ట్రాన్స్ ఫర్ కావడంతో గత వారం పది రోజులుగా సర్జరీలు నిలిచిపోయాయి.
ఆసక్తి చూపని డాక్టర్లు
మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న కొత్తగూడెంలోని జిల్లా జనరల్ హాస్పిటల్‌కు వచ్చేందుకు స్పెషలిస్ట్ లతో పాటు ఇతర డాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. జనరల్ సర్జన్ డాక్టర్ సురేందర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ పుష్పలత, అనస్థీషియన్ డాక్టర్ శిరీశ్, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, చెస్ట్ ఫిజీషియన్ సునీల్, పాథాలజిస్ట్ సుమయ.
గత వారం రోజుల కిందట ఖమ్మం, మహబూబాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ అయ్యారు. జీజీహెచ్ నుంచి ఒకేసారి ఆరుగురు స్పెషలిస్టులు ట్రాన్స్ఫర్ కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. డాక్టర్ పుష్పలత ఆర్ఎంఓగా కూడా వ్యవహరించేవారు. ఆమె బదిలీ కావడంతో సూపరింటెండెంట్‌పై మోయలేని భారం పడినట్లవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
నిలిచిన సర్జరీలు :స్పెషలిస్ట్ డాక్టర్లు ట్రాన్స్‌ఫర్స్‌పై వెళ్లడంతో కొత్తగూడెంలోని జీజీహెచ్‌లో గత వారం రోజులుగా సర్జరీలు నిలిచిపోయాయి. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సర్జరీలు జీజీహెచ్‌లో జరిగేవి. ప్రస్తుతం ఎమర్జెన్సీవి తప్ప జనరల్ సర్జరీలు చేయడం లేదు.
ఇవేం ట్రాన్స్ఫర్స్..
లాంగ్ స్టాండింగ్ పేర చేపట్టిన బదిలీలను ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యవిధానపరిషత్లో పని చేస్తున్న పలువురు స్పెషలిస్ట్ డాక్టర్లు తమ సీనియార్టీని, ప్రమోషన్లను వదులుకొని డీఎంఈ పరిధిలో మెడికల్ కాలేజీలకు బదిలీపై వచ్చారు. మెడికల్ కాలేజీకి వచ్చి రెండున్నరేండ్లే అయినప్పటికీ వైద్యవిధాన పరిషత్‌లో చేసిన సర్వీసును కూడా పరిగణలోకి తీసుకొని ట్రాన్స్ఫర్స్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
తాము సర్వీస్‌తోపాటు ప్రమోషన్లు వదులుకొని వచ్చినా లాంగ్ స్టాండింగ్ పేరుతో ట్రాన్స్ ఫర్ చేయడాన్ని డీఎంఈలోకి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీజీహెచ్ నుంచి ఇద్దరు విల్లింగ్తో వెళ్లగా మిగిలిన నలుగురిని కొత్తగూడెంలోని జీజీహెచ్‌కు వెనక్కి రప్పించాలని సాతానికులు , డీఎంఈ, ఎమ్మెల్యేను ప్రజలు కోరుతున్నారు.