భద్రాచలం, వెలుగు : భద్రాచలం డివిజన్లోని చర్ల మండలంలో ఛత్తీస్‌గఢ్ బార్డర్లో గురువారం ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. వైద్యులతో 150 మంది ఆదివాసీలకు మెడికల్ టెస్టులు నిర్వహించారు. ఎర్రంపాడు, బత్తినపల్లి, బట్టిగూడెం గ్రామస్తులకు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి చెన్నాపురం గ్రామానికి తరలించారు. స్పెషలిస్టులతో ఆదివాసీలకు టెస్టులు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
చిన్నారులకు దుస్తులు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లను ఎస్పీ రోహిత్‌రాజ్, భద్రాచలం ఏఎస్పీ అంకిత్‌కుమార్ శాంక్వర్ అందజేశారు. చెన్నాపురం పాఠశాలను సందర్శించి చిన్నారుల చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంఘ విద్రోహక శక్తులకు సహకరించొద్దని కోరారు. ఈ క్యాంపులో చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు శ్రీనివాస్, నర్సిరెడ్డి, పీవీఎన్ రావు, వైద్యులు పాల్గొన్నారు.