- రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచన
న్యూ ఢిల్లీ: కరోనాపై పోరాటానికి ఈఎన్టీ డాక్టర్లను, రెసిడెంట్ డాక్టర్ల సేవలను కోరాలని అన్ని రాష్ట్రాలను, యూటీలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఆదివారం అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు, యూటీల ప్రభుత్వాలకు లేఖ రాసింది. కరోనా లక్షణాలున్నవారి నుంచి శాంపిల్స్ సేకరించేందుకు అర్హతగల సిబ్బంది అవసరం ఎక్కువగా ఉందని, వారి సంఖ్య పెంచాలని లేఖలో పేర్కొంది. రాష్ట్రాలలోని అన్ని మెడికల్ కాలేజీలు తమ సేవలందించేందుకు ప్రభుత్వాలను సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితి సందర్భంగా వైద్య సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కరోనా లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నవారి ముక్కు, నోటి నుంచి శాంపిల్స్ సేకరించేందుకు ప్రొఫెషనల్స్ కావాల్సి ఉన్న మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వ రంగం సంస్థలు, సెక్యూరిటీ ఫోర్సెస్, ప్రవేటు రంగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, రిటైర్ అయిన డాక్టర్లు కరోనాపై పోరాటానికి ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం మార్చి 25న విజ్ఞప్తి చేసింది. ఈ పిలుపు మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందించేందుకు సెక్యూరిటీ ఫోర్సెస్ కు చెందిన 30 వేల మంది డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.